Published : 22/11/2020 00:29 IST
నిన్న కమల... నేడు మాల!

అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలూ, అధికార యంత్రాంగంలో భారతీయ మహిళల హవా కొనసాగుతోంది. తాజాగా ఆ జాబితాలోకి చేరిపోయారు భారత సంతతికి చెందిన ‘మాలా అడిగా’. కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా నియమితులవ్వనున్నారు. శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో చేరనున్న మాలా గురించి కొన్ని విషయాలు...

భారత సంతతికి చెందిన మాలా అమెరికాలోని ఇల్లినాయిస్‌లో పుట్టిపెరిగారు. ఆమె తల్లిదండ్రులు కర్ణాటక నుంచి వలస వెళ్లారు. ‘యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో’ లా స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారామె. అంతేకాకుండా, లోవాలోని గ్రిన్నెల్‌ కాలేజీ నుంచి స్పానిష్‌లో బీఏ పట్టా పొందారు. కెరీర్‌ ప్రారంభంలో అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి దగ్గర సహాయకురాలిగా పనిచేశారు. తరువాత షికాగోలోని కిర్క్‌లాండ్‌ అండ్‌ ఇల్లీస్‌ ఎల్‌.ఎల్‌.పి.లో లిటిగేషన్‌ అసోసియేట్‌గానూ విధులు నిర్వహించారు. కొన్నాళ్లకు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ఆమె 2008లో బారక్‌ ఒబామా ప్రచార బృందంలో చేరారు. ఒబామా అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పాలనలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు. బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగానూ బాధ్యతలు చేపట్టారు. స్టేట్‌ సెక్రటరీలో గ్లోబల్‌ ఉమెన్స్‌ సమస్యలను పరిష్కరించే విభాగంలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేశారు. అనంతరం బైడెన్‌ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల విభాగం డైరెక్టర్‌గానూ ఉన్నారు. తాజా ఎన్నికల్లో ‘బైడెన్‌-హారిస్‌’ ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు. ఆమె శ్రమకు గుర్తింపుగా శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా నియమితులవ్వనున్నట్లు జో బైడెన్‌ ప్రకటించారు. అమెరికాను మెరుగైన దిశగా నడిపేందుకు మాలా అనుభవం ఉపయోగపడుతుందని కొనియాడారు బైడెన్‌.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని