పరిశోధన

అది ఉంటేనే క్యారెట్లతో లాభం!

క్యారెట్లు కళ్లకే కాదు, గుండెకూ మంచిదే. క్యారెట్లలోని బీటా కెరోటిన్‌ మన శరీరంలోకి చేరాక విటమిన్‌-ఏ గా మారుతుంది. ఈ విటమిన్‌ రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా అడ్డుకుని హృదయసంబంధిత వ్యాధులబారిన పడకుండా కాపాడుతుంది. అయితే, యూనివర్సిటీ ఆఫ్‌ ఇల్లినాయ్‌కు చెందిన హ్యూమన్‌ న్యూట్రిషన్‌ విభాగం పరిశోధకులు గుండె ఆరోగ్యంలో బీటా కెరోటిన్‌ల పాత్ర గురించి చేసిన అధ్యయనంలో ఓ కొత్త విషయం తెలిసింది. మన శరీరం బీటాకెరోటిన్‌ని విటమిన్‌-ఏగా మార్చాలంటే ఓ ఎంజైమ్‌ కావాలి. అదే బీటా కెరోటిన్‌ ఆక్సిజెనేస్‌1 (బీసీఓ1). జన్యుపరంగా సంక్రమించే ఈ ఎంజైమ్‌ కొందరిలో చురుకుగా ఉండదట. అలాంటివారిలో క్యారెట్‌లోని బీటాకెరోటిన్‌ని విటమిన్‌-ఏ గా మార్చే శక్తి తక్కువ ఉంటుందట. 767మంది ఆరోగ్యవంతులైన యువత డీఎన్‌ఏ శాంపిళ్లను పరిశీలించగా బీసీఓ1 స్థాయులు ఎక్కువగా ఉన్నవారిలో చెడు కొలెస్టరాల్‌ స్థాయులు తక్కువగా ఉన్నాయని తేలిందంటారు ఇల్లినాయ్‌ పరిశోధకులు. మరో విషయం ఏంటంటే సగం జనాభాలో చురుగ్గాలేని బీసీఓ1 రకం ఎంజైమ్‌లే ఉంటున్నాయట. అలాంటివారు విటమిన్‌-ఏ కోసం పాలు, పెరుగు, చీజ్‌... లాంటి వాటిమీద ఆధారపడాల్సిందే. మొత్తంగా చెప్పేదేమంటే గుండె ఆరోగ్యానికి ఏ విటమిన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి, క్యారెట్‌తో పాటు ఏ విటమిన్‌ లభించే ఇతర పదార్థాలనూ ఆహారంలో చేర్చుకోవాలి.


ఆ ప్లాస్టిక్‌ మనమే తింటున్నాం!

ప్లాస్టిక్‌ పర్యావరణానికీ మన ఆరోగ్యానికీ కూడా హానికరం అని తెలిసినా వాడుతూనే ఉన్నాం. పైగా ఆ చెత్తను సముద్రాల్లోకీ నదుల్లోకీ వదిలేస్తుంటారు చాలామంది. విచిత్రం ఏంటంటే... అది చివరికి మళ్లీ మన శరీరంలోకే చేరిపోతోంది. హల్‌ యార్క్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం ప్రకారం సూక్ష్మంగా ఉండే ప్లాస్టిక్‌ ముక్కలు చేపల్లో గ్రాముకి 0-2.9, మొలస్క్‌లలో 0-10.5, పీతలూ రొయ్యల్లో 1-8.6 ఉంటున్నాయట. ఆసియాఖండంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మొలస్క్‌లలోనే ఈ మైక్రో ప్లాస్టిక్‌ ముక్కలు అత్యధికంగా ఉన్నాయని హల్‌ యూనివర్సిటీ విశ్లేషకుల మాట. అంటే మనం ఏముందిలే అని ప్లాస్టిక్‌ని వాడేయడం, నీటిలో వదిలేయడం చేస్తుంటే అవి సముద్ర జీవుల శరీరాల్లోకి చేరుతున్నాయి. తిరిగి సీ ఫుడ్‌ ద్వారా ఆ చెత్త మళ్లీ మన పొట్టలోకే వస్తోందన్నమాట.


ఈ కాలంలో బరువెందుకు పెరుగుతామంటే..?

లికాలంలో పొద్దున్నే త్వరగా లేవాలనిపించదు. సాయంత్రం త్వరగా ముసుగుతన్ని పడుకోవాలనిపిస్తుంది. దీనిక్కారణం ఈకాలంలో మన శరీరం నిద్ర హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చెయ్యడమేనట. ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు చెప్పేదేంటంటే చలికాలంలో పగటి సమయం తక్కువ ఉండేసరికి  సూర్యరశ్మి సరిగా అందక శరీరం మెలటోనిన్‌ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందట. ఇది నిద్రను బాగా ప్రేరేపిస్తుంది. నిద్ర హార్మోనుగా పేర్కొనే మెలటోనిన్‌ ఆకలినీ పెంచుతుందట. చలిని తట్టుకునేందుకు శరీరం వేడిని పుట్టించాలన్నా ఎక్కువ శక్తి కావాలి. దాంతో ఎక్కువగా తింటాం. అది కూడా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి, వేడిగా స్పైసీగా ఉండే ఆహారాన్ని తినాలనిపిస్తుంది. ఇక, మిగిలిన రోజుల్లో ఉదయమే వాకింగ్‌కి వెళ్లేవాళ్లు కూడా ఈ కాలంలో బద్ధకించి ముసుగుతన్ని పడుకుంటారు. ఇంకేముందీ... అన్నీ కలసి చలికాలం ముగిసే సరికి చాలామంది ఒకటి నుంచి మూడు కిలోల బరువు పెరుగుతారని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే, ఆహారంలో ఫైబర్‌ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలూ కూరగాయలను తీసుకుంటూ ఒకే చోట కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే బరువుని కొంతవరకూ అదుపులో ఉంచొచ్చు అంటున్నారు వైద్యులు.


ప్రేమ క్యాన్సర్‌నీ తగ్గిస్తుంది!

త్మీయులు తోడుంటే దేన్నైనా సాధించొచ్చు అన్నది తెలిసిందే. ద ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన రిలేషన్‌షిప్‌ శాస్త్రవేత్త రోజీ ష్రౌట్‌ మరో అడుగు ముందుకేసి ‘ప్రేమ రొమ్ము క్యాన్సర్‌ని కూడా తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. తన పరిశోధనలో భాగంగా వ్యాధి బారిన పడిన 55ఏళ్లు దాటిన 139 మంది మహిళల మీద అధ్యయనం చేశారు ష్రౌట్‌. కొన్ని నెలల వ్యవధిలో చేసిన ఈ అధ్యయనంలో తేలిందేంటంటే... జీవిత భాగస్వామి రొమాంటిక్‌గా, ప్రేమగా ఉన్న క్యాన్సర్‌ రోగుల్లో వ్యాధి త్వరగా తగ్గిందట. దీనిక్కారణం దాంపత్య జీవితంలో సంతోషంగా ఉన్న మహిళలు ఒత్తిడి లేకుండా ఉండడమేనట. సాధారణంగా ఒత్తిడి శరీర కణాల్లో వాపుని పెంచుతుంది. అదే ఒత్తిడి లేనివాళ్లలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి వ్యాధి త్వరగా నయం అయిందట. ఈ తరహా ఇన్‌ఫ్లమేషన్‌ క్యాన్సర్‌ కారకమే కాదు, గుండె, మధుమేహం, ఆల్జీమర్స్‌లాంటి వ్యాధులకూ దారితీస్తుందట. కాబట్టి, సంతోషకరమైన దాంపత్య జీవితం ఆరోగ్యానికీ మంచిదన్నది పరిశోధకుల మాట కూడా.

క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు