టెక్ వార్తలు

Published : 22/06/2021 20:44 IST
WhatsApp: వాట్సాప్‌ యూజర్లకు బ్యాడ్‌ న్యూస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ నుంచి యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ ‘మల్టీ డివైజ్‌ సపోర్ట్‌’. దీని వల్ల ఒక నెంబరుతో ఒకటికి మించి మొబైల్స్‌లో వాట్సాప్‌ వాడుకునే అవకాశం వస్తుందని వార్తలు రావడంతో... ఈ ఫీచర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని యూజర్లు చూస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ బ్యాడ్‌ న్యూస్‌. ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’ విషయంలో వాట్సాప్‌ తీసుకున్న నిర్ణయం వినియోగదారులను నిరాశపరుస్తోంది.

ప్రస్తుతం వాట్సాప్‌ను ఒక మొబైల్‌లో, ఒక నెంబరుతో మాత్రమే వాడగలం. అదే నెంబరుతో వేరే మొబైల్‌లో లాగిన్‌ అయితే... పాత మొబైల్‌లో లాగ్‌ అవుట్‌ అయిపోతుంది. అలాగే వాట్సాప్‌ వెబ్‌ను వాడాలంటే... కచ్చితంగా మొబైల్‌కు డేటా/వైఫై కనెక్టివిటీ ఉండాలి. ఈ రెండు రకాల ఇబ్బందులకు తెరదించుతూ వాట్సాప్‌... ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు చాలా రోజులుగా వార్తలొచ్చాయి. అంతేకాదు యూజర్‌కు రెండు మొబైల్స్‌ ఉండి.. ఆ రెండింటిలోనూ ఒకే నెంబరుతో వాట్సాప్‌ వాడుకోవచ్చని కూడా ఆ మధ్య వార్తలొచ్చాయి. 

తాజా సమాచారం ప్రకారం అయితే... ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’లో అలాంటి సదుపాయం లేదట. గరిష్ఠంగా నాలుగు డివైజ్‌లు, ఒక మొబైల్‌ మాత్రమే పని చేస్తాయట. ఇక్కడ డివైజస్‌ అంటే వాట్సాప్‌ వెబ్‌, వాట్సాప్‌ డెస్క్‌టాప్‌, ఫేస్‌బుక్‌ స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ (మన దగ్గర ఇంకా రాలేదు) లాంటివి. అలా ఒకే మొబైల్‌ నెంబరుతో ఏక కాలంలో నాలుగు డివైజ్‌లు, ఒక మొబైల్‌లో మాత్రమే వాట్సాప్‌ వాడొచ్చు. దీంతో రెండు మొబైల్స్‌లో వాట్సాప్‌ వాడటం కుదరదు. అయితే మల్టీ డివైజ్‌ సపోర్టు ఫీచర్‌ వాడుతున్న సమయంలో మెయిన్‌ మొబైల్‌లో (వాట్సాప్‌ అకౌంట్‌ తొలుత ఓపెన్‌ చేసింది) డేటా/వైఫై ఆన్‌లో ఉండక్కర్లేదు. దీంతో ఈ ఫీచర్‌ మీద ఆశలు పెట్టుకున్న యూజర్లు నిరాశపడుతున్నారు. అయితే ఈ ఫీచర్‌ లైవ్‌లోకి వచ్చేటప్పుడు ఏమన్నా మార్పులు ఉంటాయేమో చూడాలి. 

ఇవీ చదవండి

గ్యాడ్జెట్స్‌కథనాలుసోషల్‌స్మార్ట్‌గాఅవీ.. ఇవీ..యాప్స్‌ & గేమ్స్‌సైన్స్ సంగతులు

మరిన్ని