క‌వర్ స్టోరీ

నెట్‌ఫ్లిక్స్‌... అరచేతిలో మల్టీప్లెక్స్‌!

ఆన్‌లైన్లో అమ్మడం అనే కొత్త విధానంతో అమెజాన్‌ సంచలనం సృష్టిస్తున్న రోజులవి. ఆ పద్ధతి వ్యాపారవేత్త మార్క్‌ రాండాల్ఫ్‌ని ఆకట్టుకుంది. ‘అలాంటి వ్యాపారం ఒకటి మనమూ చేద్దాం’ అన్నాడు స్నేహితుడు రీడ్‌ హేస్టింగ్స్‌తో. ‘అద్దెకు తీసుకెళ్లిన వీడియో క్యాసెట్‌ని ఆలస్యంగా ఇచ్చినందుకు షాపువాడు మరీ అన్యాయంగా నలభై డాలర్లు(దాదాపు మూడువేల రూపాయలు) ఫైన్‌ వేశాడు. మనం ఆ క్యాసెట్లను ఆన్‌లైన్‌లో అద్దెకిస్తే...?’ అడిగాడు రీడ్‌ హేస్టింగ్స్‌. ఈ ఇద్దరు మిత్రుల కోరికలూ ఒక్కటై ‘నెట్‌ఫ్లిక్స్‌’గా వినోదరంగంలో సంచలనానికి తెరతీశాయి. ప్రపంచ ఇంటర్‌నెట్‌ బ్యాండ్‌విడ్త్‌లో 15శాతాన్ని వాడేసుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌ కథ- హాలీవుడ్‌ థ్రిల్లర్‌ సినిమానీ, సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌నీ కలిపికొట్టినట్లు ఉంటుంది.
ప్పుడంటే సినిమా ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు గబుక్కున ఫోన్‌లో ఏదో ఒక ఆప్‌ తెరిచి చూసేయగలం కానీ పాతికేళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా వేరేలా ఉండేది. అయితే థియేటర్‌కి వెళ్లాలి, లేదంటే షాపుకెళ్లి వీడియో క్యాసెట్‌ని అద్దెకైనా తెచ్చుకోవాలి. ఆ రెండూ తప్ప మరో మార్గమేదీ లేని రోజుల్లో ఇల్లు కదలకుండానూ సినిమా చూడొచ్చని చెబుతూ ఆన్‌లైన్లో డీవీడీలను అద్దెకివ్వడం మొదలుపెట్టిన సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్‌’.
సరిగ్గా ఇరవై మూడేళ్ల క్రితం... ఇదే ఏప్రిల్‌ నెలలో ‘నెట్‌ఫ్లిక్స్‌.కామ్‌’ మొదలైంది. దాంట్లో పేరు నమోదు చేసుకున్నవాళ్లు ఎవరైనా అక్కడున్న సినిమాల జాబితాలో నచ్చింది ఎంచుకుని డబ్బు చెల్లిస్తే పోస్టులో ఆ డీవీడీ ఇంటికి వచ్చేది. ముప్ఫై మంది సిబ్బందితో ఇద్దరు స్నేహితుల సారథ్యంలో ప్రారంభమైన ఆ చిన్ని వ్యాపారం ఇప్పుడు వినోద ప్రపంచంలో ఓ విప్లవం... ఓటీటీ వేదికల్లో నంబర్‌ వన్‌.
సినిమాలు అద్దెకిచ్చే దశనుంచీ సొంతంగా సినిమాలు తీసి ప్రపంచ ప్రేక్షకులను తన తెరకు కట్టేసుకునే స్థాయికి ఎదిగిన ఈ సంస్థ... అంకుర పరిశ్రమలకి స్ఫూర్తి, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు కేస్‌ స్టడీ. ఈ తిరుగులేని విజయానికి ముందూ వెనుకా ఏం జరిగిందంటే...

ఆ ఇద్దరూ...
మార్క్‌ రాండాల్ఫ్‌... చదివింది భూభౌతికశాస్త్రం కానీ టెక్నాలజీ అంటే ఇష్టం. సిలికాన్‌ వ్యాలీలో ఇంటర్నెట్‌ ఆధారంగా పనిచేసే స్టార్టప్‌లు నెలకొల్పి సీరియల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు.   రీడ్‌ హేస్టింగ్స్‌... సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు. సొంత కంపెనీ పెట్టుకున్నాడు. వీరిద్దరినీ కలిపింది ఆ సాఫ్ట్‌వేర్‌ సంస్థే. రీడ్‌ది మొదటినుంచీ సంపన్న కుటుంబమే. తండ్రి అటార్నీగా పనిచేసేవాడు. ఆ డాబూదర్పం నచ్చని తల్లి పిల్లల్ని నిరాడంబరంగానే పెంచింది. దాంతో హైస్కూల్‌ కాగానే ఏడాదిపాటు ఇంటింటికీ తిరిగి వ్యాక్యూమ్‌ క్లీనర్లు అమ్మే సేల్స్‌మ్యాన్‌ ఉద్యోగం చేశాడు రీడ్‌. డిగ్రీ చదివాక స్కూలు టీచరుగా కొన్నేళ్లు స్వచ్ఛంద సేవ చేసి ఆ తర్వాత స్టాన్‌ఫోర్డ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌ చదివాడు. సొంతంగా ‘ప్యూర్‌ సాఫ్ట్‌వేర్‌’ అనే కంపెనీ పెట్టు కున్నాడు. అతడికి సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌లో ఎంత నైపుణ్యం ఉందో కంపెనీకి నాయకత్వం వహించడంలోనూ అంత సామర్థ్యం ఉంది. సంస్థ పెట్టిన నాలుగేళ్లకే పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లడమూ ఆ తర్వాత కొన్నాళ్లకే మంచి ధరకి మరో సంస్థలో విలీనం చేయడమూ వరసగా జరిగిపోయాయి. విలీన సంస్థలో మార్కెటింగ్‌ డైరెక్టరుగా ఉన్న మార్క్‌ రాండాల్ఫ్‌తో రీడ్‌కి స్నేహం కుదిరింది. విలీన ప్రక్రియ పూర్తయ్యేవరకూ కొన్ని నెలలపాటు ఇద్దరూ తాము నివసించే శాంతాక్రజ్‌ నుంచి రోజూ సిలికాన్‌ వ్యాలీకి కారులో వెళ్తూ కొత్త కొత్త వ్యాపార ఆలోచనలు చేసేవారు. అమెజాన్‌లాగా తాము కూడా ఆన్‌లైన్లో సంచలనం సృష్టించాలని కలలు కనేవారు.

జరిమానా ఇచ్చిన ఐడియా!
ఓరోజు అలాగే కారులో వెళ్తుండగా ముందు రోజు రాత్రి సరిగా నిద్ర పోలేదనీ, పాప ఏడవడంతో ఇంట్లో ఉన్న ‘అలాద్దీన్‌’ వీడియో పెట్టి చూపించాననీ చెప్పాడు మార్క్‌. అది వినగానే అద్దెకు తెచ్చిన క్యాసెట్‌తో తనకైన అనుభవం గుర్తొచ్చింది రీడ్‌కి. ‘అపోలో13’ సినిమా చూసి క్యాసెట్‌ ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. అది దొరికాక తీసుకెళ్లి ఇస్తే షాపువాళ్లు నలభై డాలర్లు ఫైన్‌ వేశారని చెబుతూ ఆ వ్యాపారం తామే ఆన్‌లైన్లో చేస్తే ఎలా ఉంటుందని స్నేహితుడిని ప్రశ్నించాడు రీడ్‌. మార్క్‌కీ నచ్చింది ఆ ఆలోచన. ఇద్దరూ సీరియస్‌గా దాని గురించి చర్చించారు. ఆన్‌లైన్లో ఆర్డర్లైతే తీసుకోవచ్చు కానీ పంపించడం ఎలా, వీడియో క్యాసెట్‌ పెద్దగా ఉంటుంది కాబట్టి కొరియర్‌ ఖర్చే తడిసి మోపెడవుతుంది కదా అని వాళ్లు తర్జన భర్జనలు పడుతుండగానే కొత్తగా డీవీడీలు మార్కెట్లోకి వచ్చేశాయి. అవి పలచగా ఉంటాయి కాబట్టి పోస్టులో పంపించొచ్చు, అయితే పగలకుండా ఉంటాయా అన్న సందేహం వచ్చింది. వెంటనే దుకాణానికి వెళ్లి రెండు సీడీలు కొని ఇద్దరి ఇంటి అడ్రసులకీ పోస్ట్‌ చేశారు. రెండోరోజున అవి సురక్షితంగా చేరాయి. దాంతో తమ ఆలోచనని ఆచరణలో పెట్టారు.  
జిమ్‌ స్ఫూర్తి
తాము చేపట్టిన వ్యాపారానికి ఇంటర్‌నెట్‌, సినిమా రెండిటినీ కలుపుతూ ‘నెట్‌ఫ్లిక్స్‌’ అని పేరు పెట్టిన మార్క్‌ సాఫ్ట్‌వేర్‌నీ తనే డిజైన్‌ చేశాడు. 1997లో కాలిఫోర్నియాలో కంపెనీని మొదలుపెట్టగా 1998 ఏప్రిల్‌లో ‘నెట్‌ఫ్లిక్స్‌.కామ్‌’ అందుబాటులోకి వచ్చింది. 925 సినిమాల డీవీడీలు కొని సిద్ధంగా పెట్టుకున్నారు. కావాల్సిన డీవీడీ ఎంచుకుని డబ్బు కడితే చాలు మర్నాటికల్లా పోస్టులో పంపించేవారు సిబ్బంది. సినిమా చూశాక తిరిగి పంపించడానికి కవరు కూడా దాంతోపాటే ఉండేది. మరో సినిమా ఆర్డరిచ్చే టప్పుడు చూసిన సినిమా ఎలా ఉందో చెప్పే రేటింగ్‌ ఏర్పాటు కూడా వెబ్‌సైట్‌లో ఉండేది. నాలుగు డాలర్లు అద్దె, రెండు డాలర్లు పోస్టు ఖర్చులు మొత్తం ఆరు డాలర్లకే ఇంట్లో కూర్చుని కుటుంబమంతా కలిసి ఇష్టమైన సినిమా చూసే ఈ కొత్త పద్ధతి జనాలకి బాగా నచ్చింది. దాంతో చాలామందే సభ్యులుగా చేరారు. ఓరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తున్న రీడ్‌కి మరో ఆలోచన వచ్చింది. అక్కడ నెలకోసారి డబ్బు చెల్లిస్తే ఎంతసేపైనా వ్యాయామం చేసుకోవచ్చు. ఆ పద్ధతే సినిమా డీవీడీలకూ వర్తింపజేశాడు. ప్యాకేజీని బట్టి నెలకింతని కడితే ఒకేసారి ఎక్కువ సినిమాలను ఎంచుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని కంపెనీనే పంపిస్తుంది. షిప్పింగ్‌ ఫీజు,లేట్‌ఫీజు... ఏమీ ఉండవు. చూసినదాన్ని పంపించగానే కొత్తది వచ్చేస్తుంది. నెలకి ఇన్నే తీసుకోవాలన్న లెక్కేం లేదు. ఈ కొత్త విధానం సూపర్‌ హిట్టయింది.  
తీవ్రమైన పోటీ
నిజానికి ఆరోజుల్లో వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే వ్యాపారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుండేది. ‘బ్లాక్‌బస్టర్‌’ అనే కంపెనీకి దేశవ్యాప్తంగా వందలాది షాపులుండేవి. వాల్‌మార్ట్‌లాంటి పెద్ద సంస్థలూ ఈ రంగంలోకి వచ్చాయి. అలాంటిచోట కేవలం ఆన్‌లైన్‌ అన్న కొత్త టెక్నాలజీ తప్ప పకడ్బందీ ప్రణాళిక అంటూ ఏమీ లేకుండానే బరిలోకి దిగింది నెట్‌ఫ్లిక్స్‌. ప్రారంభించిన ఏడాదికే నెలసరి సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన సంస్థ ఆ తర్వాత రెండేళ్లకల్లా సభ్యులకు వారి అభిరుచికి తగిన వీడియోలను సిఫార్సు చేయడం మొదలెట్టింది. సినిమాలకు వాళ్లు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా ఈ రికమండేషన్లను చేయడానికి ‘సినీమ్యాచ్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేసుకుంది. 2002లో సభ్యుల సంఖ్య ఆరులక్షలు దాటాక పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లింది నెట్‌ఫ్లిక్స్‌. ఆ తర్వాత ఏడాదికి తొలి లాభాలను ప్రకటించింది. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2005నాటికల్లా రోజుకు పదిలక్షల సీడీలను డెలివరీ చేసేది. కొత్త హిట్‌ సినిమాల్నీ, ఇతర వీడియోల్నీ అందుబాటులో ఉంచేందుకుగాను స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లయన్స్‌గేట్‌్, ఎంజీఎం, పారమౌంట్‌ పిక్చర్స్‌ లాంటి పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్‌నెట్‌ లేని సమయంలోనూ చూసే వెసులుబాటు కల్పించింది.
మార్క్‌ గుడ్‌బై
ఒక సంస్థని కొత్తగా ప్రారంభించి నిలదొక్కుకునేలా చేయడంలో ఉన్న మజా ఆ తర్వాత దాన్ని నడిపించడంలో ఉండదు- అనే రాండాల్ఫ్‌ కంపెనీ ఒక స్థాయికి చేరుకోవడంతో 2003లో నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తప్పుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌ ప్రస్థానం గురించి ‘దట్‌ విల్‌ నెవర్‌ వర్క్‌: ద బర్త్‌ ఆఫ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ ద అమేజింగ్‌ లైఫ్‌ ఆఫ్‌ యాన్‌ ఐడియా’ అనే పుస్తకం రాశాడు. మార్క్‌ వెళ్లిపోయినప్పటి నుంచి రీడ్‌ హేస్టింగ్స్‌ సీఈవోగా కొనసాగుతున్నాడు. గత ఏడాదే టెడ్‌ సారండోస్‌ని తనతోపాటు సహ సీఈవోగా నియమించాడు. ‘నో రూల్స్‌ రూల్స్‌: నెట్‌ఫ్లిక్స్‌ అండ్‌ ద కల్చర్‌ ఆఫ్‌ రీఇన్వెన్షన్‌’ పేరుతో రీడ్‌ రాసిన పుస్తకం న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌ అయింది. ఏటికేడాది సభ్యుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ విజయపథాన సాగిపోతూన్న నెట్‌ఫ్లిక్స్‌ ఎన్నో కొత్త విధానాలను తెచ్చింది. దాదాపు ఏడుకోట్ల రూపాయల విలువ చేసే ‘నెట్‌ఫ్లిక్స్‌ ప్రైజ్‌’ని ప్రవేశపెట్టింది. సభ్యులకు సినిమాలను రికమెండ్‌ చేయడానికి సంస్థ వినియోగిస్తున్న విధానానికి మరో పదిశాతం కచ్చితత్వం పెరిగేలా చేయాలన్నది పోటీ. 18వేల సినిమాలకి దాదాపు ఐదు లక్షల మంది ఇచ్చిన పది కోట్ల రేటింగ్స్‌ని ఒక పద్ధతిలో పెట్టడమంటే ఇప్పటివరకూ ఎవరూ చేయని సాహసమే. ఆ పనికోసం నిపుణులైన ప్రోగ్రామర్లు ఎందరో బృందాలుగా పాల్గొని దాదాపు మూడేళ్లపాటు కష్టపడి నెట్‌ఫ్లిక్స్‌నీ అందులో వాడే కృత్రిమమేధనీ అందనంత ఎత్తుకి తీసుకెళ్లారు.

స్ట్రీమింగ్‌ సేవలు
సినిమాలతో పాటు టీవీ షోలనీ అద్దెకిచ్చే వ్యాపారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ 2007లో ‘వాచ్‌ నౌ’ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సేవల్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల సభ్యులు టీవీలో వస్తున్న షోలనూ సినిమాలనూ తమ కంప్యూటర్లలో అప్పటికప్పుడే చూడవచ్చు. వ్యాపారాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది ఈ విధానం. ఆ తర్వాత ఏడాదికల్లా కేవలం కంప్యూటర్లోనే కాకుండా ఎక్స్‌బాక్స్‌360, బ్లూ-రే డిస్క్‌ప్లేయర్స్‌, టీవీ సెట్‌టాప్‌ బాక్సు లాంటి ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ద్వారా కూడా స్ట్రీమింగ్‌కి ఒప్పందాలు చేసుకుంది. ప్లేస్టేషన్‌, స్మార్ట్‌ టీవీ, యాపిల్‌ ఉపకరణాలకూ విస్తరించింది. పనిలో పనిగా సేవల్ని ఇతర దేశాలకూ అందించడం మొదలెట్టింది. అయితే ఇక్కడా పోటీ తప్పలేదు. అమెజాన్‌ కూడా అదేసమయంలో వీడియో స్ట్రీమింగ్‌ని మొదలుపెట్టింది. ఆ తర్వాత మరెన్నో సంస్థలూ వచ్చాయి. అయినా వాటన్నిటికీ అందకుండా నెట్‌ఫ్లిక్స్‌ ముందుకు దూసుకుపోయింది. అందరికన్నా ముందు కొత్త విధానాలను అందిపుచ్చు కోవడమే కాక వాటిని ఎలాంటి లోపాలూ లేకుండా అమలుచేసేవాడు రీడ్‌ హేస్టింగ్స్‌. మెరికల్లాంటి ఉద్యోగులను చేర్చుకుని పెద్దమొత్తంలో జీతాలు చెల్లించడాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్కృతిగా మార్చాడు. సొంతంగా కార్యక్రమాలను తయారుచేసుకోవడం (ఒరిజినల్‌ కంటెంట్‌) మీద దృష్టిపెట్టాడు. సొంత డాక్యుమెంటరీలూ సినిమాలూ షోలూ ప్రసారం చేస్తూ సభ్యులను తమ తెరకు బందీలుగా చేసుకుంటూ పోయిన నెట్‌ఫ్లిక్స్‌ ఆ కార్యక్రమాలకు ఆస్కార్‌, ఎమ్మీ లాంటి ప్రతిష్ఠాత్మక బహుమతులెన్నో గెలుచుకుంది. ఒక్క 2016 సంవత్సరంలోనే ఏకంగా 126 ఒరిజినల్‌ సిరీస్‌ని విడుదల చేసింది. మరో సంస్థ ఏదీ ఆ వేగాన్ని అందుకోలేకపోయింది. న్యూమెక్సికోలో ఒక స్టూడియోను కొని నెట్‌ఫ్లిక్స్‌ స్టూడియోను అభివృద్ధి చేసుకోవడమే కాక మోషన్‌ పిక్చర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికాలో సభ్యత్వం పొందిన తొలి స్ట్రీమింగ్‌ సర్వీసుగా చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకూ విస్తరించిన నెట్‌ఫ్లిక్స్‌ మార్కెట్‌ విలువని బట్టి 2020 జులై నాటికి ప్రపంచంలోనే అతి పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా కంపెనీగా అరుదైన ప్రతిష్ఠను అందుకుంది.

పడి... లేచింది!
నెట్‌ఫ్లిక్స్‌ ప్రయాణమంతా నల్లేరు మీద నడక అనుకుంటే పొరపాటే. ఇక ఈ సంస్థ పని అయిపోయినట్లే- అనిపించిన రోజులు నెట్‌ఫ్లిక్స్‌ చరిత్రలోనూ ఉన్నాయి. అయితే ఏ పరిణామాన్నైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్న సారథుల వల్ల పడిన ప్రతిసారీ లేచింది, మరింత ఎత్తుకే ఎదిగింది.
* వీడియో క్యాసెట్లను అద్దెకిచ్చే సంస్థల్లో మొదటిస్థానంలో ఉన్న బ్లాక్‌బస్టర్‌ ప్రారంభించిన మూడేళ్లకే నెట్‌ఫ్లిక్స్‌ని కొంటానని బేరంపెట్టింది. చర్చల సందర్భంగా ధర చెబుతూ ఆ సంస్థ సీఈవో వ్యంగ్యంగా నవ్విన నవ్వు రీడ్‌కి అవమానంగా తోచింది. దాంతో అమ్మేది లేదని చెప్పి వచ్చేశాడు. అప్పుడు బ్లాక్‌బస్టర్‌కి 9వేల షాపులుండేవి. అలాంటిది నెట్‌ఫ్లిక్స్‌తో పోటీని తట్టుకోలేక 2010 కల్లా అదే పూర్తిగా దివాలాతీసింది.
* సరిగ్గా సంస్థ వేగంగా ఎదుగుతున్న సమయంలోనే డాట్‌కామ్‌ బబుల్‌, వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌మీద తీవ్రవాదుల దాడి వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. ఉన్న 120మంది ఉద్యోగుల్లో 40మందిని తీసేయక తప్పలేదు. మరొకరైతే ఏం చేసేవారో కానీ రీడ్‌ మాత్రం ఉన్న కొంతమందితోనే కలిసి ఉత్సాహంగా పనిచేసి సంస్థని నిలబెట్టాడు.
* 2011లో కంపెనీ షేర్‌ విలువ గరిష్ఠంగా ఉన్నప్పుడు రీడ్‌ తీసుకున్న నిర్ణయం మరోసారి కంపెనీ గ్రాఫ్‌ని సూటిగా కిందికి దించింది. డీవీడీ సబ్‌స్క్రిప్షన్‌నీ, స్ట్రీమింగ్‌ బిజినెస్‌నీ విడదీసి, డీవీడీ విభాగానికి ‘క్విక్‌స్టర్‌’ అనే పేరు పెట్టి ప్యాకేజీలనూ మార్చేసరికి కంపెనీ షేర్‌ విలువ 75శాతం పడిపోయింది. నెలరోజుల్లోనే 8లక్షల మంది సభ్యులు వెళ్లిపోయారు. 88శాతం లాభాలు తగ్గిపోయాయి. దాంతో ‘క్విక్‌స్టర్‌’ ప్రయోగాన్ని విరమించుకుని సేవల్ని మాత్రమే విడివిడిగా కొనసాగించడంతో క్రమంగా మళ్లీ ఆదరణ పెరిగింది.
కొత్తదనం ఎప్పుడూ ఆకర్షణీయమే. కాకపోతే ఆ ఆకర్షణను చిరకాలం నిలబెట్టుకోగల సామర్థ్యం మీదే వ్యాపారంలో జయాపజయాలు ఆధారపడివుంటాయి. డీవీడీలు అద్దెకిచ్చే నాటి నుంచి నేటి డిజిటల్‌ కాలం వరకూ నెట్‌ఫ్లిక్స్‌ ఆ సూత్రాన్నే నమ్ముకుంది.
కాబట్టే ప్రపంచాన్ని గెలిచింది..!

నెట్‌ఫ్లిక్స్‌ విశేషాలు

ప్రారంభించి పాతికేళ్లన్నా కాకుండానే ప్రపంచాన్ని గెలిచిన నెట్‌ఫ్లిక్స్‌ విశేషాలు మరికొన్ని.
* 190 దేశాల్లో ఇరవై కోట్లకు పైగా సభ్యులున్నారు. ఏడు దేశాల్లో కార్యాలయాలున్నాయి.
* కంపెనీ విలువ 44వేల కోట్ల రూపాయలు. 30మందితో మొదలైన కంపెనీలో ఇప్పుడు 12,135 సిబ్బంది ఉన్నారు.
* ఓటీటీ వేదికపై తొలి ఆస్కార్‌ని అందుకున్న ఘనత నెట్‌ఫ్లిక్స్‌దే(‘ద వైట్‌ హెల్మెట్స్‌’ డాక్యుమెంటరీ-2017).
* ఎమ్మీ అవార్డులకు నామినేట్‌ (2013) అయిన తొలి ఇంటర్నెట్‌ టీవీ నెట్‌వర్క్‌ ఇదే. 2018లో అత్యధిక నామినేషన్లు (112) పొంది, 23 అవార్డులు గెలుచుకుంది.
* ఎక్కడికక్కడ స్థానిక భాషల్లో కార్యక్రమాల తయారీకి వేలకోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది.
* ప్రస్తుతం మనదేశంలో డబ్బు చెల్లించి చూస్తున్న ఓటీటీల్లో రెండున్నర కోట్లమంది సభ్యులున్న నెట్‌ఫ్లిక్స్‌దే అగ్రస్థానం.
* 2015లో 474వ ర్యాంకుతో ఫార్చూన్‌ 500 జాబితాలో చోటు సంపాదించిన నెట్‌ఫ్లిక్స్‌ 2020కల్లా 164వ స్థానానికి చేరింది.

ఏమిటీ... ఓటీటీ..!

సగటు భారతీయుడు రోజుకు నాలుగున్నర గంటలకు పైగా సమయాన్ని స్మార్ట్‌ఫోనుతో గడుపుతున్నాడని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో ప్రధాన వాటా సామాజిక మాధ్యమాలదైతే ఆ తర్వాత స్థానం సినిమాలూ సీరియళ్లతో పాటు కొత్త కొత్త షోలతో ఆకట్టుకుంటున్న ఓటీటీలది. టీవీ ప్రసార వేళలతో సంబంధం లేకుండా వినియోగదారు తనకి వీలుగా ఉన్న సమయంలో ఇష్టమైన కార్యక్రమాన్ని అందుబాటులో ఉన్న తెరపై చూడగలిగే మాధ్యమాలనే ఓటీటీ అంటున్నారు. వీటిల్లో కొన్ని ఉచితం కాగా కొన్ని సభ్యత్వ రుసుం తీసుకుని ప్రకటనలు లేని ప్రసారాలను అందిస్తున్నాయి. కొన్నిట్లో గేమింగ్‌ సదుపాయమూ ఉంటుంది. మనదేశంలో ఎక్కువ ఆదరణ పొందుతున్న ఓటీటీ వేదికల్లో నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, డిస్నీ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లైవ్‌, వూట్‌, ఆల్ట్‌ బాలాజీ, జియోసినిమా లాంటివి ఉన్నాయి. తెలుగులో ‘ఆహా’, ‘ఈటీవీ విన్‌’ లాగా స్థానిక భాషలకు సంబంధించిన ఓటీటీ ఆప్స్‌ దాదాపు అన్ని భాషల్లోనూ వచ్చాయి. నిదానంగా పెరుగుతూ వస్తున్న వీటి పాత్ర కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఒక్కసారిగా రెట్టింపైంది. కొత్త సినిమాల విడుదలకూ ఓటీటీలు వేదికలయ్యాయి. కేవలం సినిమాలతో సరిపెట్టకుండా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వినోదకార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడం వల్ల భవిష్యత్తులో వీటి ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నది పరిశీలకుల అంచనా.

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు