మహిళా జయహో

Published : 01/03/2021 00:21 IST
చక్రాలకుర్చీ అద్దె రోజుకు రూపాయి!

వీల్‌ ఛైర్‌, ట్రావెలింగ్‌ కుర్చీ, వాకర్‌, వాక్‌ స్టిక్‌, కేన్స్‌, నీ, నెక్‌ బ్రాసెస్‌ ... దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారిలో చాలామందికి ఈ పరికరాల అవసరం ఎక్కువగా ఉంటుంది. వీటి ఖరీదూ అదే స్థాయిలో ఉంటుంది. మరి అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితి ఉండేవాళ్లు వీటిని వాడాలంటే.. ఎలా? గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఫల్గుణి దోషికి వచ్చిన ఈ ఆలోచన ఓ వినూత్న సేవా కార్యక్రమానికి కారణమైంది. అలాంటి పరికరాలను రూపాయికే అద్దెకు ఇస్తోంది. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే..?
ఫల్గుణి అమ్మమ్మకు జబ్బు చేసింది. ఆ సమయంలో ఆమె కోసం చక్రాలకుర్చీ, వాకర్‌ను కొన్నారు. కొన్నాళ్లపాటు వాటిని ఆ పెద్దావిడ ఉపయోగించుకున్నారు. ఆమెకు జబ్బు తగ్గాక వాటిని మూలన పడేశారు. అదే సమయంలో అవసరమైనవారు అవి దొరక్క ఇబ్బంది పడటమూ ఫల్గుణి చూసింది. ఇలాంటి వస్తువులను కావాల్సినవారికి అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందామెకు. అలా స్నేహితుడు సోనాల్‌తో కలిసి ‘హెల్పింగ్‌ హ్యాండ్‌’ సంస్థను స్థాపించారు ఇందులో భాగంగా అవసరమైనవారికి చక్రాల కుర్చీలు, వాకర్‌లు, క్రచెస్‌... ఇతర వస్తువులను  రూపాయికే అద్దెకిస్తారు. ఆ నోటా, ఈ నోటా ఈ సంస్థ గురించి ఆ ప్రాంతమంతా తెలిసిపోయింది. దాంతో చాలామంది తమకు కావాల్సిన వస్తువులను దీని నుంచి పొందుతున్నారు. అలాగే మరికొందరు దాతలు తమ వద్ద నిరుపయోగంగా ఉన్న పరికరాలను వీరికి విరాళంగా అందిస్తున్నారు. ఫల్గుణి కొన్ని వస్తువులను కొని అందుబాటులో ఉంచింది. ‘మేమేదో చిన్నగా మొదలుపెట్టాలనుకున్నాం. ఇంత పెద్దగా మారుతుందని అనుకోలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నా’ అని అంటోంది ఫల్గుణి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని