ఆదివారం, అక్టోబర్ 25, 2020

కథనాలు

Updated : 10/01/2020 06:00 IST
నది గండి కొట్టి.. మది కోట కొట్టి!

పెన్నా తీరం పిలుస్తోంది

గుండెలో ఒత్తిడి కొండలా పేరుకుపోయినప్పుడు.. ఆహ్లాదాన్ని దాని గుండా పారిస్తే...! మనసు కుదుట పడుతుంది. గండ శిలల గుండెలను చీల్చుకుంటూ ప్రవహిస్తున్న నది వయ్యారాన్ని చూస్తే..! అంతకు మించి ఆనందంతో హృదయం ఉప్పొంగుతుంది. మరి ఇలాంటి దృశ్యం చూడాలంటే అమెరికాలోని గ్రాండ్‌కెన్యాన్‌ దాకా వెళ్లాలి కదా!

అవసరం లేదు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని గండికోట వెళితే చాలు. ఈ నెల 11, 12 తేదీల్లో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మరి సంక్రాంతి సెలవుల్లో ఓ రెండు రోజులు అలా వెళ్లొద్దామా..! గండికోట శిల్పాల్లో సంస్కృతిని వెదుక్కుంటూ, పెన్నానదిలో ఆనంద అలలై ప్రవహిద్దామా!

వేల సంవత్సరాల నుంచి పారుతున్న పెన్నానది ఆవిష్కరించిన దృశ్యకావ్యం గండికోట. పెద్ద పర్వతాన్ని రెండుగా చీల్ఛి. మధ్య వంపులు తిరిగి ప్రవహించే ఆ నది తీరు అపురూపం. గండికోటను భారత గ్రాండ్‌ కెన్యాన్‌.. ఆరిజోనా ఆఫ్‌ ఇండియాగా పిలుచుకుంటారు. రాయలసీమ పౌరుషానికి మీసకట్టులా ఎత్తయిన కోట మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది. కడప జిల్లా జమ్మలమడుగుకు 17 కి.మీ. దూరంలో ఉన్న గండికోట.. ఇటు ప్రకృతి చిత్రాలను పరిచయం చేయడంతో పాటు.. చారిత్రక, సాంస్కృతిక సంపదను కళ్లకు కడుతుంది. కోట సిగలో అలంకరించుకున్న సూర్యోదయం, కొండల వెనుక దాక్కుంటున్న సూర్యాస్తమయం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తాయి.

సైరా.. సైనికా!

1123లో కళ్యాణి చాళుక్యుల 9వ రాజు త్రైలోక్య మల్లు సామంతరాజైన కాకరాజు ఇక్కడ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయ, విజయనగర, కుతుబ్‌షాహీల పాలనలో ఈ కోట అభివృద్ధిని సాధించింది. పెమ్మసాని నాయక్‌లు గండికోటను రాజధానిగా చేసుకుని దాదాపు 300 ఏళ్లు పాలించారని చరిత్ర. విజయనగర సైన్యంలో పనిచేసే సుశిక్షిత వీర సైనికులకు గండికోట తయారీ కేంద్రం. సీమ పౌరుషాగ్నికి చిహ్నంగా అప్పట్లోనే కమాండో ఆపరేషన్లలో ఈ సైనికులు ఆరితేరారని చెబుతారు. గండికోట ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానం, వేమన శతకం, అన్నమయ్య కీర్తనల్లోనూ ఉందని దుర్గం కైఫియత్తులో పేర్కొన్నారు. ప్రపంచ యాత్రికుడు, ఫ్రెంచి దేశానికి చెందిన వజ్రాల వ్యాపారి టావెర్నియర్‌ గండికోటను సందర్శించి దీనిని రెండో హంపిగా అభివర్ణించారంటే... ఇక్కడ శిల్ప సౌందర్యం ఎంతగొప్పదో ఊహించుకోవచ్ఛు

కోటలో ఆటలు

గండికోట ఉత్సవం పర్యాటకులకు కొత్త ఉత్సాహాన్ని పంచనుంది. మోటార్‌ పారా గ్లైడింగ్‌ విన్యాసాలు సాహసవంతులను అలరిస్తాయి. సాంస్కృతిక ప్రదర్శనలు కళాప్రియులను రంజింపజేస్తాయి. గండికోట ప్రాశస్త్యాన్ని తెలిపే కళారూపాలను ప్రదర్శించనున్నారు. తెలుగు భాష వైభవాన్ని చాటేలా భువన విజయం, కవి సమ్మేళం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెన్నా నది తీరంలో టెంట్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గండికోటను వీక్షించి పర్యాటకానుభూతిని పొందాలనుకునే వారు ఒక రోజు ఇక్కడ గడపాల్సిందే. పర్యాటకుల విడిది కోసం ఏపీ టూరిజం కార్పొరేషన్‌ వారి శీతల విడిది గృహాలు ఉన్నాయి. tourism.ap.gov.in వెబ్‌సైట్‌లో గదులను బుక్‌ చేసుకోవచ్ఛు

చూడాల్సినవి చాలా..

గండికోట దగ్గర 1200 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పుతో పెన్నానది గలగలలు మన మనసుకు గిలిగింతలు పెడతాయి. ఎర్రటి ఇసుక రాయితో అయిదు కిలోమీటర్లు నిర్మించిన కోట గోడ.. యుద్ధాల్లా ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకొని నిలబడాలనే స్ఫూర్తిని కళ్లలో రగిలిస్తుంది. 60 అడుగుల ఎత్తున్న దర్వాజాలు ఎన్ని బాధలకైనా చెక్కు చెదరవద్దని గుండెకు చెబుతాయి. పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన కోట గోడ శత్రు దుర్భేద్యం. 101 బురుజులు, 21 దేవాలయాలు, 56 స్తంభాలు, జుమ్మా మసీదు, జైలు వంటి నిర్మాణాలు అలనాటి వైభవాన్ని మనోఫలకంపై ముద్రిస్తాయి. ఎర్రకోనేరు, రామబాణపు బురుజు, ఆయుధ కర్మాగారం, రాయల చెరువు, ఫరాబాగ్‌ జలపాతం, కందకాలు, అగడ్తలు, రహస్య మార్గాలు చరిత్ర అన్వేషకులకు సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగిస్తాయి.

చేరుకునేదిలా: గండికోటకు వెళ్లడానికి విమాన, రైలు, రోడ్డు ప్రయాణ వసతులున్నాయి. విమాన యానం ద్వారా వచ్చే వారు మొదట గండికోటకు 77 కిలోమీటర్ల దూరంలోని కడపకు చేరుకోవచ్ఛు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గండికోటకు వెళ్లాలి. చెన్నై-ముంబయి ప్రధాన రైలు మార్గంలోనే గండికోట ఉంది. గుత్తి, గుంతకల్లు జంక్షన్ల నుంచి వెళ్లే రైళ్లలో ముద్దనూరు దగ్గర దిగాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గండికోటకు (26 కి.మీ.) చేరుకోవచ్ఛు

- గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, కడప

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని