మహిళా జయహో

Updated : 28/02/2021 02:43 IST
నేను వాళ్ల రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా!

‘పెళ్లంటే ఒకరి బాధ్యతల్ని మరొకరు ఇష్టంగామోయడం... మా అమ్మానాన్నలు ఆ పనిని ఎంతో ఇష్టంగా చేశారు..’ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన భార్య లత నలభయ్యో పెళ్లిరోజుని ఉద్దేశించి కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్‌ ఇది. దేశం మెచ్చిన నటుడు రజనీ ఎదుగుదలలో లత పాత్ర చిన్నదేం కాదు.. ముఖ్యంగా పిల్లల విషయంలో పూర్తిగా బాధ్యతలు తలకెత్తుకున్నారు. వివిధ సందర్భాల్లో పిల్లల పెంపకం గురించి లత చెప్పిన విషయాలివి...
రజనీకి పిల్లలతో గడిపే అవకాశం ఉండేదికాదు. అందుకే వాళ్లని స్కూల్లో చేర్పించడం నుంచి పెద్దైన తర్వాత వారి ఇష్టాయిష్టాలను గుర్తించి ప్రోత్సహించడం వరకూ అన్నీ నేనే చేసేదాన్ని. అంటే అన్నీ నా ఇష్టం అని కాదు. నేను చేసే ప్రతిపనీ, వేసే ప్రతి అడుగూ ముందుగా ఆయనతో చెప్పే చేసేదాన్ని. ఏ నిర్ణయమైనా ఇప్పటికీ ఇద్దరం కలిసే తీసుకుంటాం.
మేం మంచి స్నేహితులం. ఆ తర్వాతే దంపతులం. అందుకే బిడ్డల బాధ్యత నాకు కష్టమనిపించలేదు. పిల్లలపై సినిమాల ప్రభావం పడకుండా చాలా సాదాసీదా జీవితాన్ని పిల్లలకు అలవాటు చేశా. ఎందుకుంటే నేనూ, ఆయనా  కూడా చాలా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవాళ్లమే. అందుకే అమ్మ నుంచి నేర్చుకున్న కుటుంబ విలువలను నా పిల్లలకు అందిస్తున్నా
నా చిన్నప్పుడు అమ్మ మా అందరికీ రోల్‌మోడల్‌. ఓ భార్యగా, తల్లిగా ఆమె నిర్వర్తించే బాధ్యతలను దగ్గరుండే గమనించేదాన్ని. అలాగే నా పిల్లలకు నేను కూడా  రోల్‌మోడల్‌గా ఉండాలనుకున్నా. వారిని అలాగే పెంచాను కూడా. పిల్లలంటే నా దృష్టిలో
ప్రపంచాన్ని అందంగా మార్చడానికి భగవంతుడు పంపిన దేవదూతలు.


నాకు పిల్లలంటే చాలా ఇష్టం. స్కూల్‌రోజుల్లోనే మా ఇంటి వరండాలో పేద పిల్లల కోసం చిన్న గ్రంథాలయమే ఏర్పాటు చేశా. చుట్టుపక్కల పిల్లలందరికీ కథలు చెప్పి, పాటలు పాడి సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేదాన్ని. యతిరాజ్‌ కాలేజీలో చదివేటప్పుడు తొలి పాప్‌ బ్యాండ్‌ను ప్రారంభించా. నాకు నలుగురు స్నేహితురాళ్లు ఉండేవాళ్లు. అందరం కలిసి ప్రపంచమంతా పర్యటించి ఆల్బంలు చేయాలని, పేద పిల్లలకు విద్యనందించాలని అనుకునేవాళ్లం. అలా పిల్లలపై ప్రేమ నన్ను వారి కోసం ‘శ్రీదయా ఫౌండేషన్‌’ను స్థాపించేలా చేసింది.  వీధిబాలల కోసం మొదలుపెట్టిన ఈ సంస్థలో అనాథ చిన్నారులను చేర్చుకుంటున్నాం. ఒకసారి తమిళనాడులో వీధిబాలలు మాయమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. మా ఫౌండేషన్‌ చెన్నైలోని మరికొన్ని ఎన్జీవోలతో కలిసి చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల తరఫున ఉండి రాష్ట్రపోలీసు విభాగాన్ని కదిలించాం. అలాగే ఈ పిల్లల కోసం అభయం ప్రాజెక్ట్‌ను రూపొందించాం. ఇందులో ప్రతి పౌరుడూ తన వంతు సేవలందించేలా వేదికనూ ఏర్పాటు చేశాం. ఎక్కడ చిన్నారులు తమ హక్కులను కోల్పోతున్నా లేదా దాడులకు గురవుతున్నా మాకు సమాచారం అందించొచ్చు. అలాంటి వారిని మేం అక్కునజేర్చుకుని విద్య, ఆరోగ్యం వంటివన్నీ అందేలా చేస్తాం. పేద పిల్లల ముఖాలపై చిరునవ్వు చెదరకుండా ఉండటానికి కృషి చేస్తున్నా. అలా చాలామంది అనాథ పిల్లలకు తల్లినయ్యా.


నావల్ల రజనీ క్షణంకూడా బాధపడకూడదనుకుంటా. ఆయన చేసే ప్రతి పాత్రనూ ఎంజాయ్‌ చేయడంలో నా తర్వాతే ఎవరైనా. అలాగే నేను పాడే ప్రతిపాటకు మొదటి శ్రోత ఆయనే. మేమిద్దరం ప్రతి విషయాన్ని పంచుకున్నట్లే, కొన్ని సందర్భాల్లో ఒకరినొకరం ప్రశంసించుకుంటాం.  ప్రతి నిమిషం మమ్మల్ని మేం తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇదే మా నుంచి పిల్లలు నేర్చుకోవాలని కోరుకుంటాం.
కొన్ని విషయాల్లో మనం వాళ్లకి నేర్పించేదానికన్నా వారి నుంచి నేర్చుకోవాల్సిందే ఎక్కువగా ఉంటుందేమో అనిపిస్తుంది. పిల్లల్లోని ప్రతిభను గుర్తించగలగాలి. అలాగే వారి అభిప్రాయాలనూ గౌరవించాలి. ఇదే సూత్రాన్ని ఐశ్వర్య, సౌందర్య విషయంలోనూ పాటించా. వీరిద్దరిలో సహజమైన సృజనాత్మకత ఉంది. మంచి రచయిత్రులు కూడా. కష్టపడాలనే తత్త్వం వీళ్లని సొంతంగా ఆలోచించేలా చేసి, ఇష్టమైన రంగాల్లో అడుగుపెట్టేలా చేసింది. అందుకే ఐశ్వర్య దర్శకురాలిగా, నిర్మాతగా మారితే సౌందర్య యానిమేషన్‌ రంగంలో విజయం సాధించింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని