Published : 26/11/2020 00:39 IST
పొత్తికడుపు నొప్పి భరించలేకపోతున్నా

నా వయసు నలభై. ఇద్దరు పిల్లలు. రెండుసార్లు సిజేరియన్‌ అయ్యింది. పదేళ్ల కిందటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నా. ఈమధ్య పది, పదిహేను రోజులకోసారి పొత్తి కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది. ఆ నొప్పి రోజంతా ఉండి మర్నాటికి తగ్గిపోతుంది. నెలసరికి ముందూ, తరువాత అని కాకుండా ఎప్పుడైనా ఈ నొప్పి వస్తుంది. ఇదేమైనా పెద్ద సమస్యా?

- ఓ సోదరి

నె

లసరి రెగ్యులర్‌గా వస్తూ... దానికి సంబంధం లేకుండా ఈ నొప్పి వస్తుందంటే కంగారు పడకుండా ఎందుకు వస్తుందోనని ఆలోచించాలి. గర్భాశయం, జీర్ణాశయం, మూత్ర పిండాల సంచికి సంబంధించి... రకరకాల కారణాల వల్ల  పొత్తి కడుపులో నొప్పి రావొచ్చు. అయితే  వేటి వల్ల నొప్పి వస్తుందో తెలుసుకోవడానికి కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయానికి సంబంధించి... గర్భాశయ ముఖద్వార ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా...పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌ వచ్చినా, అలాగే ఎండో మెట్రియోసిస్‌, ఎడినోమయోసిస్‌ లాంటి వ్యాధులు లేదా ఫైబ్రాయిడ్‌ సమస్యలు... ఇలాంటివేమైనా ఉన్నా కూడా పొత్తి కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నొప్పికి కారణమేంటో తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్‌ పెల్విక్‌ స్కాన్‌, పాప్‌స్మియర్‌... లాంటి పరీక్షలను చేసి గైనకాలజిస్టు సమస్య ఏమిటో తెలుసుకుంటారు. కొన్నిసార్లు అండాశయం నుంచి అండం విడుదలైనప్పుడూ ఇలా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా మీకు ‘రికరెంట్‌ యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఏమైనా వస్తున్నాయా? మూత్ర పిండాల సంచిలోకి ఇన్‌ఫెక్షన్‌ ఏమైనా వ్యాపిస్తుందా... కిడ్నిలో చిన్నచిన్నరాళ్లలాంటివి ఏర్పడి మూత్రం ద్వారా బయటకు వస్తున్నాయా?’ అని గమనించాలి. జీర్ణకోశానికి సంబంధించినంత వరకు మలబద్ధకం, ఇన్‌ఫ్లమేటరీ బవెల్‌ డిసీజెస్‌ ఉన్నా కూడా ఇలా నొప్పి రావొచ్చు. కాబట్టి మీరు వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే సరి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని