మేడిన్‌ చైనా.. వయా పాకిస్థాన్‌

హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్‌ నుంచే పథకం రచించారు. అక్కడి నుంచే రహస్యంగా గ్రనేడ్లు కశ్మీరుకు చేరవేసి.. తర్వాత హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Published : 03 Oct 2022 02:34 IST

కశ్మీరు నుంచి నగరానికి గ్రనేడ్‌ల చేరవేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్‌ నుంచే పథకం రచించారు. అక్కడి నుంచే రహస్యంగా గ్రనేడ్లు కశ్మీరుకు చేరవేసి.. తర్వాత హైదరాబాద్‌కు తరలించినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. మూసారంబాగ్‌కు చెందిన అబ్దుల్‌ జాహెద్‌ స్థానిక యువకులతో సమావేశాలు నిర్వహిస్తూ..వారికి ఆర్థిక సహకారం అందిస్తూ వారిని ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను రెచ్చగొడుతున్నాడు. ఇటీవల నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలను అవకాశంగా మలచుకొని మతఘర్షణలు రెచ్చగొట్టేందుకు జాహెద్‌కు పాక్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. దానిలో భాగంగానే బాంబుపేలుళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దసరా పండుగ వేడుకలను లక్ష్యంగా ఎంచుకున్నారు.

* ఇటీవల కశ్మీరులో సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు నీలిరంగు గ్రనేడ్లతోనే దాడులు చేశారు. అవి చైనాలో తయారైనట్టు పోలీసులు గుర్తించారు. జాహెద్‌ బృందం వద్ద దొరికిన గ్రనేడ్‌లు నీలిరంగులో ఉండడంతో అవి కూడా చైనాలో తయారైనవేనని అనుమానిస్తున్నారు. అవి రెండు నెలల క్రితమే పాకిస్థాన్‌ నుంచి కశ్మీర్‌ చేరాయి. నెల రోజుల కిందట మినీవ్యాన్‌లో వచ్చిన గ్రనేడ్‌ల పెట్టెను నగర శివారులో జాహెద్‌ స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2006లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్‌ థియేటర్‌లో మొదటిసారి గ్రనేడ్‌ దాడి జరిగింది. అది కూడా చైనాలో తయారైనదేనని అప్పట్లో ఫోరెన్సిక్‌ పరీక్షలో గుర్తించారు.

* గ్రనేడ్లు అందడంతో.. నెల రోజులుగా నిందితులు పాక్‌ నుంచి వచ్చే తదుపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ఘటనలు, పండగలతో నగర పోలీసులను కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తం చేస్తూ వచ్చాయి. పాతనేరస్థులు, అనుమానితుల కదలికలపై నిఘా ఉంచిన సిట్‌, సీసీఎస్‌, ఎస్బీ, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు.. ఉగ్రవాద దాడులపై సమాచారం రావటంతో అప్రమత్తమయ్యాయి. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా ఆపరేషన్‌ మూసారంబాగ్‌ చేపట్టి సఫలీకృతులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని