మహిళా జయహో

Published : 01/03/2021 00:21 IST
కొండను తవ్వి... ఊరికి జలధార!

పట్టుదలతో ప్రయత్నిస్తే...కొండలనైనా పిండి చేయొచ్చు అన్న మాట...ఈ బృందానికి చక్కగా నప్పుతుంది. కరవుతో అల్లాడుతోన్న తమ గ్రామానికి జల సిరులను తెచ్చి...తమ తలరాతల్నే మార్చేసుకున్నారు. కొండ చుట్టూ కందకాలు తవ్వి వర్షపు నీటిని మళ్లించారు. చెక్‌ డ్యామ్‌లు కట్టారు. ఫలితంగా ఆ గ్రామం సస్యశ్యామలం అయ్యింది. దీన్ని ముందుండి నడిపించింది ఓ పందొమ్మిదేళ్ల అమ్మాయి.
మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో ఉంది అగ్రోతా అనే గిరిజన గ్రామం. మూడేళ్ల క్రితం వరకూ ఇక్కడి ప్రజలు నీటి కొరతతో అల్లాడిపోయేవారు. గుక్కెడు నీళ్లకోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారు. పిల్లలు పాఠశాలలకు దూరమయ్యారు.  పంటలు పండక, ఉపాధి లేక ఊరంతా ఇబ్బంది పడేవారు. మూగజీవాలు సైతం నీళ్లు దొరక్క అల్లాడిపోయేవి. వర్షపాతం అంతంత మాత్రమే కావడంతో రైతుల బాధలు వర్ణనాతీతం. ఊళ్లో డెబ్బై ఎకరాల్లో చెరువు విస్తరించి ఉన్నా... ఏడాది పొడవునా కనీస స్థాయిలోనూ నీటి జాడ కనిపించేది కాదిక్కడ. పడే కొద్దిపాటి వాన నీళ్లూ గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ అవతలి నుంచి పారి అక్కడి బచ్చేరీ నదిలో కలిసిపోయేవి.
కొండని తవ్వి వర్షపు నీటిని కాలువల ద్వారా మళ్లిస్తే చెరువు నిండుతుందనే విషయం ఊరివాళ్లందరికీ తెలుసు. కానీ అది అటవీశాఖ పరిధిలో ఉంది. అక్కడ అంగుళం భూమిని తవ్వడానికి కూడా వారు అనుమతించలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని గ్రామపంచాయతీ సైతం వెనకడుగు వేసింది.

ఈ దుస్థితిని మార్చడానికి మనమే ముందడుగు వేయాలంటూ పన్నెండు మంది మహిళలు ఈ సమస్య పరిష్కారానికి నడుము బిగించారు. వారందరికీ డిగ్రీ చదువుతోన్న బబిత నాయకత్వం వహించింది. మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చింది. అవసరమైన అనుమతులను కోరుతూ అటవీ అధికారులకు లేఖలు రాసేది. పట్టు వదలకుండా వారి చుట్టూ తన బృందంతో ప్రదక్షిణలు చేసింది. దీంతో వారు స్పందించక తప్పలేదు. అందుకు ప్రతిగా వారు గ్రామస్థుల నుంచి అటవీ పరిరక్షణకు సహకరిస్తామనే హామీ తీసుకున్నారు. ఇందుకోసం చెట్లను నరకొద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఊరి ప్రజల సాయంతో ఐదువేలకు పైగా మొక్కల్ని నాటించింది.
అడుగడుగునా ఇబ్బందులే...
అప్పటికే కొందరు చెరువు స్థలాన్ని కబ్జా చేసి పంటలు వేసుకున్నారు. నీళ్ల కోసం ఈ మహిళలు చేస్తున్న పోరాటం వల్ల ఆ చెరువు నిండితే...వారు ఆ భూమిని కోల్పోవలసి వస్తుంది. అందుకే  అడ్డుపడ్డారు. అయినా మహిళలు పట్టువీడలేదు. కొండను తవ్వడానికే పూనుకున్నారు. గ్రామస్థులు-మహిళలు-అటవీఅధికారుల మధ్య ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించడానికి బబిత జట్టుకి సాయం చేయడానికి పరమార్థ్‌ సమాజ్‌ సేవా సంస్థ ముందుకు వచ్చింది. చివరికి వీరందరి సహకారంతో బబిత కబ్జాల చెర నుంచి చెరువుని విడిపించింది. అవసరమైన అనుమతులు వచ్చాయి.  మొదట 13 మంది మహిళలు వర్షపు నీటికి దారి చేయడం ప్రారంభించారు. అసలు ఇది సాధ్యమవుతుందా? అన్నవారంతా క్రమంగా వారితో చేరారు. అలా కొద్దికాలానికే ఆ సంఖ్య రెండువందలు దాటేసింది. మొత్తం మీద ఏడు నెలలు కష్టపడి అనుకున్నది సాధించారు. కొండ చుట్టూ 107 మీటర్ల పొడవైన కందకాన్ని తవ్వారు. మూడు చెక్‌డ్యామ్‌లు కట్టారు. ఇప్పుడు వారి కష్టాలకు ముగింపు దొరికింది. ‘ఇంట్లో పని త్వరగా ముగించుకుని ఇక్కడకు చేరుకునేవాళ్లం. వర్షాకాలం వచ్చేనాటికి చెరువు నిండిపోవాలనే ఆలోచనతో ఈ కాలువలు తవ్వాలనుకున్నాం. ఇందుకు అవసరమైన సామగ్రిని మేమే తెచ్చుకున్నాం. ఎప్పుడూ అంత ఎక్కువగా శ్రమ చేయలేదు. ఎండకు కళ్లు తిరిగేవి...అర చేతుల్లో బొబ్బలు వచ్చేసేవి. అయినా బాధపడలేదు’ అని చెబుతోంది బబిత. క్రమంగా భూగర్భ జలాలు నిండాయి. ఒక పంటతో సరిపెట్టుకోకుండా రైతులు ఆవాలు, బఠాణీలు వంటివి సాగు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తోంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని