ఆదివారం, అక్టోబర్ 25, 2020

ట్రావెలాగ్

Published : 24/01/2020 00:31 IST
చప్పట్లు కొట్టి చూడు.. సిత్తరాల జలసిరి పడు

చప్పట్లు కొడితే.. గూటిలోని గువ్వ పిల్ల ఎగిరిపోతుంది. వీధిలోని కుక్క పిల్ల దిక్కులు చూస్తుంది. కన్నంలోని ఎలుక పిల్ల జడుసుకుంటుంది. అవే చప్పట్లు.. అక్కడ కొడితే!రాతిపరుపు కింద తలదాచుకున్న జలసిరి ఉబికి వస్తుంది. బండరాళ్ల పగుళ్ల నుంచి నీటి ఊట బయటకొస్తుంది. ఈ అద్భుతాన్ని చూడాలంటే చాలా దూరం వెళ్లాలి. చాలా జాగ్రత్తతో అడుగేయాలి. ఇంతకీ ఈ మార్మిక లోకం ఎక్కడుందంటే?

జలపాతం అంటే.. జలధారల గలగలలు వినిపించాలి. నీటి తుంపర్లు పన్నీటి జల్లు కురిపించాలి. అయితే అక్కడ ఎలాంటి గలగలలు వినిపించవు. జలజలలు కనిపించవు. కానీ, ఒక్కసారి చప్పట్లు కొడితే చాలు.. జలరాశి సౌందర్యం కళ్లముందు ఆవిష్కృతం అవుతుంది. గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తే చాలు.. అప్పటి దాకా మెదలక ఉన్న రాళ్లల్లో కదలిక మొదలవుతుంది. రాతిపొరల్లో నుంచి నీళ్లు పుట్టుకొస్తాయి. ఈ అద్భుత జలపాతం.. నల్లమల్ల అడవిలోని చెంచు పెంట.. సంగడి గుండాల దగ్గర మనకు కనిపిస్తుంది.

ఎక్కడుంది?

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం పరిధిలోని చిన్న చెంచు పెంట సంగడి గుండాల. దట్టమైన అడవిలో ఉంటుందిది. ఇక్కడ ఏడు జలపాతాలున్నాయి. వర్షాకాలంలో ఇవన్నీ ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. శీతకాలం చివరినాటికి జలధారలు మాయమవుతాయి. సంగడి గుండాల ప్రధాన గుండం విశాలంగా ఉంటుంది. చుట్టూ పొరలు పొరలుగా పరుచుకున్న రాతి పరుపు. మధ్యలో ఏడాది పొడవునా జలకళతో కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలి?

హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో 150 కిలోమీటర్ల తర్వాత ఫరహాబాద్‌ గేట్‌ వస్తుంది. అక్కడ అటవీశాఖ అనుమతి తీసుకొని వారి వాహనంలో గానీ, సొంత వాహనంలో గానీ వెళ్లాలి. జీపు లాంటిదైతే మంచిది. అడవిలో 8 కి.మీ. ప్రయాణిస్తే రాంపూర్‌ క్రాస్‌రోడ్‌ వస్తుంది. మరో 24 కి.మీ. ముందుకెళ్తే బౌరాపూర్‌ చేరుకుంటాం. అక్కడి నుంచి 10 కి.మీ. ప్రయాణించి మేడిమల్కల వెళ్లాలి. తర్వాత మరో 8 కి.మీ. ముందుకుసాగితే సంగడి గుండాల వస్తుంది. గుండానికి ఒక కిలోమీటరు దూరం వరకు వాహనంలో వెళ్లొచ్ఛు

ఎప్పుడు అనుకూలం?

వర్షాకాలంలో ఈ అరణ్యంలో వెళ్లడమంటే మాటలు కాదు. శీతకాలం విహారానికి అనుకూలం. అక్టోబరు నుంచి ఫిబ్రవరి మాసాంతం వరకు అదృశ్య జలపాత విన్యాసాలు ఆస్వాదించొచ్ఛు

భ్రమరాంబ సన్నిధిలో..

ఆదివాసీల చిన్న పెంట బౌరాపూర్‌. భ్రమరాంబ ఆవాసమిది. ఆదిశంకరాచార్యులు దర్శించిన ప్రదేశమిది. ఆదిశంకరులు.. భ్రమరాంబపై అష్టకాలు, స్తోత్రాలు ఇక్కడే రచించారని చెబుతారు. ఈ పరిసరాలన్నీ ఆధ్యాత్మికతతో పులకిస్తూ కనిపిస్తాయి. శివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బౌరాపూర్‌లో ఏటా జాతర నిర్వహిస్తోంది. ఆలయం చెంతనే ఉన్న పెద్ద చెరువులో స్నానం చేసి, అమ్మవారికి దండం పెట్టి, ఆలయంలో సేదతీరి, అక్కడున్న చెంచులతో చెలిమి చేసుకొని, ఆప్యాయంగా వారిచ్చే తేనెను ఆస్వాదించి ఆదమరిచిపోవచ్ఛు జింకలు, లేళ్లు, దుప్పులు.. అలా మన పక్కనే తిరుగుతూ కనువిందు చేస్తాయి. బౌరాపూర్‌ సమీపంలో అప్పాపూర్‌ చెంచు పెంట ఉంటుంది. రాత్రయితే, చెంచుల అనుమతి తీసుకొని అక్కడ బస చేయొచ్ఛు

భక్త జన దారిలో..

బౌరాపూర్‌ నుంచి సంగడి గుండాల వెళ్లే దారిలో వచ్చే మరో చెంచు పెంట మేడిమల్కల. అడవిలో మట్టి దారిపై ప్రయాణించాలి. వాహనంలో వెళ్తున్న మాటే గానీ.. సహనానికి పరీక్ష తప్పదు. శతాబ్దాల కిందటిదీ దారి. శ్రీశైలానికి తరలి వెళ్లే భక్తులు ఒకప్పుడు ఈ మార్గంలోనే వెళ్లేవారట. ఈ భీకర అరణ్యంలో భక్తుల కోసం సత్రాలు నిర్వహించే వారట. క్రీ.శ.1290లో కాకతీయుల సామంత రాజు చెరకు బొల్లయరెడ్డి ఈ సత్రాలను పునరుద్ధరించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి కర్ణాటక నుంచి తరలి వచ్చే భక్తులు నేటికీ ఈ మార్గంలోనే కాలినడకన మల్లన్న చెంతకు చేరుకుంటారు.

నిద్రాణం వీడి

సంగడి గుండాలలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. చుట్టూ నిశ్శబ్దం. విహంగాలు మౌనం పాటించినా.. గాలి వేగం మందగించినా.. మన శ్వాస మనకు వినబడేంత నిశ్శబ్దం అలుముకుంటుంది. ఆ సమయంలో చప్పట్లు చరిస్తే... జలవిన్యాసం ఆవిష్కృతం అవుతుంది. కరతాళ ధ్వనులు ప్రకృతికి వ్యతిరేకం కాబట్టి నిద్రాణ స్థితిలో ఉన్న గుట్టలు తమలో దాచుకున్న నీటి ఊటలను వదులుతాయి. అప్పుడే పుట్టిన ప్రవాహాలు.. జలపాతాలై గుండంలోకి జాలువారుతాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వేల ఏళ్ల కిందట ఆదిమ మానవులు చూసి ఆనందించారనడానికి వారు వాడి వదిలేసిన రాతి పరికరాలు నేటికీ ఆ ప్రదేశంలో నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. ఈ యాత్ర ఇక్కడితో ముగించొచ్ఛు ఓపిక ఉన్న వాళ్లయితే మరింత ముందుకెళ్లి పందిబొర్ర మీదుగా నీలగంగ రేవు వరకూ వెళ్లి.. కృష్ణానదిని దర్శనం చేసుకోవచ్ఛు ఏది ఏమైనా ఈ యాత్ర సాహసప్రియులకే అని మరచిపోవద్దు!

డా|| ద్యావనపల్లి సత్యనారాయణ

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని