అవీ.. ఇవీ

ఏది అసలు... ఏది నకిలీ..?

కిట్‌క్యాట్‌, టైడ్‌, లేస్‌, కోల్గేట్‌... ఇలాంటి ఎన్నో బ్రాండ్‌ల ఉత్పత్తుల్ని మనం నిత్యం వాడుతూనే ఉంటాం. మరి, ఎప్పుడైనా గమనించారా అచ్చం అదే ప్యాకింగ్‌తో ఒకటీ రెండు అక్షరాల తేడాతో అదే పేరుతో ఉన్న నకిలీ ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి వస్తున్నాయని!

దుస్తులూ యాక్సెసరీల్లో కొన్ని బ్రాండ్ల పేర్లు చెబితే చాలు, కళ్లు మూసుకుని కొనేయొచ్చు అనిపిస్తుంది. అంత నాణ్యతను పాటిస్తుంటాయి ఆ కంపెనీలు. అందుకు తగ్గట్టే ధర కూడా ఎక్కువ ఉంటుంది. ఇక, వాటిని వేసుకుంటే ఉండే సౌకర్యం సాదాసీదా వాటికి ఉండదు. వినియోగదారులకు తమమీద ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే ఆ కంపెనీల వ్యాపారం మూడు పువ్వులూ ఆరుకాయలూ అన్నట్లుగా సాగుతుంది కాబట్టి, ఆయా బ్రాండ్లు కూడా ఏళ్లుగడిచినా నాణ్యతలో తేడా రాకుండా జాగ్రత్త పడుతుంటాయి. అందుకే, వినియోగదారులు తమకిష్టమైన బ్రాండ్‌వి కనిపిస్తే ఏమీ ఆలోచించకుండా కొనేస్తుంటారు. దుస్తులూ చెప్పుల్లాంటివే కాదు, చాక్లెట్లూ,  సబ్బులూ, డిటర్జెంట్లూ, టూత్‌పేస్టులూ, బిస్కెట్లూ, మినరల్‌ వాటర్‌ బాటిళ్లూ... ఇలా రకరకాల ఉత్పత్తులకు పేరున్న బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. దేన్నైనా ఒకసారి వాడినప్పుడు బాగుంటే తర్వాత నుంచీ ఆ కంపెనీ ఉత్పత్తుల్నే కొనుక్కుంటాం. కాబట్టే, ‘బ్రాండ్‌ ఇమేజ్‌’ అన్నది వినియోగదారుల కొనుగోళ్లూ అమ్మకాల్లో కీలకం. ఈ కారణంతోనే ప్రతి కంపెనీ తమ ప్యాకింగ్‌లనూ వాటిమీద కనిపించే పేర్లనూ ఇతర సంస్థలకు భిన్నంగా చూడగానే వినియోగదారులు గుర్తించేలా తయారుచేస్తుంటాయి. అందుకే, చదువురాని వాళ్లు కూడా ప్యాకింగ్‌ చూడగానే అది ఫలానా బ్రాండ్‌ది అని గుర్తుపట్టేసి కొనేస్తుంటారు. అదే ఇప్పుడు నకిలీ ఉత్పత్తుల్ని తయారుచేసి అమ్మేవాళ్లకి మంచి అవకాశంగా మారింది.

అచ్చుగుద్దినట్లు అలాగే...
చాలామంది కోల్గేట్‌ పేస్టు వాడతారు. దాని స్పెల్లింగూ తెలిసే ఉంటుంది. కానీ ఒకేఒక్క అక్షరం తేడాతో అచ్చం అదే ప్యాకింగ్‌తో కోల్గేట్‌ పేస్ట్‌ వస్తే పట్టి చూస్తే కానీ అది నకిలీ అని గుర్తించడం కష్టమే. అలాగే డవ్‌కి డేవ్‌, లేస్‌కి లెగ్స్‌, అడిడాస్‌కి అబిబాస్‌ అనీ ఒకేలా పలికే అక్షరాన్ని పేరులో చేర్చి అమ్మేస్తున్నారు నకిలీ ఉత్పత్తుల తయారీదారులు. ఇక్కడ ఫొటోల్లో కనిపించేవన్నీ అవే. పనిగట్టుకుని చెబితేగానీ ఆ పేర్లలో మార్పులున్నాయని గుర్తించలేకపోవడం ఈ తరహా నకిలీ ఉత్పత్తుల ప్రత్యేకత. ప్యాకింగ్‌ కూడా అసలు బ్రాండ్‌కి ప్రింట్‌ తీసినట్లే ఉంటుంది మరి. చదువు వచ్చినవాళ్లే వీటిని గుర్తించలేకుండా ఉంటే ఇక, చదువురానివాళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దుస్తులూ, షూ, బ్యాగుల తరహా ఫ్యాషన్‌ ఉత్పత్తుల్ని అమ్మే అడిడాస్‌, ప్యుమా, నైకి... లాంటి కంపెనీలకూ నకిలీవి కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటివాటిలో పేరులోనైనా తేడా ఉంటుంది. కానీ కొన్నిటిలో పేరునీ ప్యాకింగ్‌నీ మొత్తంగా కాపీ కొట్టి నకిలీవాటిని తీసుకొస్తున్నారు. ఈ తరహా వాటిలో ఎలక్ట్రానిక్‌ పరికరాల దగ్గర్నుంచి ఔషధాల వరకూ ఎన్నో వస్తున్నాయి. గత రెండు దశాబ్దాల్లో ఈ నకిలీ ఉత్పత్తుల అమ్మకం 10,000 శాతం పెరిగిందంటేనే వాటి జోరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, కాస్త చూసుకుని కొనండి సుమా!

క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు