మహిళా జయహో

Published : 27/02/2021 01:50 IST
ఆ కండల వెనక కన్నీటి గాథ

అప్పుడు పక్షవాతంతో పనికిరాదనుకున్న చేయి..  ఇప్పుడు కసరత్తులతో కండలు తిరుగుతోంది..  నాడు స్థూలకాయంతో మంచానికే అతుక్కుపోయిన శరీరం ఇప్పుడు బొంగరంలా తిరుగుతూ డాన్సులు చేస్తోంది.  కొన్నేళ్ల క్రితం బతకడమే వృథా అనుకున్న ఆమె ఆత్మవిశ్వాసంతో అతివలెందరికో ఆరోగ్యాన్ని అందిస్తోంది. వరంగల్‌కు చెందిన బద్దం స్రవంతిరెడ్డి స్ఫూర్తిగాథ ఇది. తన కండల వెనక గుండెల్ని మెలిపెట్టే నిజాలను ‘వసుంధర’తో పంచుకొంది..

పెళ్లై పిల్లలు పుట్టాక మహిళలు సహజంగానే బరువు పెరుగుతారు. ఆ బరువుని అదుపు చేసుకోకపోతే బీపీ, మధుమేహం, థైరాయిడ్‌ వంటి వ్యాధులు ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం స్రవంతి పరిస్థితి కూడా అదే. అధిక బరువు కారణంగా తనకెదురయిన సమస్యలతో కుంగుబాటుకు గురైన తర్వాత కొండంత ఆత్మవిశ్వాసాన్ని పొందారు. నలభై ఏళ్ల వయసులోనూ తాను కండలు పెంచడమే కాదు, ఎంతో మంది అమ్మలకు జిమ్‌లో శిక్షణ ఇస్తూ వారినీ తనలా మిసెస్‌ ఫిట్‌గా మార్చేస్తున్నారు. హన్మకొండకు చెందిన స్రవంతి ఇంటర్‌ వరకూ చదివిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు అబ్బాయిలు. పిల్లల పెంపకంలో పడి తనని తాను గమనించుకోలేదు కాదు... ఊబకాయం చుట్టుముట్టింది. అంతలోనే గుండెను పిండేసే మరో పెద్ద దెబ్బ తగిలింది. పక్షవాత లక్షణాలతో ఎడమ చేయి పూర్తిగా లేవలేని స్థితికి వచ్చింది. క్రమంగా నరాలు బలహీన పడి ఎడమ వైపు చేయితోపాటు మెడ భాగంపై తీవ్రమైన ప్రభావం పడింది. దీంతో ముఫ్పై ఏళ్ల వయసులోనే మంచానికి పూర్తిగా అతుక్కుపోయింది. ‘చాలాసార్లు నాకు చావే శరణ్యం అనుకున్నా. కానీ మావారు ధైర్యం చెప్పి నాలో ఆత్మవిశ్వాసం నింపారు. తొలుత హన్మకొండలో ప్రకృతి చికిత్స కేంద్రంలో చేరారు. తర్వాత యోగాసనాలు ప్రారంభించడంతో నా చేయి నెమ్మదిగా కోలుకోవడం మొదలు పెట్టింది. ఒకపక్క వైద్యంతోపాటూ వారి సలహాతో ఏరోబిక్స్‌ కూడా నేర్చుకున్నా. అప్పటి వరకు వంద కిలోల బరువున్న నేను వ్యాయామం, యోగా వల్ల నెమ్మదిగా బరువు తగ్గడం మొదలుపెట్టాను. అప్పుడే నాలాంటి వారికోసం ఒక జిమ్‌ ఏర్పాటుచేస్తే బాగుంటుందని అనుకున్నా. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా.’ అనే స్రవంతి.. హన్మకొండలో జిమ్‌ ఏర్పాటుచేశారు. ఆమె విజయ గాథ విన్న చాలా మంది మహిళలు బిడియం విడిచిపెట్టి నలభై, యాభై ఏళ్ల వయసులో కూడా జిమ్‌కి వస్తున్నారు. పక్షవాతానికి గురైన ఎంతో మంది వృద్ధుల ఇళ్లకు వెళ్లి స్రవంతి వారికి వ్యాయామం తరగతులు చెబుతూ ధైర్యం నూరిపోస్తున్నారు. ఒకప్పుడు కిలో బరువు లేపలేని స్థితి నుంచి ఇప్పుడు వంద కేజీల వెయిట్‌ లిఫ్టర్‌గా మారి ఔరా అనిపిస్తున్నారు.
- గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని