క‌వర్ స్టోరీ

Startup Unicorn: స్టార్టప్‌ ప్రపంచంలో ‘యూనికార్న్‌’ సందడి!

ఏదైనా సినిమా మంచి వసూళ్లు రాబడితే, వంద కోట్ల క్లబ్‌లో చేరిందంటారు. అలాంటి క్లబ్‌ ఒకటి వ్యాపారాలకూ ఉంది. అయితే ఇక్కడ అవి డాలర్లు. వందకోట్ల డాలర్ల విలువ(సుమారు రూ.7,500కోట్లు) చేసే కంపెనీలను ‘యూనికార్న్‌’ కంపెనీలంటారు. ఏప్రిల్‌ నెల ఏకంగా ఆరు యూనికార్న్‌ కంపెనీలను దేశానికి అందించి వ్యాపారరంగంలో ఓ మైలురాయిని నమోదుచేసింది. ఏడాదికి ఓ పదో పన్నెండో యూనికార్న్‌ కంపెనీలైతేనే గొప్పగా చెప్పుకునే రోజుల్లో ఈ ఏడాది నాలుగు నెలల్లోనే పది కంపెనీలు యూనికార్న్‌లై చరిత్ర సృష్టించాయి. భారతీయ అంకుర పరిశ్రమల రంగానికి సరికొత్త ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ ఇచ్చే పరిణామం ఇది..!
‘మెలకువగా ఉండి కలలు కను. ఆ కలలను నిజం చేసుకోడానికి ఒంటిమీద స్పృహలేనంతగా పనిచేయి...’ అనేవారు సంఘసేవకులు బాబా ఆమ్టే. ఆ మాటలు ఈ తరం వ్యాపారవేత్తలకు బాగా సరిపోతాయి.
సృజనాత్మకమైన కలలు కనేవారుండాలే కానీ ఈరోజుల్లో వాటిని సాకారం చేసుకోవడం అసాధ్యం కానే కాదనిపిస్తోంది వివిధ రంగాల్లో విస్తరిస్తున్న అంకుర పరిశ్రమలను చూస్తుంటే.
కొత్తగా ఆలోచిస్తూ, ఆ ఆలోచనను ధైర్యంగా ఆచరణలో పెట్టగలుగుతున్న యువ పారిశ్రామికవేత్తలను పెట్టుబడులు వెతుక్కుంటూ వస్తున్నాయి... ఆయా సంస్థల విలువను అమాంతం పెంచేసి బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేర్చేస్తున్నాయి.
మనదేశంలో ఈ ఏడాది ఓ డజను కంపెనీలు యూనికార్న్‌ హోదా సాధిస్తాయని జనవరిలో నాస్కామ్‌ అంచనా వేసింది. అలాంటిది ఏప్రిల్‌కల్లా ఏకంగా పది కంపెనీలు ఆ జాబితాలో చేరాయి. అది కూడా ఒక్క వారంలోనే ఆరు సంస్థలు యూనికార్న్‌ కంపెనీలై పోవడంతో భారతీయ పరిశ్రమల రంగానికి అది చరిత్రాత్మక వారం అయింది. వెంచర్‌ ఇంటెలిజెన్స్‌ డేటా ప్రకారం మొత్తమ్మీద ఏప్రిల్‌ 3-9 తేదీల మధ్య భారతీయ స్టార్టప్‌లకీ వెంచర్‌ క్యాపిటలిస్టులకీ మధ్య జరిగిన 21 ఒప్పందాల ప్రకారం దాదాపు 20వేల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా మన దేశానికి వచ్చాయి. హెల్త్‌టెక్‌, సోషల్‌ కామర్స్‌, ఈ-ఫార్మసీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలకు చెందిన కంపెనీలు కొత్తగా ఈ బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరాయి.

ఇంతకు ముందు లేవా?
లేకేం... ఉన్నాయి. 2011లో ఇన్‌మొబి మన దేశం నుంచి తొలి యూనికార్న్‌ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఏటా ఒకటీ రెండూ చొప్పున కంపెనీలు ఆ జాబితాలో చేరుతూ రాగా 2018నుంచి వేగం పుంజుకున్నాయి. ఆ ఏడాది బైజూస్‌, స్విగ్గీ, ఉడాన్‌, జొమాటో లాంటి ఏడు సంస్థలూ 2019లో బిగ్‌బాస్కెట్‌, జోహో, లెన్స్‌కార్ట్‌, బిల్‌డెస్క్‌ లాంటి పది సంస్థలూ యూనికార్న్‌ కంపెనీలు అయ్యాయి. 2020లో కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారరంగం తీవ్రంగా నష్టపోయినా మన దేశం నుంచి 14 కంపెనీలు బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరడంతో పెట్టుబడిదారుల దృష్టి భారతదేశం మీదికి మళ్లింది. అందుకే నాలుగు నెలల్లోనే వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులుగా కుమ్మరించాయి.

ఎవరు పెడుతున్నారు?
జపాన్‌కి చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌, న్యూయార్క్‌కి చెందిన టైగర్‌ గ్లోబల్‌, ఫాల్కన్‌ ఎడ్జ్‌, సౌతాఫ్రికాకి చెందిన నాస్పర్స్‌ లిమిటెడ్‌ లాంటి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడి సంస్థలకు మన దేశ స్టార్టప్‌ వాతావరణం ఆశావహంగా కన్పిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. టైగర్‌ గ్లోబల్‌ అన్నిటికన్నా ఎక్కువగా షేర్‌చాట్‌, గ్రో, గప్‌షుప్‌ లాంటి డజనుకు పైగా సంస్థల్లో పెట్టుబడి పెట్టి మొదటి స్థానంలో ఉంది. ఫాల్కన్‌ ఎడ్జ్‌ స్విగ్గీ, క్రెడ్‌ లాంటి సంస్థల్లో పెట్టింది. ఒకప్పుడు చైనా, అమెరికాలతో పోలిస్తే వెంచర్‌ కాపిటల్‌ సంస్థలు మన అంకుర పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడం చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

దానివల్ల లాభమేంటి?
ఏ వ్యాపారానికైనా పెట్టుబడి ముఖ్యం. సొంత డబ్బుతోనో బ్యాంకు రుణం తీసుకునో వ్యాపారం మొదలెట్టినా తర్వాత దాన్ని విస్తరించాలంటే పెద్దమొత్తంలో డబ్బు కావాలి. అందుకే బయటి సంస్థలనుంచి పెట్టుబడులు తీసుకుంటారు. ఆ డబ్బుతో కంపెనీని విస్తరించడంవల్ల మార్కెట్‌లో కంపెనీ విలువ(వాల్యుయేషన్‌) బాగా పెరుగుతుంది. పేటీఎం 16 బిలియన్‌ డాలర్లు, బైజూస్‌ 15 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీలుగా ఎదగడానికి అదే కారణం. దీనివల్ల రెండువైపులా లాభాలున్నాయి. ప్రైవేటు కంపెనీలు డబ్బుకోసం త్వరపడి ఐపీవోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒకోసారి ఐపీవోలో విఫలమయ్యే అవకాశమూ ఉంటుంది కాబట్టి అది రిస్కు కిందే లెక్క. ఇక్కడ ఆ భయం లేదు. విస్తరణకు డబ్బు అవసరమైనప్పుడల్లా పెట్టుబడి పెడుతున్న సంస్థ దగ్గరికే మరో విడత నిధుల కోసం వెళ్లవచ్చు. కంపెనీ ఎదుగుదలకు అవసరమైన మార్గదర్శకత్వాన్నీ ఈ పెట్టుబడి సంస్థలు అందిస్తాయి. మరో వైపు కంపెనీ మార్కెట్‌ విలువ పెరుగుతుంది కాబట్టి డబ్బు పెట్టిన సంస్థకి ఆ మేరకు లాభం వస్తుంది.

మార్పు కన్పిస్తోందా?
గత రెండు దశాబ్దాలుగా వెంచర్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాక వల్ల భారతీయ పరిశ్రమల రంగంలో వైవిధ్యం కన్పిస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. విలువైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. కొవిడ్‌-19 వ్యాప్తి వల్ల ఆన్‌లైన్‌ సాంకేతికతను అంది పుచ్చుకోవడం ఎన్నో రెట్లు పెరిగింది. గత ఏడాదిలో టెక్‌ స్టార్టప్‌లే 1600లకు పైగా పుట్టుకొచ్చాయనీ దాంతో దేశంలో టెక్నాలజీ స్టార్టప్‌ల సంఖ్య 12,500లకు చేరిందనీ నాస్కామ్‌ జనవరి నివేదిక చెబుతోంది. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం దేశంలో మొత్తం యాభైవేల స్టార్టప్‌లు ఉన్నాయి. వీటిల్లో త్వరలోనే యూనికార్న్‌ స్థాయికి ఎదగగల కంపెనీలు పదుల సంఖ్యలో ఉన్నాయని అంచనా. వాటిని వెంచర్‌ కాపిటల్‌ పరిశ్రమ ‘సూనికార్న్‌’లని పిలుస్తోంది.

వీటన్నిటికీ లాభాలొస్తున్నాయా?
వందకోట్ల క్లబ్‌లో చేరినంత మాత్రాన లాభాలు రావాలన్న నియమం లేదు. ఒక పరిశ్రమ కుదురుకుని లాభాల బాట పట్టడానికి సమయం పడుతుంది. అప్పటి వరకూ దాన్ని నిర్వహించడానికి నిధులు కావాలి. సొంతంగా పెట్టుబడి పెట్టుకునే కంపెనీలు (బూట్‌స్ట్రాప్‌డ్‌) పెద్ద ఎత్తున నష్టాలను తట్టుకోలేవు కాబట్టి వేగంగా విస్తరించడానికి అవసరమైన రిస్క్‌ తీసుకోలేవు. బయటనుంచి నిధులు అందుకున్న స్టార్టప్‌లకు ఆ వెసులుబాటు ఉంటుంది. నష్టాలు వచ్చినా కంపెనీ ఎదుగుదలకు అవరోధం ఉండదు కాబట్టి వ్యాపారాన్ని ధైర్యంగా విస్తరిస్తూ వెళ్తారు. దానికి తగ్గట్టుగానే కంపెనీ విలువా పెరుగుతుంది. ఆ తర్వాత  లాభాలూ వస్తాయి. అయితే బయటి నుంచి నిధులు తీసుకుంటేనే యూనికార్న్‌ కంపెనీలవుతాయని లేదు. జోహో, జీరోధా లాంటివి ఎవరి నుంచీ నిధులు తీసుకోకుండానే యూనికార్న్‌ జాబితాలో చేరాయి.

మొత్తం ఎన్ని యూనికార్న్‌లున్నాయి?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయి. వాటి మొత్తం విలువ ట్రిలియన్‌ డాలర్లు. మనదేశంలో యాభై దాకా ఉన్నాయి. అంకుర పరిశ్రమల రంగంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న దేశంలో ఈ స్థాయిలో కొత్త యూనికార్న్‌లు పుట్టుకు రావడం కొత్తే కానీ నమ్మలేనిదేమీ కాదు.
మరోపక్క వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు చెబుతున్న దానికి రెట్టింపు- అంటే దాదాపు వందవరకూ యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయని క్రెడిట్‌ స్వీస్‌ కొత్త నివేదిక పేర్కొంటోంది. వాటన్నిటి మార్కెట్‌ విలువ 240 బిలియన్‌ డాలర్లని చెబుతోంది. నైకా, ఫస్ట్‌క్రై, బిగ్‌బాస్కెట్‌, లెన్స్‌కార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అర్బన్‌, గ్రీన్‌కో, స్టార్‌హెల్త్‌, హీరోఫిన్‌కార్ప్‌, భారత్‌ బయోటెక్‌, ఓలా లాంటి మొత్తం వంద సంస్థల జాబితాని కూడా అది విడుదల చేసింది. వాటిలో 28 శాతం కంపెనీలకు చిరునామా అయిన బెంగళూరు యూనికార్న్‌ కంపెనీలు ఎక్కువగా ఉన్న నగరంగా మొదటి స్థానంలో ఉండగా 20 శాతంతో ముంబయి రెండోస్థానంలో ఉంది.

ఏ సంస్థలో డబ్బు పెట్టాలో ఎలా నిర్ణయిస్తారు?
ఒకప్పుడు సంస్థ విలువను నిర్ణయించాలంటే అప్పటివరకూ జరిగిన పనితీరును మదింపుచేసేవారు. ఈరోజుల్లో స్టార్టప్‌లను- భవిష్యత్తులో అవి ఎదగడానికి ఉన్న అవకాశాలను బట్టి ఎంచుకుంటున్నారు ఇన్వెస్టర్లు. ఆ సంస్థ టార్గెట్‌ మార్కెట్‌ గురించి లోతుగా విశ్లేషించి, ఆ మార్కెట్‌ సైజుని అంచనా వేసి, దాన్నిబట్టి పెట్టుబడి పెట్టాలా వద్దా, పెడితే ఎంత పెట్టాలీ అన్నది నిర్ణయించుకుంటారు. పెట్టుబడి పెట్టే సంస్థలన్నీ నెలకి సగటున కొన్ని వందల స్టార్టప్‌లను పరిశీలిస్తాయి. ఒకప్పుడు ఎదగడానికి మంచి అవకాశం ఉన్న సంస్థ ఒకటీ అరా కన్పిస్తే ఇప్పుడు తేలిగ్గా నెలకు ఏడెనిమిది కన్పిస్తున్నాయట. అందుకే ఐదారేళ్ల క్రితం ఒక సంస్థలో ఒక్కో విడతకీ వందా, నూట యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఇప్పుడు 700 నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకూ తేలిగ్గా పెట్టేస్తున్నాయి. అంతేకాదు, పెట్టుబడి సంస్థలు కొన్ని జీబీఎఫ్‌(గెట్‌ బిగ్‌ ఫాస్ట్‌) అనే పద్ధతిని అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం అంకుర పరిశ్రమలకు అధిక మొత్తంలో నిధులిచ్చి అవి చాలా వేగంగా విస్తరించడానికి తోడ్పడతాయి. దాంతో అవి మార్కెట్‌లో పెద్ద వాటాని ఆక్రమిస్తూ పోటీ సంస్థలకు అందకుండా ఎదిగేందుకు ప్రయత్నిస్తాయి. ఈ విధమైన దూకుడు ధోరణి ఇటు సంస్థకీ అటు పెట్టుబడిదారుకీ కూడా ఉపయోగపడుతోంది. చిన్న చిన్న కంపెనీలను టేకోవర్‌ చేయడం కూడా యూనికార్న్‌ హోదాకి దగ్గరి దారివేస్తోంది. చాలా యూనికార్న్‌లు ఇతర కంపెనీలను కొనడం ద్వారా రూపొందినవే. సాంకేతికతపరంగా, వ్యాపారపరంగా అప్పటికే స్థిరపడిన కంపెనీలను కొంటే అభివృద్ధి తేలికవుతుంది. గూగుల్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌ అన్నీ అలా తయారైనవే. ఒక పెద్ద సంస్థ కొన్నప్పుడు చిన్న సంస్థ విలువ పెరుగుతుంది. ఉదాహరణకు ఫేస్‌బుక్‌ కొన్న తక్షణం ఇన్‌స్టాగ్రామ్‌ యూనికార్న్‌ అయిపోయింది.

ఇందుకు సగటున ఎన్నేళ్లు పట్టొచ్చు?
అది సంస్థ పనితీరుపై, అది పనిచేసే రంగంపై ఆధారపడి ఉంటుంది. గ్లాన్స్‌, క్రెడ్‌, డిజిట్‌ లాంటి సంస్థలకి రెండు మూడేళ్లే పడితే అన్‌ఎకాడమీ, జీరోధా లాంటి వాటికి పదేళ్లూ పైన్‌ల్యాబ్స్‌కి ఇరవై రెండేళ్లూ పట్టింది. ఈ ఏడాది చేరిన కంపెనీల్లో చాలావరకూ గత ఐదారేళ్లలో పెట్టినవే.

ఏమిటా కంపెనీలు..?
గత నాలుగు నెలల్లో యూనికార్న్‌ హోదా పొందిన కంపెనీల్లో హెల్త్‌టెక్‌, సోషల్‌ కామర్స్‌, ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ రంగాలకు చెందినవి ప్రధానంగా ఉన్నాయి.
షేర్‌చాట్‌: ఐఐటీ కాన్పుర్‌లో చదివిన అంకుశ్‌ సచ్‌దేవా, ఫరీద్‌ ఎహసాన్‌, భానుసింగ్‌ 2015లో ప్రారంభించిన షేర్‌చాట్‌ ప్రాంతీయభాషల్లో కంటెంట్‌, సామాజిక మాధ్యమాల అభివృద్ధికి కృషిచేస్తోంది.
డిజిట్‌ ఇన్సూరెన్స్‌: బెంగళూరుకు చెందిన కామేశ్‌ గోయల్‌ 2017లో ప్రారంభించిన ఈ సంస్థ వాహనాలూ ఇతర ఆస్తులకు సంబంధించిన
ఇన్సూరెన్స్‌ని సులభతరం చేస్తోంది.
క్రెడ్‌: ఈ ఆప్‌ ద్వారా క్రెడిట్‌ కార్డు బిల్లుల్ని సులభంగా కట్టేయడమే కాదు, అందుకు ప్రతిఫలంగా రివార్డులూ పొందవచ్చు. బెంగళూరుకు చెందిన సీరియల్‌ ఎంట్రప్రెన్యూర్‌ కునాల్‌ షా 2018లో దీన్ని ప్రారంభించాడు.
ఫార్మ్‌ఈజీ: ముంబయికి చెందిన ధవళ్‌ షా, ధర్మిల్‌ సేథ్‌ కలిసి 2014లో ప్రారంభించిన ఫార్మ్‌ఈజీ ఆప్‌లో ప్రిస్క్రిప్షన్‌ని అప్‌లోడ్‌ చేస్తే చాలు మందులు ఇంటికి వచ్చేస్తాయి. మందుల చీటీలను అందులోనే భద్రంగా దాచుకునే అవకాశమూ ఉంది.
ఇన్నొవాక్సర్‌: ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థులు అభినవ్‌ శశాంక్‌, కానవ్‌ హసీజా, సందీప్‌ గుప్తాలు 2012లో పెట్టిన ఈ హెల్త్‌కేర్‌ కంపెనీ డేటాని విశ్లేషించడం ద్వారా ఆరోగ్యసంస్థలకు సేవలందిస్తుంది.
మీషో: బెంగళూరుకు చెందిన విదిత్‌ ఆత్రే, సంజీవ్‌ బార్న్‌వాల్‌ 2015లో మీషోని ప్రారంభించారు. కోటి మంది చిన్న వ్యాపారులకు ఆన్‌లైన్‌ వేదిక అయిన ఈ ఆప్‌ లక్ష్యం 10 కోట్ల వ్యాపారులను చేరాలన్నది.
ఫైవ్‌స్టార్‌: చెన్నైలో 1984లో తన మామగారు వీకే రామనాథన్‌ పెట్టిన ఆటో ఫైనాన్స్‌ కంపెనీని రంగరాజన్‌ కృష్ణన్‌ 2005లో చిన్న వ్యాపారాలకు అప్పులిచ్చే కంపెనీగా మార్చడంతో వేగంగా విస్తరిస్తూ వచ్చిన ఈ సంస్థ ఇప్పుడు యూనికార్న్‌ అయింది.
ఇన్‌ఫ్రా.మార్కెట్‌: నిర్మాణరంగ సంస్థలకూ, వాటి అనుబంధ వ్యాపారాలకూ సేవలందించే ఇన్‌ఫ్రా.మార్కెట్‌ని ముంబయికి చెందిన ఆదిత్య సార్దా, సౌవిక్‌ సేన్‌గుప్తాలు 2017లో ప్రారంభించారు.
గ్రో: బెంగళూరుకు చెందిన లలిత్‌ కేశ్రే, హర్ష్‌ జైన్‌, నీరజ్‌సింగ్‌, ఇషాన్‌ బన్సల్‌ కలిసి 2016లో ప్రారంభించిన గ్రో- ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌.

* * * * *

ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే అంకుర పరిశ్రమల పెట్టుబడుల్లో 17శాతం వృద్ధి కనిపించింది. 257 ఒప్పందాల ద్వారా ఏకంగా 30వేల కోట్ల రూపాయల నిధులొచ్చాయి. ముఖ్యంగా ఆరోగ్యం, వ్యాపారం, విద్య, గేమింగ్‌... ఈ నాలుగు రంగాల్లోనూ అవకాశాలకు ఆకాశమే హద్దన్నట్లుగా ఉంది పరిస్థితి. ఈ వివరాలను లోతుగా విశ్లేషించిన నిపుణులు తేల్చిందేమిటంటే...
ఏ స్టార్టప్‌ అయినా- ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్యని పరిష్కరించగలగాలి, లేదా ఒక అవసరాన్ని తీర్చగలగాలి.
అందుకు అత్యంత ఆధునిక సాంకేతికతను వాడుకోవాలి.
అప్పుడే పెట్టుబడుల వాన కురుస్తుంది... కంపెనీలను బిలియన్‌ డాలర్‌ క్లబ్‌లో చేరుస్తుంది..!


ఏమిటీ యూనికార్న్‌..!

గ్రీకు పురాణకథల్లో మాత్రమే కన్పించే గుర్రంలాంటి ఒంటికొమ్ము జంతువుని ‘యూనికార్న్‌’ అంటారు. కౌబాయ్‌ వీసీ అనే వెంచర్‌ కాపిటల్‌ సంస్థ వ్యవస్థాపకురాలైన ఐలీన్‌ లీ ఈ పదాన్ని మొదటిసారి 2013లో వాడింది. బిలియన్‌ డాలర్ల విలువ చేసే కంపెనీల గురించి వ్యాసం రాస్తూ ఇలాంటి కంపెనీలు అరుదుగా ఉంటాయని చెప్పడానికి అసలు లేని ‘యూనికార్న్‌’తో పోల్చింది. అప్పటికి నిజంగానే ప్రపంచవ్యాప్తంగా అంతా కలిసి 39 మాత్రమే యూనికార్న్‌ సంస్థలున్నాయిట. 2018నాటికి వాటి సంఖ్య 119కి చేరగా ఇప్పుడు దాదాపు మూడువందలు అయ్యాయి. పది బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘డెకాకార్న్‌’ అనీ వంద బిలియన్‌ డాలర్లు దాటినవాటిని ‘హెక్టాకార్న్‌’ లేదా ‘సూపర్‌ యూనికార్న్‌’ కంపెనీలనీ అంటున్నారు. గత ఫిబ్రవరి ఫార్చ్యూన్‌ మ్యాగజైన్‌ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో 30 డెకాకార్న్‌ కంపెనీలు ఉన్నాయి. ఆపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, సిస్కో లాంటివి హెక్టాకార్న్‌ జాబితాలోకి వస్తాయి.


పదేళ్లు... రెండు యూనికార్న్‌ కంపెనీలు!

పదేళ్ల క్రితం ‘ఇన్‌మొబి’ మనదేశంలో తొలి యూనికార్న్‌ అయితే, ప్రారంభించిన రెండేళ్లకల్లా యూనికార్న్‌ హోదా పొందిన ‘గ్లాన్స్‌’ కూడా దాని సోదర సంస్థే కావడం మరో విశేషం.
ఆ రికార్డుల వెనక ఉన్నది నవీన్‌ తివారీ. ఒక అంకుర పరిశ్రమ విజయ పథంలో సాగడానికి కావలసిన అన్ని లక్షణాలూ నవీన్‌ ప్రస్థానంలో కన్పిస్తాయి.
ఐఐటీ కాన్పూర్‌లో ఇంజినీరింగ్‌, హార్వర్డ్‌లో ఎంబీఏ చేసిన నవీన్‌ ముగ్గురు స్నేహితులతో కలిసి 2007లో ముంబయిలో ఒక కంపెనీ పెట్టాడు.
అమ్మకందారులకు ప్రకటనల రంగంలో సెల్‌ఫోన్‌ సాంకేతికతను పరిచయం చేసిన ఆ సంస్థ పేరు ‘ఎంఖోజ్‌’. వ్యాపారం బాగానే సాగింది. లాభాలొచ్చాయని తృప్తిపడి అక్కడే ఆగిపోతే అది ఒక చిన్న కంపెనీగానే మిగిలిపోయేది. సరిగ్గా అప్పుడే మొబైల్‌లోకి ఇంటర్నెట్‌ వచ్చేసి కొత్త కొత్త ఉపయోగాలకు తెరతీస్తోంది. ఈ మార్పు గమనించిన వెంటనే దిశను మార్చుకున్నాడు నవీన్‌. మొబైల్‌ ఫోన్లు స్మార్ట్‌ ఫోన్లుగా మారనున్నాయనీ వాటి వాడకం బాగా పెరగనుందనీ గుర్తించి అందుకు తగినట్లుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. సంస్థని బెంగళూరుకి తరలించి దాని పేరును ‘ఇన్‌మొబి’గా మార్చాడు. కృత్రిమ మేధ సాయంతో వ్యాపారసంస్థల కోసం ఎడ్వర్టైజింగ్‌, మార్కెటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ని తయారు చేస్తుంది ఈ సంస్థ. ఊహించినట్లుగానే అటు వ్యాపారవిజయాన్నీ ఇటు పెట్టుబడులనీ ఆకర్షించి ఐదో ఏటికల్లా యూనికార్న్‌ స్థాయిని దాటేసి, లాభాల బాట పట్టింది ఇన్‌మొబి. ఎదిగే క్రమంలో మరో ఆరు కంపెనీలను విలీనం చేసుకుని, ఇప్పుడు 22 దేశాల్లో సేవలందిస్తోంది.
2018లో ‘గ్లాన్స్‌’ అనే మరో సంస్థని ప్రారంభించాడు నవీన్‌. ఫోన్‌ తెరిచే పనిలేకుండా లాక్‌స్క్రీన్‌ మీదే ముఖ్యమైన విషయాలు కన్పించే సాంకేతికతతో సంచలనం సృష్టించిన ఈ సంస్థ ప్రారంభమైన ఏడాదికల్లా ‘రిపోసో’ అనే షార్ట్‌ వీడియో కంటెంట్‌ ప్లాట్‌ఫామ్‌ని టేకోవర్‌ చేసింది. ఆ దూకుడు నచ్చేసి ఏకంగా గూగుల్‌, మిత్రిల్‌ కాపిటల్‌ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు పెట్టుబడి పెట్టడంతో రెండేళ్లు తిరిగేసరికి యూనికార్న్‌ కంపెనీల జాబితాలోకి చేరిపోయింది గ్లాన్స్‌. నవీన్‌ తివారీకి సీరియల్‌ ఎంట్రప్రెన్యూర్‌ అన్న పేరూ వచ్చింది.

క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు