బుధవారం, అక్టోబర్ 28, 2020

Updated : 28/02/2020 00:56 IST
గుత్తి వైభవం కోట రాజసం

వారాంతంలో..

నలభైనాలుగో నంబరు జాతీయ రహదారి పక్కనే.... కర్నూలు నుంచి అనంతపురం వెళ్లే మార్గంలో.... కారులో వెళుతున్నారా? గుత్తికి దగ్గరగా కొండపై లీలగా కోట గోడ కన్పిస్తుంది... ఎప్పుడైనా చూశారా? ఈసారి.. మీ వాహనాన్ని అటువైపు మళ్లించండి. గుత్తికోటలోని అద్భుత నిర్మాణాలు మనకు స్వాగతం పలుకుతాయి. సొరంగ మార్గాలు, చెక్కుచెదరని రాతి కట్టడాలు మీ మనసును కట్టిపడేస్తాయి.
బాదామి చాళుక్యుల నుంచి ఆంగ్లేయుల వరకూ ఎన్నో తరాల గురుతులను భద్రం చేసిన ఈ కోటను క్రీస్తుశకం 6వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబులు, టిప్పుసుల్తాన్‌ ఇలా అనేక మంది గుత్తికోటను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు నిర్వర్తించారు. పాలెగాళ్ల కాలంలో సుమారు 1000 మంది కూలీలతో ఈ కోటను మరింత పటిష్టపరిచారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయా కుటుంబాలు నేటికీ బళ్లారి, ఉరవకొండ మధ్యలో ఉన్న నక్కపల్లి గ్రామంలో ఉన్నాయి. ఆ కుటుంబాల్లో పుట్టిన వారి సంతతిని నేటికీ గుత్తప్ప, గుత్తమ్మ అని పిలుచుకుంటారు. గుత్తి కోట గురించి చెప్పిన తొలి శాసనాలన్నీ కన్నడ, సంస్కృత భాషల్లో లిఖించారు. వీటిల్లో ఈ కోట పేరు ‘గధ’ అని, బుక్కరాయల శాసనంలో ‘రాజదుర్గం’ అని ప్రస్తావించారు. ఆంగ్లేయులు గుత్తి కేంద్రంగా దత్త మండలాలను పాలించారని చెబుతుంటారు.
పుష్పాల గుత్తే.. గుత్తి
అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణాన్ని ఈ కొండ మూడు వైపులా వడ్డాణంలా చుట్టుకొని ఉంటుంది. ఈ కొండ చుట్టూ 16 కి.మీ. పొడవునా రాతి గోడలు శంఖు ఆకృతిలో కన్పిస్తుంటాయి. నత్తగుల్ల, శంఖం, గవ్వ ఆకారంలో కన్పించే ఈ కోట గోడ అయిదు మీటర్ల ఎత్తు, రెండున్నర మీటర్ల వెడల్పుతో ఉంటుంది. కోటకు 15 బురుజులు, 15 ప్రధాన ముఖ ద్వారాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. ఇక్కడి కొండలు దూరం నుంచి పుష్పాల గుత్తిలా కనిపించడంతో ఈ ఊరికి గుత్తి అన్న పేరు స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. ఆవరణలో రెండు శాసనాలు, వ్యాయామశాల, మురారిరావు గద్దె ఉన్నాయి. మురారిరావు గద్దె నెక్కితే గుత్తి మొత్తం కన్పిస్తుంది. ఈ కోటను ఎర్రకోట కంటే పెద్దదని, గోల్కొండ కంటే విశాలమైనదని చెబుతారు. అపురూప కట్టడాలు, అద్భుతమైన శిల్ప కళ, రాణివాసాలు, బావులు.. కారాగారాలు.. విడిది గృహాలు కనులవిందు చేస్తాయి.

ఎన్నో విశేషాలు
కొండమీదకు కాలి నడకనే వెళ్లాలి. మొదట విశాలమైన మైదానం కనిపిస్తుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే.. వ్యాయామశాల, ఆయుధ గిడ్డంగి, సైనికుల కవాతు మైదానం, అశ్వ, గజశాలలు, వంట గది, నేల మాలిగలు ఆనాటి వైభవాన్ని శంఖంలా పూరిస్తుంటాయి. కోటపైకి ఎక్కే కొద్ది కన్పించే 101 బావులు రాజుల ముందుచూపును తెలియజేస్తాయి. కోట గోడలు రాజసాన్ని ఒలకబోస్తాయి.
ఇక్కడున్న ధాన్యాగారంలో రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వ ఉంచేవారట. కరవొచ్చినా, ఏదైనా యుద్ధం వచ్చినా.. కొంతకాలం కోట ద్వారాలు మూసినా.. ధాన్యానికి కొరత ఉండేది కాదట.
చేరుకునేదిలా: హైదరాబాద్‌, బెంగళూరు, బళ్లారి, కడపలను కలుపుతూ గుత్తికి రైలు మార్గం ఉంది. రైళ్లో వెళ్లడం సులభం. కర్నూలు నుంచి 95 కి.మీ. దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. మెట్లెక్కి కోటపైకి చేరుకోవాలి. ఒకప్పుడు ఈ దారిలో గుర్రాలు వెళ్లేవట. వాటి కోసం ఈ మార్గంలో పచ్చిక మైదానాలు, ప్రత్యేక అశ్వశాలలు నిర్మించారు.

- గుత్తిగళ్ల సురేంద్రబాబు, గుత్తి, గుండ్రాతి రాజేష్‌గౌడ్‌, కడప

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని