ఫ్యాషన్

తిరగేస్తే... కొత్త నగ!

‘అయ్యో అమ్మా... నిశ్చితార్థానికి వేసుకున్న నెక్లెస్‌నే పెళ్లిక్కూడా ఎలా వేసుకుంటా...’ పెళ్లికూతురే కాదు, పెళ్లి చూడ్డానికి వెళ్లే ముద్దుగుమ్మలు కూడా ఈరోజుల్లో ఇలా మాట్లాడితే అస్సలు ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా అని ప్రతి ఫంక్షన్‌కీ కొత్త నగ కొనుక్కోవడమంటే కష్టమే. అందుకే ఇప్పుడు ఒక నగనే రెండు రకాలుగా వేసుకునేలా రివర్సబుల్‌ నగలు వస్తున్నాయి.
వస్తువైనా దుస్తులైనా ఒకే విధంగా ఉపయోగపడేకన్నా ఒకటికి రెండు రకాలుగా పనికొస్తాయంటే ఎక్కువ మొగ్గు చూపుతాం. ‘అలాంటి ఉపయోగం ఆభరణాల్లో ఉంటే ఎంత బాగుంటుందో’ అని అమ్మాయిలు ఎన్నిసార్లు అనుకుని ఉంటారో. అవునుమరి, ఓ పక్క బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. మరోపక్క ఏ ఫంక్షన్‌కి వెళ్లినా నాలుగు సెల్ఫీలూ ఎనిమిది ఫొటోలూ తీసుకుని వాట్సాప్‌ స్టేటస్‌లోనూ ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పెట్టేయకపోతే ఈతరానికి అసలు ఫంక్షన్‌కి వెళ్లిన ఫీలింగే ఉండదు. దాంతో అదే నగని వెంటనే ఇంకో వేడుకలో వేసుకుంటే కొత్తగా ఏం ఉంటుందీ... అనిపిస్తుంది. ఈ బాధ లేకుండా ఒకే నగను తిరగేసీ బోర్లేసీ రెండు నగలుగా వేసుకునేలా వస్తున్నవే ‘రివర్సబుల్‌ జ్యువెలరీ’.

మ్యాచింగ్‌ కూడా...
డబుల్‌ సైడ్‌, రివర్సబుల్‌ నగలుగా వస్తున్న వీటిలో ఎక్కువగా రత్నాలు పొదిగినవీ ఒకవైపు బంగారం మరోవైపు ఎనామిల్‌ పెయింట్‌ వేసినవే ఉంటున్నాయి. రత్నాలు పొదిగిన నెక్లెస్‌లూ పెండెంట్‌లలో ఒకవైపు ఒక రంగు రాళ్లు ఉంటే మరోవైపు మరో రంగు రత్నాలు పొదిగి ఉంటాయి. ఉదాహరణకు ముందువైపు గులాబీ రంగు రాళ్లు పొదిగి ఉండీ వెనకవైపు పచ్చరంగూ లేదా నవరత్నాలు పొదిగీ ఉన్న నెక్లెస్‌ని తీసుకుంటే నెక్లెస్‌ని ముందుకు తిప్పి ఒకసారీ వెనక్కు తిప్పి ఇంకోసారి అలంకరించుకోవచ్చు. పైగా గులాబీ రంగు చీర కట్టుకున్నప్పుడు నగను ఆ రాళ్లు పైకి కనిపించేలా ధరించొచ్చు. పచ్చరంగు చీర కట్టుకున్నప్పుడు ఆభరణాన్ని మరోవైపు తిప్పేయొచ్చు. చెవి దుద్దులూ గాజులూ ఉంగరాల్లోనూ ఈతరహావి ఎన్నో డిజైన్లు. టూసైడ్‌ జ్యువెలరీలో బంగారంతో పాటు, వెండిమీద బంగారు పూత పూసినవీ దొరుకుతున్నాయి. మీకూ నచ్చాయా మరి..?

క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు