మూడేళ్ల కిందటి దాకా నీళ్లులేక నోళ్లు తెరుచుకున్న భూములవి! వర్షం పడ్డా చుక్కనీరూ నిలిచేది కాదు. ఉత్త కరవు ప్రాంతంగా పేరుమోసిన రాజన్న సిరిసిల్ల ఇప్పుడు నిండుచూలాల్లాంటి చెరువులతో కళకళలాడుతోంది. భూగర్భ జల మట్టం పెరుగుదలలో దేశంలోనే రికార్డులు సృష్టిస్తోంది. ఎన్నడూలేనిదీ ముక్కారు పంటలకి నోచుకుంటోంది! మూడేళ్లలో ఈ మార్పుని తెచ్చింది ఏ మంత్రదండమో కాదు... కేవలం అధికారుల చిత్తశుద్ధి. వాళ్ల ఆలోచనకి కార్యరూపాన్నిచ్చిన ప్రజల కృషి. అందుకే ఈ మార్పు ముస్సోరిలోని యువ ఐఏఎస్‌లకి పాఠంగా మారింది!
వేములవాడ... రాజరాజేశ్వర స్వామి కొలువైన ప్రసిద్ధ శైవక్షేత్రం. ఆ పట్టణంలో రెండేళ్ల కిందటిదాకా తీవ్ర నీటి కరవు తాండవించేది. వీధుల్లోని ప్రతి ఇంటి ముందూ ఖాళీ డ్రమ్ములు నిల్చుంటే... రోజులో ఏదో ఒక జామున ట్యాంకర్లొచ్చి నీళ్లు పోసి పోతుండేవి. ఆ డ్రమ్మునీళ్లే ఇంటిల్లిపాదీ వాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడలా కాదు... ఇంటింటికీ కొళాయిలతో నీరు సరఫరా అవుతోంది. ఒకప్పుడు ఈ వేములవాడ మండలంలో ఏడుమీటర్ల లోతున్న ఉన్న నీళ్ళు... ఇప్పుడు రెండు మీటర్ల లోతునే దొరుకుతున్నాయి. ఆ ఒక్క మండలంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగానూ ఈ పెరుగుదల కనిపిస్తోంది. సాధారణంగా ఇక్కడ డిసెంబర్-జనవరి నెలల్లో సగటున 20 మీటర్ల లోతునకానీ కనిపించని నీళ్లు ఇప్పుడు మూడు అడుగుల పైకొచ్చాయి! ఇక ఏడాది మొత్తంగా చూస్తే సగటున 17 అడుగుల లోతున ఉండే నీళ్ళు 11 అడుగులకి లోతుకు చేరుకున్నాయి. ఏడాదిలో సగటున ఒక్కసారిగా ఇలా ఆరడుగులు పెరగడం మనదేశంలో మరే ప్రాంతం సాధించని ఓ రికార్డు! అందుకే ఈ విజయాన్ని తన పాఠ్యప్రణాళికలో భాగం చేసింది- యువ ఐఏఎస్‌లకి శిక్షణనిచ్చే ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ!
ఒకప్పటి చెరువులతోనే...
రాజన్న సిరిసిల్ల జిల్లా 2016లో ఏర్పడింది. యువ కలెక్టర్ దేవరకొండ కృష్ణ భాస్కర్ బాధ్యతలు చేపట్టగానే ఆయన ముందు కొచ్చిన పిటిషన్లలో అత్యధికం నీటి వసతులకి సంబంధించినవేనట. వాటన్నింటికీ తోడు ఎప్పటి నుంచో గోదావరి నీటిని జిల్లాకి తేవాలనే డిమాండు ఉండేది. ‘గోదావరి నీటిని తెస్తాం సరే... ఆ నీటిని ఎక్కడ నిల్వ ఉంచుతాం?!’ ఈ ప్రశ్నే మెదిలింది కలెక్టర్ మదిలో. అప్పుడే, ఆయన దృష్టి జిల్లాలో పూడుకుపోయిన చెరువులపైన పడింది. ఈ చెరువుల్ని పునరుద్ధరించకుంటే గోదావరి నీటిని కాదుకదా... సాధారణ వర్షపు నీటినీ నిల్వ చేయలేమనే విషయాన్ని ప్రజలకి అర్థం అయ్యేలా చెప్పారు కలెక్టర్. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చెరువుల బాగుసేత వైపు మళ్ళించారు. అది అద్భుతాలు చేసింది. ప్రజలు ఎంతో ఉత్సాహంతో చెరువుల పూడికతీతకీ, కట్టల్ని గట్టిగా మార్చడానికీ నడుంబిగించారు. కొన్ని దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని చెరువుల్ని బాగు చేశాక కొండల్లో పడ్డ నీరు వృధాకాకుండా సమాంతర కందకాలు తవ్వారు. నేలపైన పడ్డ వాన చుక్క వృధాకాకుండా కృత్రిమ నీటి ఊటల నిర్మాణం, వర్షపు నీటి గుంతల తవ్వకం మొదలుపెట్టారు. ఈ ఉపాధి పనులగ్గాను 2019 నుంచి వరసగా ఈ జిల్లాకి జాతీయ అవార్డులూ వచ్చాయి. అలా చెరువులూ, కొలనులూ సిద్ధమయ్యాక ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం కింద ఈ కరవు ప్రాంతానికి గోదారమ్మ నడిచొచ్చింది! అప్పటికే సిద్ధమైన చెరువుల్లో కొలువుదీరింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయాన్ని నింపారు. ప్రస్తుతం 605 చెరువుల్లో 450 నిండు కుండల్లా తొణికిసలాడుతున్నాయి! వీటిల్లో రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటోందిప్పుడు.
ఆ నీటితో ఏం సాధించారంటే...
ఈ జిల్లాలో వ్యవసాయ భూమి 99,303 హెక్టార్లలో సుమారు నలభైశాతం మాత్రమే సాగుకి పనికొచ్చేది. ఏడాదికి ఒక్క పంటే వేసేవారు. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఉపాధిగా బీడీలు చుడుతుండేవారు. ఆ అవకాశం కూడా లేనివారు పొట్టచేతపట్టుకుని ముంబయి, భివండీ, సూరత్లతోపాటూ గల్ఫ్ దేశాలకీ వలసవెళ్లేవారు. ఆ పరిస్థితి మెల్లగా మారుతున్న సూచనలు ఈ ఏడాది కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 40 శాతం దాటని భూసాగు ఈ ఏడాది 85 శాతానికి చేరింది. ఇదివరకటిలా మొక్కజొన్నా, పత్తి మాత్రమే కాకుండా వరిసాగూ చేపట్టారు. ఇతర వ్యవసాయ అనుబంధ వృత్తుల్నీ పరిగణనలోకి తీసుకుంటే సాగు కార్యకలాపాలు 150 శాతం పెరిగాయంటున్నారు కలెక్టర్ కృష్ణభాస్కర్! పలుప్రాంతాల్లోని రైతులు తొలిసారి మాగాణి పంటైన వరిని సాగు చేస్తున్నారని ఆనందంగా చెబుతున్నారు! ఒకనాడు కరవు ఖిల్లాగా ఉన్న సిరిసిల్ల... ఆ దుర్భిక్షం బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇదో మంచి మలుపు కదూ!