తేనెలొలికే తెలుగు మాధుర్యాన్ని రుచి చూస్తే వదల్లేం అన్నది అక్షర సత్యం. అందుకు చక్కటి ఉదాహరణ సయ్యద్ ఆఫ్రిన్. ఆమెది నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడకు చెందిన సంప్రదాయ ముస్లిం కుటుంబం. మాతృభాష ఉర్దూ. కానీ తోటివారు మాట్లాడే తెలుగు విని ఆఫ్రిన్ తెలుగు భాష, సాహిత్యంపైనా మక్కువ పెంచుకుంది. ఇంటర్ వరకూ ఆంగ్ల మాధ్యమంలో చదివింది. బైపీసీలో 915 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అయినా సరే! డిగ్రీలో బీఏ తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుని మూడేళ్లూ నూటికి నూరు మార్కులతో ‘తెలంగాణ విశ్వవిద్యాలయం’ స్థాయిలో టాపర్గా నిలిచింది. అక్కడితో ఆగితే ఆఫ్రిన్ ప్రత్యేకత ఏముంది? తెలంగాణ యూనివర్సిటీలో ఏంఏ తెలుగు పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకుంది. ఆపై నెట్, సెట్ లాంటి పరీక్షల్లో అర్హత సాధించి... అక్కడే పీహెచ్డీలో చేరింది. ‘తెలంగాణ రచయిత్రులు..ఒక పరిశీలన’’ అంశాన్ని ఎంచుకొని గడిచిన మూడేళ్ల కాలంలో అనేక పరిశోధన గ్రంథాలను పరిశీలించానంటోంది ఆఫ్రిన్. ప్రస్తుతం అదే కళాశాలలో అతిథి ఉపాధ్యాయురాలిగా ‘తెలుగు తులనాత్మక సాహిత్యం’ పీజీ కోర్సును బోధిస్తోంది. సాహిత్యం, సామాజిక అంశాలపై ఆమె రచనలకు అవార్డులెన్నో దక్కాయి.
-రేవళ్ల వెంకటేశ్వర్లు, ఈనాడు నిజామాబాద్