ఈ కాలంలో బత్తాయి, నారింజ, కమలాలు ఎక్కువగా దొరుకుతాయి. పండు తిన్నా... తొక్క పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులోనూ బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని అందాన్ని సంరక్షించుకోవడానికి వినియోగిస్తే భలే ప్రయోజనాలు అందిస్తాయి. అవేంటంటే...!
* ఈ తొక్కల్లో విటమిన్ సి, కాల్షియం, థయామిన్, ఫోలేట్, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా నిగారింపుతో కనిపించేలా చేస్తాయి. రెండు చెంచాల నారింజ తొక్కల పొడిలో చెంచా తేనె కలిపి ముఖానికి రాసి మృదువుగా రుద్దండి. ఇలా తరచూ చేస్తే ఫలితం ఉంటుంది.
* ఎండల్లో తిరిగినప్పుడు ముఖం టాన్ పట్టి నల్లగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పావుకప్పు నారింజ తొక్కల పొడిలో కొద్దిగా రోజ్‌వాటర్, కొంచెం నువ్వులనూనె కలిపి రాసుకోవాలి. దీంతో నెమ్మదిగా నలుగులా రుద్దితే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. చర్మం వన్నెలీనుతుంది.