Published : 22/01/2021 00:43 IST
... అది నా డీఎన్‌ఏలోనే ఉంది!

తనకాళ్లపై తాను నిలబడేందుకు ఓ పిజా దుకాణంలో వెయిట్రెస్‌గా పనిచేసిందామె. నీలి తిమింగలాల రక్షణ కోసం ఓ చట్టాన్నే తీసుకొచ్చేందుకు కృషి చేసింది. తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా అమెరికా యువతలో చైతన్యం తీసుకొస్తున్న ఆమె మరెవరో కాదు జోబైడెన్‌ కూతురు ఆష్లేబైడెన్‌...

జో, జిల్‌ బైడన్‌ల ముద్దుల కూతురు ఆష్లే బైడెన్‌. తండ్రి అందించిన విలువల వారసత్వాన్ని తాను నిలబెడతానని చెప్పే ఆమె...ప్రచారానికి దూరంగా ఉంటారు. అందుకే జో బైడెన్‌ ఇతర పిల్లల కంటే ఆష్లే పేరు కాస్త తక్కువగానే వినిపిస్తుంది. అలాగని అసలు ప్రజాజీవితంలో కనిపించదనుకుంటే పొరబాటే. సామాజిక కార్యకర్తగా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఆమె వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ‘చేసే పనికి ప్రాధాన్యం ఉండాలే కానీ...వ్యక్తులకు కాదన్నది నాన్న అభిప్రాయం. అందుకే ఆయన అడుగుజాడల్లోనే సాధారణ జీవితాన్ని గడపడమంటేనే నాకిష్టం. బాధితులు, పీడితుల పక్షాన నిలబడటమే నిజమైన సేవ అని ఆయన తరచూ చెప్పే మాటలే నాకు ఆదర్శం. దాన్నే పాటిస్తున్నా’ అంటారామె.  
స్కూల్లో ఉన్నప్పుడే ఓ కాస్మెటిక్స్‌ సంస్థ తమ ఉత్పత్తులను జంతువుల మీద పరీక్షలు జరుపుతోందని తెలిసి దాన్ని వ్యతిరేకిస్తూ ఉత్తరాలు రాశారు. డాల్ఫిన్‌ల పరిరక్షణకోసం కాంగ్రెస్‌ సెనెటర్‌ బార్బారా బాక్సర్‌తో కలిసి పనిచేసేలా తండ్రిని ప్రభావితం చేశారు. దాని ఫలితమే 1990 డాల్ఫిన్‌ ప్రొటెక్షన్‌ కన్జ్యూమర్‌ ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌.

సామాజిక సేవ తనకు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వం అంటారు ఆష్లే బైడెన్‌. ‘నాన్న జీవితాంతం పబ్లిక్‌ సర్వెంట్‌గా ఉంటారు. అమ్మ ప్రభుత్వ టీచర్‌గా కొనసాగుతున్నారు. ప్రజల కోసం పనిచేయడం నా  డీఎన్‌ఏ లోనే ఉంది’ అని గర్వంగా చెబుతారామె. యువత... గ్యాంగ్‌లు, తుపాకీ సంస్కృతికి ప్రభావితం అవ్వకుండా పనిచేశారు. సోదరుడు బ్యూ స్ఫూర్తితో ఆష్లే లైవ్లీహుడ్‌ పేరుతో ఫ్యాషన్‌ కంపెనీ ప్రారంభించారు. దీనిద్వారా వచ్చే ఆదాయాన్ని అమెరికన్ల ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇక తండ్రి ఎన్నికల ప్రచారంలో మహిళల సమస్యలపై చర్చలు నిర్వహించారు. ఆయన గెలుపు తర్వాత సంతోషంతో ఆష్లే చేసిన డ్యాన్స్‌తో సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ అయ్యారు. పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్నారు ఆష్లే.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని