Published : 25/11/2020 00:29 IST
...వారిని ఎందుకు శభాష్‌ అన్నారు?

మానసీజోషి... రిధిమాపాండే... బిల్కిస్‌బానో... ఇసైవాణి.. ఎవరు వీళ్లంతా అనుకుంటున్నారా? ఈ ఏడాది బీబీసీ ఎంపిక చేసిన ధీరోదాత్త మహిళల జాబితాలో ఉన్న మన భారతీయులు వీళ్లు. ‘ప్రపంచాన్ని మార్పు దిశగా నడిపిస్తున్న మహిళలు’పేరుతో బీబీసీ ప్రపంచవ్యాప్తంగా వందమంది మహిళలని ఎంపిక చేస్తే అందులో ఈ నలుగురు కూడా ఉన్నారు.

టైమ్‌ ముఖచిత్రంగా: రోడ్డు ప్రమాదంలో కాలుని కోల్పోయినా ఏ మాత్రం సడలని ఆత్మవిశ్వాసంతో... పారా బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది మానసీజోషి. తన పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో టైమ్‌ పత్రిక ముఖచిత్రంగా మారింది. ఆ స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలు కూడా అందిపుచ్చుకోవాలన్న తపనతో బార్బీ సంస్థ... మానసీ బార్బీ బొమ్మను సైతం విడుదల చేయడం విశేషం.


మా భవిష్యత్తు మాటేంటి: చిన్న వయసు నుంచే పర్యావరణంపై పోరాటం చేస్తున్న పదకొండేళ్ల రిధిమాపాండేను అంతా ‘ఇండియన్‌ గ్రెటాతంబర్గ్‌’ అంటారు. పర్యావరణం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న దేశాలపై ఐరాసలో ఫిర్యాదు చేసిన ఈ అమ్మాయి ‘పీల్చడానికి మాకు కాస్త మంచి గాలిని మిగల్చండి’ అంటూ ప్రధానికి లేఖ రాసి పర్యావరణం గురించి అందరూ ఆలోచించేలా చేసింది.


షహీన్‌బాగ్‌దాదీ: సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌కి  వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో జరిగిన పోరాటానికి ముఖచిత్రమైంది 82 ఏళ్ల బిల్కిస్‌బానో. అందుకే ఆమెని షహీన్‌బాగ్‌దాదీ అని ముద్దుగా పిలుచుకుంటారంతా. ఆ వయసులో ఆమె చూపించిన తెగువని ప్రశంసిస్తూ టైమ్‌ పత్రిక ఆమెని ముఖచిత్రంగా ప్రచురించింది.


పాటల పల్లకిలో: గానా... చెన్నైలోని మురికివాడల్లో పాడుకునే ప్రత్యేకమైన పాటలివి. మొదట్లో చావులకు మాత్రమే పాడే ఈ పాటలకు ఈ మధ్యకాలంలో బాగా ఆదరణ పెరిగింది. అయితే ఈ పాటలు పాడేవాళ్లలో మగవాళ్లే ఎక్కువగా ఉంటారు. అలాంటి గానా పాటల ప్రపంచంలో... తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది ఇసైవాణి.


 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని