ఆమె పేరు ప్రియదర్శిని... ఊరు చల్పాక. పేదింటి నుంచి వచ్చి వెయింట్ లిఫ్టింగ్‌లో పతకాల పంట పండిస్తోంది ప్రియదర్శిని. తాజాగా ‘ఖేలోఇండియా’ పథకానికి ఎంపికై ఒలింపిక్స్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది...
తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తెలంగాణలోని ఏటూరునాగారం మండలంలో ఉన్న చల్పాక గ్రామం ప్రియదర్శిని స్వస్థలం. నలుగురు ఆడపిల్లల్లో ఆమే పెద్దది. చిన్నతనం నుంచి ఆటల పట్ల ఆసక్తిని పెంచుకున్న ప్రియదర్శినికి మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రవేశం లభించింది. అక్కడే తన నైపుణ్యాలకు పదును పెట్టుకుని వెయిట్ లిఫ్టింగ్‌లో రాణించడం మొదలుపెట్టింది. జిల్లాస్థాయితో మొదలుపెట్టి... రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాల పంట పండించిన ప్రియదర్శిని ప్రస్తుతం బెంగళూరులోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటూ బీఏ తృతీయ సంవత్సరం చదువుతోంది.
ఆమె ప్రతిభను మెచ్చిన భారత ప్రభుత్వం ఖేలోఇండియా పథకం కింద ఎంపిక చేసింది. 2024లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తలపడేందుకు దేశవ్యాప్తంగా తొమ్మిది మందిని ఎంపిక చేస్తే అందులో ప్రియదర్శిని కూడా ఒకరు కావడం విశేషం. ఇలా ఎంపిక చేసిన వారికి ఒలింపిక్స్ గెలిచేందుకు కావాల్సిన శిక్షణ అందిస్తారు. ప్రియదర్శిని చెల్లెలు గౌతమి, సితార డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మరో చెల్లెలు ప్రగతి, తమ్ముడు వినోద్‌కుమార్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ‘నన్నో పెద్ద క్రీడాకారిణిగా చూసి మురిసిపోవాలని అమ్మానాన్నల ఆశ. అందుకు ఎంత కష్టమైనా వెనకాడేవారు కాదు. ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అమ్మా, నాన్నల కలను నెరవేరుస్తా’ అని చెబుతోంది ప్రియదర్శిని.
- చింతలపల్లి వెంకటేశ్వర్లు, ఏటూరునాగారం