మేం ఈ మధ్యే కొత్తగా అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. బెడ్రూమ్కి దగ్గరగా విశాలమైన బాల్కనీ ఉంది. ఆహ్లాదకరంగా ఉండాలనే ఆలోచనతో ఈ ప్రదేశాన్ని రంగుల పూల మొక్కలతో నింపేయాలనుకుంటున్నా. సీజనల్గా ఈ కాలంలో ఎలాంటివి పెరుగుతాయి? జాగ్రత్తలూ చెప్పండి?
- శ్రేష్ఠ, హైదరాబాద్
ఈ
కాలంలో ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు చలి పెరుగుతుంది. ఇలాంటి వాతావరణంలో కొద్దిపాటి సూర్యరశ్మి సాయంతో అందంగా పెరిగే పూల మొక్కలు చాలానే ఉన్నాయి. బంతి, చామంతులతోపాటు మరికొన్ని రకాల్నీ ఈ కాలంలో సులువుగా పెంచుకోవచ్చు. అయితే చాలావరకూ నీరు నిలవని మట్టి మిశ్రమం వీటికి అనుకూలం. రోజులో ఏదో ఒక సమయం కాస్త ఎండ తగిలినా చాలు పిటూనియా మొక్క విభిన్న రంగులు, ఆకారాల్లో విరబూస్తుంది. బిగోనియానూ ఇందుకోసం ఎంచుకోవచ్చు. వీటిని తొట్టెల్లో పెట్టి గ్రిల్కి వేలాడదీయొచ్చు కూడా. అలాగే ఏక, ద్వి, బహు వార్షిక రకాల్లో దొరికే కార్నేషన్స్ చూడ్డానికి కళగా ఉండటంతోపాటు సువాసనలూ వెదజల్లుతాయి. ఇక, చల్లటి వాతావరణంలో ఎదిగే మరో మొక్క క్యాలెండులా. ఇది గులాబీ రంగు పూలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దీన్ని పెంచేందుకు సారవంతమైన ఇసుకమట్టి వాడాలి. దీనికి కొంతసేపైనా నేరుగా తగిలే ఎండ అవసరం. అలానే ప్యాన్సీ పూల మొక్కలు సీతాకోకచిలుక ఆకృతిలో నిండుగా కనిపిస్తాయి. పొట్టిగా ఉండి నీడలో సైతం చక్కగా పూస్తాయి. అలానే మాంటిరైనమ్నీ పెంచుకోవచ్చు. పసుపు, తెలుపు రంగుల్లో పూసే ఇవి అలంకరణకు ఉపయోగపడతాయి. ఆస్పర్ వేర్వేరు ఆకృతులు, విభిన్న వర్ణాల్లో పూస్తూ నీడలోనూ చక్కగా బతికేస్తుంది. ఇవే కాదు... మట్టికి కాస్త ఆమ్లతత్వం ఉంటే డెఫోడెల్స్ విరబూస్తాయి. వీటికి తరచూ ఎన్పీకే ఉండే సమగ్ర ఎరువుని అందిస్తే పూలు విరివిగా పూస్తాయి. ఆకులు రంగు మారినట్లు అనిపిస్తే ఎప్పటికప్పుడు తీసేయాలి. వాడిపోయిన, ఎండిపోయిన కొమ్మల్ని కత్తిరించాలి.