శనివారం, అక్టోబర్ 31, 2020

క‌వర్ స్టోరీ

బతుకు బడిలో నిలిచి గెలిచారు!

వారసత్వంగా తాతలనాటి ఆస్తులూ తండ్రుల వ్యాపారాలూ రాలేదు... పెద్ద పెద్ద కాలేజీల్లో డిగ్రీలూ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ పాఠాలూ చదవలేదు... అయితేనేం... జీవితమే కళాశాల అయింది. పేదరికమే ప్రేరణ అయింది. అనుభవం పాఠాలు నేర్పింది. స్వశక్తి మీద నమ్మకమూ రేపటి మీద ఆశా... విజయలక్ష్మిని సొంతం చేశాయి. ఏమీలేని స్థితి నుంచీ ఎందరికో ఆధారం కాగల పరిస్థితికి వీరంతా ఎలా వచ్చారో తెలియాలంటే- సినిమా కథలకు తీసిపోని ఈ బతుకుకథల్ని చదవాలి మరి!


దోసె ప్లాజా... తోపుడు బండితో మొదలైంది!

ఒకోసారి జీవితం కల్పన కన్నా సృజనాత్మకంగా ఉంటుంది. ఊహకందని మలుపులు తిరుగుతుంది. లేకపోతే... చేతిలో చిల్లిగవ్వ లేకుండా, భాష రాని ప్రాంతంలో కట్టుబట్టలతో ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ పదిహేడేళ్ల కుర్రాడు వ్యాపారవేత్త అవుతాడని ఎవరైనా ఊహించగలరా! ‘అసలు తిరిగి సొంతూరు వెళ్లి నావాళ్లను చూస్తాననే అనుకోలేదు’- అంటాడు ఇప్పుడు దేశవిదేశాల్లో డెబ్భైకి పైగా శాఖలతో 30కోట్ల టర్నోవరుతో నడుస్తున్న ‘దోసె ప్లాజా’ గొలుసు రెస్టరెంట్ల వ్యవస్థాపకుడు ప్రేమ్‌ గణపతి.
తమిళనాడులో ఒక కూలీ ఇంట పుట్టిన ప్రేమ్‌కి ఏడుగురు తోబుట్టువులు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి దాకా చదివాడు. ఆపైన చదవాలంటే పట్నం వెళ్లాలి, అందుకు డబ్బు కావాలి. ఒక పక్కన ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి పెట్టడమెలా అని తల్లి బాధపడుతోంటే తాను చదువుకుంటానని అడగలేకపోయాడు ప్రేమ్‌. చేసేది లేక చదువు కలలు మానేసి చెన్నై వెళ్లి కూలిపనులు చేశాడు. రోజంతా కష్టపడ్డా నెలకి రెండు మూడొందలకన్నా ఎక్కువొచ్చేవి కావు. అందులోనే కొంత ఇంటికి పంపించేవాడు. ముంబయి వెళ్తే మంచి పనులు దొరుకుతాయనీ నెలకు 1200 జీతం వస్తుందనీ స్నేహితుడు చెప్పడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా రైలెక్కాడు. అక్కడ పని చూపించకపోగా ప్రేమ్‌ దగ్గరున్న డబ్బంతా తీసుకుని పారిపోయాడు స్నేహితుడు. తిరిగి చెన్నై వద్దామంటే చేతిలో డబ్బుల్లేవు. ఎవరినన్నా అడగాలంటే భాష రాదు. ఓడిపోయి ఇంటికెళ్లడానికీ మనసొప్పలేదు. ఓ తమిళ వ్యక్తి సాయంతో 150 రూపాయల జీతంతో హోటల్లో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. తన పని తాను చేస్తూనే హోటల్‌ పనిచేస్తున్న తీరుని పరిశీలించేవాడు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా గబుక్కున అందుకుని హోటల్‌ యజమానికి కుడిభుజంలా ఉండేవాడు. అలా రెండేళ్లు పనిచేసి కొంత డబ్బు దాచుకున్నాడు. ఓ స్నేహితుడితో కలిసి సొంతంగా టీకొట్టు పెట్టాడు. వచ్చీ రాని హిందీలో సరదాగా కబుర్లు చెబుతూ వినియోగదారులను ఆకట్టుకునేవాడు ప్రేమ్‌. టీకొట్టులో బాగానే డబ్బురావటం చూసిన స్నేహితుడికి దాన్ని ప్రేమ్‌తో పంచుకోవటం ఇష్టం లేకపోయింది. మరోసారి మోసపోయి ఖాళీచేతులతో మిగిలాడు ప్రేమ్‌. అయితే ఈసారి అతడు భయపడలేదు. హోటల్‌ పనులన్నిట్లో ఆరితేరాడు కాబట్టి త్వరగానే పని దొరికింది. మళ్లీ కొన్నాళ్లు కష్టపడి పదిహేను వందలు దాచుకున్నాడు.
ఈసారి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా వెయ్యిరూపాయలతో వంట పాత్రలు కొని 150 పెట్టి తోపుడు బండి అద్దెకు తీసుకుని రైల్వేస్టేషన్‌ దగ్గర ఇడ్లీ, దోసె వేసి అమ్మడం మొదలెట్టాడు. తక్కువ ధరకే రుచిగా, శుచిగా ప్రేమ్‌ వండి పెట్టే ఆ టిఫిన్లు చాలామందికి నచ్చాయి. కొంచెం డబ్బు సమకూరడంతో ధైర్యం వచ్చిన ప్రేమ్‌ ఒక గది అద్దెకు తీసుకుని ఇద్దరు తమ్ముళ్లను తోడు తెచ్చుకున్నాడు. అవటానికి తోపుడు బండే అయినా నీట్‌గా ఒకేలాంటి దుస్తులు వేసుకుని తలకు టోపీలు పెట్టుకుని శుభ్రంగా వంట చేసే ఈ అన్నదమ్ముల్ని చూసి అందరూ ముచ్చటపడేవారు. వ్యాపారం బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో మున్సిపల్‌ వాళ్లొచ్చి బండి లాక్కెళ్లేవారు. ప్రతిసారీ డబ్బు కట్టి విడిపించుకోవాల్సి వచ్చేది. అలా ఎన్నోసార్లు జరిగాక ఇలా అయితే లాభం లేదనీ అక్కడ కట్టే డబ్బేదో అద్దెకు పెట్టుకుంటే మంచి హోటల్‌ నడుపుకోవచ్చనీ భావించాడు ప్రేమ్‌. కాస్త రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని ‘ప్రేమ్‌సాగర్‌ దోసె ప్లాజా’ పేరుతో టిఫిన్‌ హోటల్‌ని ప్రారంభించాడు. హోటల్‌కి వచ్చే కాలేజీ కుర్రాళ్లతో స్నేహం చేసి హిందీ, ఇంగ్లిష్‌ భాషలూ ఇంటర్నెట్‌ వాడడమూ నేర్చుకున్న ప్రేమ్‌ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. యూట్యూబ్‌లో చూసి, ప్రయోగాలు చేసి 105 వెరైటీల దోసెలు వేసేవాడు. ప్రేమ్‌ ఉత్సాహానికి తగ్గట్టే వినియోగదారులూ ఇష్టంగా తిని మెచ్చుకునేవారు. ఏదైనా మాల్‌కి వెళ్లినప్పుడు అక్కడి మెక్‌డొనాల్డ్స్‌ రెస్టరెంట్‌ని చూసి ఎప్పటికైనా అలాంటి దోసె షాపు పెట్టాలనుకునేవాడట ప్రేమ్‌. సెంటర్‌ వన్‌ మాల్‌ యజమాని ప్రేమ్‌కి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. అలా ‘దోసె ప్లాజా’ ఒక బ్రాండ్‌గా మారి విదేశాలకూ విస్తరించింది. పాతికేళ్ల క్రితం వెయ్యిరూపాయలతో తోపుడు బండి మీద మొదలైన ప్రేమ్‌ గణపతి ప్రయాణం ఇప్పుడు డెబ్భైకి పైగా శాఖలతో 30కోట్ల టర్నోవరుతో దోసె అభిమానుల నోరూరిస్తూ ముందుకు సాగుతోంది. మనం ఏం చదివాం, ఎక్కడినుంచి వచ్చామన్నది కాదు, ఏం చేయగలమన్నదే ముఖ్యం. లక్ష్యం మీద దృష్టిపెట్టి కష్టపడితే ఏదైనా సాధించొచ్చు... అని అనుభవంతో చెబుతాడు ప్రేమ్‌ గణపతి.


పస్తులనుంచీ ప్రాజెక్టులవరకూ...

పేదరికమే పెద్ద సమస్య అనుకుంటే దానికి కులవివక్ష కూడా తోడైనప్పుడు... ఆ కష్టాలు ఎలా ఉంటాయో అశోక్‌ ఖాడేకి బాగా తెలుసు. మహారాష్ట్రలోని ఆ మారుమూల పల్లెలో చనిపోయిన పశువుల చర్మం ఒలిచి చెప్పులు కుట్టడం తప్ప మరో పని చేయకూడదు తండ్రి. ఆరుగురు పిల్లల్ని కని పెంచుతున్న తల్లి చేతనైన రోజున పొలం పనులకు వెళ్లేది. ఆమె తెచ్చిన కూలీ డబ్బులు తిండికి చాలక వారంలో మూడు రోజులు పస్తులే ఉండేవారు. ఆ ఆరుగురు సంతానంలో ఒకడైన అశోక్‌ తానో కంపెనీ పెడతాననీ దాదాపు ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తాననీ కలలో కూడా అనుకోలేదు.
ఓరోజు పెద్దవాన కురుస్తోంది. అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకుని పిండి తేవడానికి వెళ్లాడు అశోక్‌. తల మీద గోనెపట్టా సరిచేసుకుంటుంటే పిండి ప్యాకెట్‌ నీళ్లలో పడిపోయింది. పిండంతా కొట్టుకుపోయింది. బిక్కమొహం వేసుకుని ఇంటికొస్తే ఇక ఆ పూటకి తినడానికి ఏమీలేదని నిస్సహాయంగా చెప్పింది తల్లి. పస్తులు అలవాటే అయినా తన వల్ల తమ్ముళ్లూ చెల్లెళ్లూ ఏడుస్తూ పడుకున్న ఆ రోజుని అశోక్‌ ఇప్పటికీ మర్చిపోలేదు. పల్లెలో పస్తుల బతుకు చాలనుకున్న అశోక్‌ తండ్రి ముంబయి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టేవాడు. కొన్నాళ్లకు అశోక్‌ అన్న కూడా ముంబయి వెళ్లి ఓడల్ని నిర్మించే మజగావ్‌ డాక్‌యార్డులో వెల్డర్‌గా పనికి కుదిరాడు. ఆ తర్వాత అశోక్‌ వంతు వచ్చింది. తనూ వెళ్లి అన్న దగ్గరే సహాయకుడిగా చేరాడు. అందరూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా తిండికి సరిపోని పరిస్థితులు అశోక్‌ని ఆలోచింపజేసేవి. అందుకే పనిచేస్తున్నా చదువుని నిర్లక్ష్యం చేయకుండా పదో తరగతి పూర్తిచేశాడు.
ఇక ఆ తర్వాత అతని వల్ల కాలేదు. అయితే డాక్‌యార్డులో పని అతడికి చాలా నేర్పింది. నైపుణ్యాలను నేర్చుకున్నాడు. పరిచయాలను పెంచుకున్నాడు. విధినిర్వహణలో భాగంగా ఓసారి జర్మనీ వెళ్లాడు. పల్లెలో పుట్టి పెరిగిన అతడికి ముంబయి నగరానికి రావటమే గొప్ప, అలాంటిది విదేశీప్రయాణం కూడా చేయగలగడం అతడి ఆలోచనాపరిధిని విస్తృతం చేసింది. సొంతంగా తానే వ్యాపారం చేయాలన్న ఆలోచనను రేకెత్తించింది. 1992లో ముగ్గురు అన్నదమ్ముల పేర్లలోని మొదటి అక్షరాలతో డీఏఎస్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని ప్రారంభించాడు అశోక్‌. చిన్న చిన్న సబ్‌ కాంట్రాక్టులతో మొదలుపెట్టి మెల్లగా సొంతంగా కాంట్రాక్టులు చేపడుతూ నిదానంగా ఎదిగిన ఈ సంస్థ సముద్రంలో చేపట్టే నిర్మాణాలకు ఫ్యాబ్రికేషన్‌ పనీ, చమురు అన్వేషణకు అవసరమయ్యే పరికరాల తయారీ చేస్తుంది. దాదాపు ఐదు వేల మంది సిబ్బందితో వేలకోట్ల ప్రాజెక్టుల్ని సమర్థంగా నిర్మిస్తున్న అశోక్‌ ఊరినీ అక్కడి అనుభవాల్నీ మాత్రం మర్చిపోలేదు.
ఒకప్పుడు ఏ ఊళ్లో అయితే ‘మా వీధిలోకి రావద్దు, మా గుడిలోకి రావద్దు...’ అని అశోక్‌నీ అతని కుటుంబాన్నీ దూరంగా ఉంచారో ఇప్పుడా ఊళ్లో శిథిలమైపోయిన గుడిని పునరుద్ధరించాడు అశోక్‌. తల్లి కూలీగా పనిచేసిన చోటే వందెకరాలను కొన్నాడు. అక్కడో ఆస్పత్రినీ పాఠశాలనీ ఇంజినీరింగ్‌ కళాశాలనీ కూడా కట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు.


అటు బాధ్యతా ఇటు కలలూ

కుటుంబ భారం మోయలేకపోతున్న తండ్రికి కుడిభుజంగా మారాలని పదో తరగతిలోనే చదువు మానేసినప్పుడు ఆ కుర్రాడు బాధపడలేదు. పెద్ద కొడుకుగా అది తన బాధ్యత అనుకున్నాడు. ఆ బాధ్యతను నిలబెట్టుకోవటానికి కష్టపడ్డాడు. కళాశాల గడప తొక్కని ఆనాటి యువకుడు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు దీటుగా యాంటీవైరస్‌లు తయారుచేసే సంస్థకు యజమానిగా వేలకోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాడు. 1500 మందికి ఉపాధి కల్పించాడు.
కైలాష్‌ కట్టర్‌ తండ్రి పుణెలో ఓ ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పనిచేసేవాడు. పెరుగుతున్న ఖర్చులకు తండ్రి జీతం చాలకపోవడంతో చదువుమానేసి రేడియోలూ కాలిక్యులేటర్లూ రిపేరు చేసే షాపులో పనికి కుదిరాడు కైలాష్‌. తోటి కుర్రాళ్లు పగలంతా పనిచేసి రాత్రికి ఏ సినిమాకో వెళ్తుంటే కైలాష్‌ మాత్రం అర్థరాత్రి దాకా పని చేసేవాడు. నైపుణ్యం పెంచుకునేవాడు. అతని ఆసక్తి చూసిన యజమాని ముంబయిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఐదారేళ్లు అక్కడ పనిచేసి దాచుకున్న రూ.15వేలతో సొంతంగా షాపు పెట్టుకున్నాడు కైలాష్‌. పనిలో అతడి నైపుణ్యం తెలిసినవారంతా వెతుక్కుంటూ అతని షాపుకే రావడంతో త్వరగానే నిలదొక్కుకున్నాడు. ఆ తొలి విజయం అతడిలోని వ్యాపారవేత్తని తట్టిలేపింది. కంప్యూటర్ల నిర్వహణ పనినీ చేపట్టాడు. పాతికేళ్ల క్రితం సంగతిది. అప్పుడే కంప్యూటర్ల వాడకం పెరుగుతోంది. ఏడాదికి ఇంతని మాట్లాడుకుని కంప్యూటర్ల బాగోగులు చూసుకోవటం కైలాష్‌ పని. ఎలాంటి శిక్షణా లేని అతడు ఇందులో నిలదొక్కుకోవడం కష్టమే అయింది. ఇళ్ల దగ్గర కంప్యూటర్లు ఉన్నవారిని ఒప్పించి ఒక్కరొక్కరుగా ఖాతాదార్లను పెంచుకున్నాడు. కొన్నాళ్లకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అతడి ఖాతాదార్లయ్యాయి. వైరస్‌ వచ్చి పనిచేయని కంప్యూటర్‌ని ఫార్మాట్‌ చేసి తిరిగి పనిచేయించడానికి చాలా టైమ్‌ పట్టేది. సాఫ్ట్‌వేర్‌తో ఆ సమస్యను పరిష్కరించుకోవటం తేలిక. కానీ విదేశీ సాఫ్ట్‌వేర్లు ఖరీదు ఎక్కువని చాలామంది అవి కొనకుండా కైలాష్‌నే ఫార్మాట్‌ చేసివ్వమని అడిగేవారట. ఈ అవసరం పెరగడమే కానీ తగ్గదని గుర్తించిన కైలాష్‌ చిన్నతమ్ముడిని పుణెలో కొత్తగా ప్రారంభమైన కంప్యూటర్‌ కోర్సులో చేర్పించాడు. తానూ కొన్ని కోర్సులు చేశాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి పగలూ రాత్రీ కష్టపడి తక్కువ ధరకే యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు తయారుచేశారు. కానీ వాటిని అమ్మడమెలాగో తెలియక, చేతిలో డబ్బులేక ఒక దశలో అన్నీ మూసేసి పాత రిపేర్ల దుకాణంలోకి వెళ్లిపోదామనుకున్నారు. చివరి ప్రయత్నంగా మూడునెలలు గడువు పెట్టుకుని స్నేహితుడి సలహాతో మార్కెటింగ్‌కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాడు కైలాష్‌. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1993లో కైలాష్‌ ప్రారంభించిన కంప్యూటర్‌ సెంటర్‌ పన్నెండేళ్ల క్రితం ‘క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’గా మారి ఐపీవోకి వెళ్లింది. దేశవిదేశాల్లో పాతికకు పైగా శాఖలతో 1500 మంది సిబ్బందితో రూ.800 కోట్ల నికర విలువ గల ఆ కంపెనీ సీఈవో ఒకప్పుడు రేడియో మరమ్మతులు చేసేవాడంటే నమ్మడం కష్టమే, కానీ వాస్తవం. అందుకే, కష్టపడితే సాధ్యం కానిదేదీ లేదు... అంటాడు కైలాష్‌.


కసిగా... పోరాడి గెలిచింది!

తండ్రి కానిస్టేబులు. ఉండేది ప్రభుత్వ క్వార్టరు. పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలకెళ్లి చక్కగా చదువుకునేవారు. అయినా సమస్యెందుకొచ్చిందీ అంటే- దళితులమని వారు మర్చిపోయినా సమాజం మర్చిపోనివ్వలేదు కాబట్టి. చుట్టుపక్కలవాళ్లు తమ పిల్లల్ని వీళ్లతో ఆడుకోనిచ్చేవారు కాదు. బడిలో ఏ అవకాశాలూ దక్కనిచ్చేవారు కాదు. అందుకేనేమో ‘జీవితంలోనైనా వ్యాపారంలోనైనా పైకి రావడానికి కావలసింది చదువూ పెట్టుబడీ కాదు, కసి’ అంటుంది కల్పనా సరోజ్‌. అసలామె బతికి బట్టకట్టడానికి పడ్డ కష్టాలు చూసినవారెవరూ కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అవుతుందని ఊహించి ఉండరు. పన్నెండేళ్లకే కల్పన పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. ముంబయిలోని మురికివాడలో అత్తగారిల్లు. పదిమంది మనుషులున్న ఆ ఇంట్లో పనంతా చేసినా అత్త రోజూ తిట్టేది, కొట్టేది. ఆర్నెల్ల తర్వాత చూడడానికి వచ్చిన తండ్రి చిక్కి శల్యమైన బిడ్డని చూసి తట్టుకోలేక ఇంటికి తీసుకెళ్లి పోయాడు. తీరా అక్కడికెళ్లాక మొగుణ్ణి వదిలేసి వచ్చిందని బంధువుల సూటిపోటి మాటలూ, చిన్నపిల్లల పెళ్లిళ్లు ఎలా అవుతాయన్న అమ్మానాన్నల ఆవేదనా చూసిన కల్పన బతకడం కన్నా చావడం నయమనుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. తనని బతికించటానికి అమ్మానాన్నా పడ్డ తిప్పలు ఆమెలో ఆలోచన రేకెత్తించాయి. తండ్రికి భారం కాకూడదని కుట్టుపని నేర్చుకుంది. ముంబయి వెళ్లి ఓ బంధువు సాయంతో మిషను కుడుతూ బతకడం మొదలెట్టింది. తోడుగా వచ్చిన చెల్లెలు అనారోగ్యానికి గురై మరణించడం కల్పనకి మరో దెబ్బ. డబ్బు లేకే చెల్లెలికి మెరుగైన వైద్యం చేయించలేకపోయాననుకున్న ఆమె కసిగా సంపాదనపై దృష్టిపెట్టింది. తన పాట్లు తాను పడుతూనే పేద నిరుద్యోగుల కోసం ఓ సంఘాన్నే ప్రారంభించింది. రెండు లక్షలు పెట్టి వివాదాల్లో ఉన్న చిన్న స్థలాన్ని కొనడం ఆమెకు కలిసొచ్చింది. రెండేళ్లు కష్టపడి కోర్టు వివాదాన్ని గెలిచి, మరొకరి భాగస్వామ్యంతో భవనం కట్టించింది. ఆ అనుభవంతో స్థిరాస్తి వ్యాపారిగా మారింది. ఒంటరి స్త్రీగా ఇవన్నీ చేయడం కత్తి మీద సామే. గూండాలను ఎదుర్కొనడానికి పిస్టల్‌ లైసెన్సు తీసుకుని మరీ వ్యాపారంలో కొనసాగిందే తప్ప వెనకడుగు వేయలేదామె. తమ్ముళ్లనూ చెల్లెళ్లనూ పెద్దచేసి తానూ మళ్లీ పెళ్లి చేసుకుంది. తనలాగా ఆడపిల్లలెవరూ బాధపడకూడదని ఓ ఎన్జీవో పెట్టి స్వావలంబనలో శిక్షణ ఇప్పిస్తూ చుట్టుపక్కల వారందరికీ అండగా నిలిచేది. కమానీ ట్యూబ్స్‌ అనే ఓ ఫ్యాక్టరీ పలు వివాదాల్లో చిక్కుకుని మూతపడే దశకు చేరినప్పుడు- దాని కార్మికుల ప్రతినిధిగా ఆరేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగి వివాదాలన్నీ పరిష్కరింపజేసిన కల్పనకే కమానీ ట్యూబ్స్‌ యాజమాన్యాన్ని అప్పగించింది కోర్టు. అలా అనుకోకుండా ఓ పెద్ద కంపెనీకి అధిపతి అయ్యి దాన్ని లాభాల బాట పట్టించింది కల్పన. ఒకప్పుడు రోజుకు రెండు రూపాయలు సంపాదించడమెలా అనుకున్న కల్పనా సరోజ్‌ ఆస్తి ఇప్పుడు రూ.840 కోట్లు.


రోజుకూలీ కొడుకుని హార్వర్డ్‌ మెచ్చింది!

డబ్బులు ఎవరికీ ఊరికే రావు, కష్టపడాల్సిందేనని ముస్తఫాకి చాలా చిన్నప్పుడే తెలిసింది. ఉద్యోగంలో చేరేదాకా ఏనాడూ మూడు పూటలా తిండితినడం ఎరగని వ్యక్తి ఇప్పుడు ఇడ్లీ, దోసె పిండిని ప్యాకెట్లలో విక్రయిస్తూ వెయ్యి కోట్ల బ్రాండుని సృష్టించాడు.
కేరళలోని ఓ మారుమూల గ్రామం పీసీ ముస్తఫాది. తండ్రి రోజుకూలీ. వాళ్లుండే ఊరికి రోడ్డు లేదు, కరెంటు లేదు. బడికి ఆరు మైళ్లు నడిచి వెళ్లే క్రమంలో చిన్నారి ముస్తఫా బుర్ర చాలా ఆలోచనలు చేసేది. డబ్బు సంపాదించడానికి పెద్దయ్యేదాకా ఆగడమెందుకని వేసవి సెలవుల్లో మేనమామ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుని పట్నం నుంచి చాక్లెట్లూ తినుబండారాలూ కొనుక్కొచ్చి ఊళ్లో అమ్మేవాడు. పెట్టుబడి పోనూ తన ఖర్చులకు ఉంచుకుని తండ్రికీ కొంత ఇచ్చేవాడు. ఆ యావలో పడి ఆరో తరగతి ఫెయిలైన కొడుకుని చదువు మానేసి కూలికి రమ్మన్నాడు తండ్రి. కొడుకూ సరేనన్నాడు. స్కూలు టీచరు కలుగజేసుకుని చదువుకుంటే జీవితం బాగుపడుతుందని నచ్చజెప్పడంతో చదువు కొనసాగించాడు. సెలవుల్లో పనులకు వెళ్లి తండ్రికి తన వంతు సాయం చేస్తూనే పది పాసయ్యాడు. తండ్రి స్నేహితుడు ఉచిత వసతి కల్పిస్తే ఒక పూట తినీ ఒకపూట తినకా పట్నంలో ఇంటర్‌ చదివాడు. ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాననని టీచరుకిచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. నెలకు లక్షా 30వేల జీతంతో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో తండ్రి అప్పులు తీర్చేసి, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడు. మరో 15లక్షలు దాచుకుని ఉద్యోగం మానేసి వచ్చి తన చిరకాల స్వప్నమైన ఎంబీఏలో చేరాడు. ఆ పాఠాల్లో హార్వర్డ్‌ కేస్‌ స్టడీస్‌ గురించి చదివేటప్పుడు అలాంటి వ్యాపారం చేయగలిగితే ఎంత బాగుంటుందీ అనుకునేవాడట ముస్తఫా. అది నిజం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఓరోజు బంధువుల కుర్రాళ్లతో మాట్లాడేటప్పుడు దోసెపిండికి ఉన్న గిరాకీ గురించి తెలిసింది. వెంటనే వారితో కలిసి ఇడ్లీ, దోసె పిండిని ప్యాకెట్లలో అమ్మే వ్యాపారం మొదలెట్టాడు. పెట్టుబడీ సలహాలూ తనవి, అమలుచేయడం వారి పని. నిల్వ ఉండటానికి రసాయనాలేమీ కలపని ఈ తాజా పిండి మొదటిరోజునుంచే లాభాలు తెచ్చిపెట్టింది. ఇరవై హోటళ్లతో మొదలైన వ్యాపారం ముస్తఫా ఎంబీఏ అయ్యేసరికి 300 హోటళ్లకు సరఫరా చేసే స్థాయికి చేరింది. ఆ తర్వాత ‘ఐడీ ఫ్రెష్‌’ కంపెనీ సీఈవో హోదాలో వ్యాపారం మీద దృష్టిపెట్టిన ముస్తఫా వినూత్న ప్రయోగాలు చేశాడు. అమ్మేవాళ్లూ వెండింగ్‌ మిషనూ లేకుండా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్సుల్లో పెట్టిన ట్రస్టుషాపులు పెద్ద సంచలనమే సృష్టించాయి. నమ్మకంతో వినియోగదారుల మనసు దోచుకుని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఐడీ ఫ్రెష్‌ మొత్తానికి హార్వర్డ్‌ కేస్‌ స్టడీ అయింది. ముస్తఫా కల నెరవేరింది. ‘నేను చాలా కష్టపడి ఇంజినీరింగ్‌ చదివాను, కానీ వ్యాపారంలో నాకు ఉపయోగపడింది కేవలం కామన్‌సెన్స్‌. అది ఉంటే రోజుకూలీ కొడుకైనా నాలాగా వ్యాపారవేత్త కాగలడు...’  అంటాడు ముస్తఫా.


ఇవేవీ లక్షల కోట్ల వ్యాపారాలు కాకపోవచ్చు. ఏటా వెలువడే సంపన్నుల జాబితాలో వీరి పేర్లు ఉండకపోవచ్చు. కానీ, అడుగడుగునా అవరోధాలను అధిగమిస్తూ వారు సాగించిన ప్రయాణం అనుపమానం. వారి కృషీ పట్టుదలా అద్వితీయం. అందుకే... వారి కథలు ఎవరికైనా స్ఫూర్తినిస్తాయి, కలల్ని నిజం చేసుకునే మార్గాన్ని చూపుతాయి.

క‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు