మహిళా జయహో

Published : 01/03/2021 00:21 IST
చిన్నాన్న కష్టం... ఆవిష్కరణకు కారణం

చిన్నాన్న అనారోగ్యంతో ఆ విద్యార్థి పడ్డ ఆవేదన ఓ ఆవిష్కరణకు కారణమైంది. అదుపులేని వణుకుకు కారణమయ్యే ‘పార్కిన్సన్‌’ వ్యాధి శరీరంలో ఎక్కడ పుడుతుందో గుర్తించగలిగే పరికరాన్ని  రూపొందించింది. దీనికి ‘బ్రాడ్‌కం-ఐఆర్‌ఐఎస్‌ అవార్డు 2020-21’ను దక్కించుకుంది. ఆమే .. పుణెకి చెందిన జూయీ కేస్కర్‌. ఈ పరికరం అమెరికాలోని ఐఎస్‌ఈఎస్‌ ప్రదర్శనలో భారతదేశం తరఫున ప్రదర్శించŸడానికి జూయీ అర్హత సాధించింది.

జూయీ బాబాయి తొమ్మిదేళ్లుగా పార్కిన్సన్‌ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ అనారోగ్యాన్ని తగ్గించడం కోసం ఆ కుటుంబం తిరగని ఆసుపత్రి లేదు. ఆయనకు తనవంతు సాయాన్ని అందించేది జూయీ. వ్యాధి స్థాయిని చూసి వైద్యులు అప్పటికప్పుడు మందులిచ్చేవారు. కానీ దాని తీవ్రతను కచ్చితంగా అంచనా వేసే పరికరం ఇంతవరకూ లేదు. ఇది చాలా బాధాకరం అంటోందామె. ఈ సమస్య ఎలా వస్తుందో తెలుసుకోగలిగితే దాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించొచ్చు. కానీ అలా గుర్తించే అవకాశం లేకపోవడంతో వ్యాధిగ్రస్థులకు సమస్యలు తప్పడం లేదు. దీని పరిష్కారం కనుక్కోవడానికే ఆమె తపించింది. ఓ పరికరానికి రూపకల్పన చేయాలని పట్టుదలగా కృషి చేసింది. ‘ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సాంకేతికతపై అవగాహన పెంచుకున్నా. సాఫ్ట్‌వేర్‌లో పైథాన్‌ లాంగ్వేజ్‌ ప్రోగ్రాంపై ప్రత్యేక కోర్సు చేశా. ఓపెన్‌ సోర్స్‌ హార్డ్‌వేర్‌ కోసం ఆన్‌లైన్‌ వీడియోలు పరిశీలించేదాన్ని. వీటన్నిటి సాయంతో నూతన పరికరాన్ని కనిపెట్టగలిగా’ అంటోంది జూయీ. చేతి గ్లవుజులా ఉండే ఈ పరికరమే ‘జేట్రెమోర్‌-3డీ డివైస్‌’. దీన్ని రోగి ధరిస్తే ఇందులోని సెన్సర్స్‌, గిరో మీటర్స్‌ సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానమవుతాయి. ఇవి సెకనులోని పదోవంతులోపు వచ్చే వణుకు స్థాయిని డేటా రూపంలో ట్రాక్‌ చేస్తాయి. ఈ సమాచారంతో వణుకు ఎక్కడ పుడుతోందో వైద్యులు తెలుసుకోవచ్చు. దానికి తగ్గ చికిత్స అందించొచ్చు. జూయీ ఆవిష్కరణకు పలు ప్రశంసలు దక్కాయి. డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం నేషనల్‌ అవార్డు, పుణె సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం నుంచి ‘ఇన్‌స్పైర్‌-మనక్‌’ అవార్డులు వచ్చాయి. తాజాగా ‘బ్రాడ్‌కం-ఐఆర్‌ఐఎస్‌ అవార్డు 2020-21’నూ అందుకుంది. ప్రస్తుతం ఈమె రూపొందించిన పరికరానికి పేటెంట్‌ హక్కుల కోసం ఫైల్‌ చేసింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని