ఎనిమిదో తరగతిలోనే పల్సర్‌ని అవలీలగా నడిపేసిన చల్లా ఆశ.. ఇప్పుడు బస్సుని కూడా అంతే సునాయాసంగా నడిపేసి వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఆర్టీసీలో మొదటి మహిళా డ్రైవర్‌గా చేరే అవకాశాన్ని పొందింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఈ యువ ఇంజనీర్‌కి హెవీవెహికల్స్ అంటే అమితమైన ఆసక్తి. అదే.. మొదటిసారి ఆర్టీసీ స్టీరింగ్ పట్టిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చింది..
ఓ సైనికుడి కూతురిగా తండ్రి నుంచి ధైర్యాన్ని వారసత్వంగా అందుకున్న ఆశకు గుర్రపుస్వారీ వచ్చు. పల్సర్, బుల్లెట్ వంటి బైకుల్నీ తేలిగ్గా నడిపేస్తుంది. ఇవన్నీ ఏదో ఉద్యోగ అవసరం కోసం నేర్చుకున్నవి కావు. కేవలం హెవీవెహికల్స్పై ప్రేమతో నేర్చుకున్నవే అంటుంది ఆశ. సిక్కిం, అండమాన్, దిల్లీలలో ఏడో తరగతి వరకూ, 8-10 తరగతులు టెక్కలిలో చదువువుకున్న ఆశ.. ఇంటర్మీడియెట్ వైజాగ్‌లో చదివింది. టెక్కలిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ పూర్తిచేసింది. వాహనాలని నడపాలన్న ఆసక్తి మాత్రం చిన్నప్పుడు నాన్న కొనిచ్చిన సైకిల్ని నడపడంతోనే మొదలయ్యిందట. ‘నాన్న ఆర్మీలో పనిచేస్తూ.. కుటుంబానికి దూరంగా ఉండటంతో ఇంటి పనులన్నీ మేమే చేసుకునేవాళ్లం. అలా నాకు ఎనిమిదో తరగతిలో ఉండగానే పల్సర్ (150 సీసీ) నడపడం వచ్చేసింది. దాని మీద వెళ్లి ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చేదాన్ని. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని నడుపుతున్నా. బీటెక్‌లో ఉండగా నాన్న కారు కొనివ్వడంతో డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా’ అని చెప్పుకొచ్చింది ఆశ.
- వెలమల ఢిల్లేశ్వరరావు, జలుమూరు