సమీక్ష

సమాజానికి ప్రతిబింబం

పేదరికం, వివక్ష, అసమానతలు, అణచివేతలనుంచి బయటపడటానికి స్త్రీ పురుషులు చేస్తున్న సంఘర్షణలే వస్తువులుగా రాసిన 20 కథల సంపుటి ఇది. స్త్రీలు ఎన్ని ఇనుపతెరలను ఛేదించినా పురుషుల్లో రావాల్సినంత మార్పు రాలేదని చెప్పే కథలు- అనన్య, నమ్మకం, హరివిల్లు, మనసున మనసై, అమ్మంటే నాకిష్టం. చదువ కుంటున్న అమ్మాయికి పెళ్లి చేసి బాధ్యత దించుకున్నారు అమ్మానాన్నలు. ఏ స్వేచ్ఛాలేని అత్త వారింటి వాతావరణమూ సహకరించని భర్త ధోరణీ ఆ అమ్మాయి తిరుగుబాటు చేయడానికి దారితీసిన వైనాన్ని ‘అనన్య’లో చూపారు. ఒక్కగానొక్క కొడుకు ఊరొదిలి పోతుంటే ఆపలేక పోయాడు అచ్చిగాడు. ఆపడమంటే ఆకలితో చావమనడమే మరి. ‘పుడమి పుత్రులు’, ‘వాన’, ‘గుక్కెడు పేణం’ లాంటి కరవు నేపథ్యంలో సాగే కథల్లో అచ్చిగాడులాంటివారే కథానాయకులు.

-శ్రీ

గమ్యం (కథలు)
రచన: కందికుప్ప ఉషారాణి
పేజీలు: 128; వెల: రూ. 100/-
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్‌ శాఖలు


కవితలతో తారాట!

‘నిప్పులు చిమ్ముకుంటూ ఎగరావద్దు/ నెత్తురు కక్కుకుంటూ రాలావద్దు/ సజావుగా నడు/ సాము వద్దు నేలవిడిచి/ వెళ్లిపోవద్దు కలం ముడిచి/ ఈ రస్తాలోనే సమస్త శక్తుల మనస్కంతో అను-/ నే రాస్తా!’(కవీ!) - ఈ పంక్తుల్ని కొత్త కవులకోసం రాసినా వీటినే సుధామ కవితల మ్యానిఫెస్టోగానూ చెప్పవచ్చు! ఆధునిక తెలుగు కవిత తాను పుట్టినప్పటి నుంచీ ఛందస్సు పొత్తిళ్లని దాటుకుని పైకెగరాలనే చూస్తోంది. గత రెండు దశాబ్దాలుగా అది శబ్దసౌందర్యానికీ దూరమవుతూ వస్తోంది. పోనుపోను కవితలన్నీ తుంచేసిన అక్షర శకలాలుగా కనిపిస్తున్న నేపథ్యంలో సుధామ కవితలు నిన్నటితరం శబ్దసొగసుని చవిచూపిస్తాయి. ‘బతుకమ్మకు భాష తురాయిలు తొడిగి/పావురాయి స్వేచ్ఛనూ, శాంతినీ/‘రాయి రాయి’ అని హాయిగా విడ మర్చిన సోయి! (తానొక జీవనగీత) వంటి అక్షర మాలికలు ‘ఆహా’ అనిపిస్తాయి. అరుదైన అనువాద కవితలూ ఉన్నాయిందులో.

- అంకిత

 

తెమ్మెర (కవిత్వం)
రచన: సుధామ
పేజీలు: 97; వెల: రూ. 70/-
ప్రతులకు: ఫోన్‌- 9848276929


కులం చిచ్చు

మానవ సంబంధాల్లో కులం అనే అదృశ్య శక్తి పోషిస్తున్న పాత్రను నేపథ్యంగా తీసుకుని వాస్తవంగా జరిగిన ఓ సంఘటనకి నవలా రూపం ఇచ్చారు రచయిత్రి. మధులత సంపన్నుల బిడ్డ. కాలేజీలో తెలివితేటలతో అందరికీ తలలో నాలుకలా ఉండే నవీన్‌ ఆదర్శభావాల పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆ విషయం గుర్తించిన నవీన్‌ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి సామాజికంగా తమ వర్గం ఏ స్థాయిలో ఉందో ప్రత్యక్షంగా చూపిస్తాడు. అలాంటి పరిస్థితులనుంచి వచ్చిన నవీన్‌ చదువుకుని చక్కటి ఆదర్శాలతో జీవిస్తున్నప్పుడు తానెందుకు సర్దుకుపోలేననుకున్న మధులత అతడితో జీవితం పంచుకోడానికి ఇష్టపడుతుంది. తమ చదువులు అయ్యాకే పెళ్లి చేసుకోవాలనీ అప్పటివరకూ హద్దులు దాటకూడదనీ నిర్ణయించుకుంటారు. ఇంతలో పెద్దలకు విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ.

  - పద్మ

 

మధులతా...(నవల)
రచన: లక్ష్మీనాగేశ్వర్‌
పేజీలు: 160; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 9247815051


మూడు నవలల ముచ్చట

భిన్న నేపథ్యాలకు చెందిన మూడు చిన్న నవలల సమాహారం ఇది. ‘భైరవకోన’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా సాగే జానపద కథ. మూడు కొండల నడుమ భైరవుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ప్రాంతంలో గుహలో ఉన్న భైరవి, భైరవ విగ్రహాలకు విజయుడు పూజలు చేయాలనుకోవడంతో మొదలయ్యే కథ పలు సాహసాలతో సాగి, విజయుడు ప్రియంవదని సొంతం చేసుకోవడంతో ముగుస్తుంది. రెండో నవల ‘వెన్నెలయానం’ నవదంపతులు శరత్‌, చంద్రికల ప్రేమకథ. మెడలో గొలుసులాగే ప్రయత్నం చేసిన దొంగని ఎడాపెడా వాయించేస్తున్న అమ్మాయిని చూసి భయపడిన శరత్‌ తర్వాత ఆ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్న వైనాన్ని సరదాగా చెప్పారు. మూడవది ‘సామ్రాజ్ఞి’. జైమిని భారతంలోని అశ్వమేధ పర్వాన్ని మూలంగా తీసుకుని రాసిన కథ. రచయిత్రి తొలి ప్రయత్నంగా రాసిన ఈ వరస నవలల్లో నాటకీయత ఆకట్టుకుంటుంది.

- సుశీల

 

త్రినేత్రం (మూడు నవలల సమాహారం)
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
పేజీలు: 96; వెల: రూ. 120/-
ప్రతులకు: ఫోన్‌- 8558899478


క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు