శనివారం, అక్టోబర్ 31, 2020

అవీ.. ఇవీ

మధుమేహమా... బరువు తగ్గితే సరి!

ఆనువంశికంగానో లేదా జీవనశైలి వల్లో మధుమేహం వస్తుందని తెలిసిందే. జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు- జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని నియంత్రించవచ్చు అంటున్నారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు. ముఖ్యంగా బరువు తగ్గడం ద్వారా దీన్ని అడ్డుకోవచ్చట. కుటుంబీకుల్లో మధుమేహం ఉండి, బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎమ్‌ఐ) ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నవాళ్లలో మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ అని వాళ్ల పరిశీలనలో స్పష్టమైంది. ఆనువంశికంగా ఉన్నప్పుడు బీఎమ్‌ఐ తక్కువగా ఉన్నవాళ్లకీ రావచ్చు, కానీ బరువున్నవాళ్లతో పోలిస్తే వీళ్ల శాతం తక్కువట. అదీ కొద్దిగా బరువు పెరిగి, మళ్లీ మామూలైపోయేవాళ్లకన్నా దీర్ఘకాలంపాటు అధిక బరువుతో ఉండేవాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందట. దీన్నిబట్టి జన్యువులకన్నా బరువు వల్లే ఎక్కువమంది మధుమేహానికి గురవుతున్నారట. సో, ఆనువంశికంగా మధుమేహం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎప్పటికప్పడు బరువునీ మధుమేహాన్నీ పరిశీలించుకోవాలి. మధుమేహాన్ని తొలిదశలోనే గుర్తించి, బరువు తగ్గితే అది తగ్గిపోవచ్చు కూడానట.


పడుకునేముందు కాసిని గోరువెచ్చని పాలు తాగి పడుకో, బాగా నిద్రపడుతుంది అంటుంటారు బామ్మలు. అది ఉత్తి నమ్మకమే అని కొట్టిపారేస్తుంటారు నేటి తరం పిల్లలు. కానీ అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ బోర్డుకి చెందిన పరిశోధకులు సైతం అది నిజమే అంటున్నారు. ఆ సమయంలో పాలు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివన్నీ తగ్గి హాయిగా నిద్రపడుతుందట. పాలల్లో ఉండే ట్రిప్టొఫాన్‌ అనే ప్రొటీన్‌, మనసుకి సాంత్వన చేకూర్చే సెరటోనిన్‌ విడుదలకి తోడ్పడుతుంది. ఈ సెరటోనిన్‌ జీవగడియారాన్ని నియంత్రిస్తూ నిద్రకి కారణమయ్యే మెలటోనిన్‌ హార్మోన్‌ను విడదల చేస్తుంది. ఆ కారణంవల్లే పాలు తాగితే త్వరగానూ హాయిగానూ నిద్రపడుతుందట. ఇది పరోక్షంగా బరువు తగ్గడానికీ దోహదపడుతుంది. నిద్రపట్టడం వల్ల ఆ సమయంలో ఏదైనా తినాలన్న కోరిక తగ్గిపోతుంది. పైగా నిద్ర వల్ల జీవక్రియా వేగం పెరుగుతుంది కాబట్టి గ్లూకోజ్‌ నిల్వలు పేరుకోవు. అంటే- బరువుకీ పాలకీ సంబంధం లేదు కానీ మంచి నిద్ర వల్ల బరువు పెరగకుండా ఉంటారన్నది మాత్రం నిజం అంటున్నారు పరిశోధకులు.


కరోనా రావచ్చు... జాగ్రత్త..!

కొవిడ్‌-19 కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రెస్టరెంట్లే అంటున్నాయి అమెరికన్‌ నిపుణుల అధ్యయనాలు. అదెలా అంటే- బయటకు వెళుతున్న వాళ్లలో కొందరిని ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించినప్పుడు- వాళ్లలో కొందరికి పాజిటివ్‌ మరికొందరికి నెగెటివ్‌ వచ్చిందట. ఆపై వాళ్లని రెండు గ్రూపులుగా చేసి ప్రశ్నించారట. పాజిటివ్‌, నెగెటివ్‌ వచ్చిన ఇరు వర్గాలూ మాస్క్‌ పెట్టుకునే జిమ్‌లకీ ఆఫీసులకీ హెయిర్‌సెలూన్లకీ వెళుతున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టునీ వాడుతున్నారు. అయితే పాజిటివ్‌ వచ్చినవాళ్లలో ఎక్కువమంది తరచూ రెస్టరెంట్లకు వెళ్లగా, నెగెటివ్‌ వచ్చినవాళ్లు అక్కడకు వెళ్లడం లేదని గుర్తించారు. అంటే- హోటళ్లలోపల వెంటిలేషన్‌ సరిగ్గా ఉండకపోవడం, తినడానికీ తాగడానికీ మాస్కు తీయాల్సి రావడం... వంటి కారణాల వల్లే మిగిలిన చోట్లకి వెళ్లిన వాళ్లకన్నా వీళ్లు ఎక్కువగా కొవిడ్‌ బారిన పడుతున్నట్లు చెబుతున్నారు. దాంతో అక్కడి డిసీజ్‌ కంట్రోల్‌ బోర్డు  ఆరుబయట అదీ ఆరు అడుగుల దూరంలో టేబుళ్లు వేయాలని హోటళ్లకి సూచిస్తోంది. ఇప్పటికే కొన్ని రెస్టరెంట్లు వీటిని అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ పబ్లిక్‌ స్థలాల్లో తినేటప్పుడు జాగ్రత్త అని హెచ్చరిస్తోంది.


డిప్రెషన్‌ ఎవరికి వస్తుందంటే..!

టీవీ ఎక్కువగా చూడటం, పగటిపూట నిద్రపోవడం, ఎటూ కదలకుండా ఇంట్లోనే కూర్చోవడం వంటి వాటివల్ల డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే వీటికి బదులుగా ఎక్కువగా వ్యక్తులతో కలిసి మాట్లాడటం అంటే- సామాజిక సంబంధాల్ని ఏర్పరచుకోవడం వల్ల డిప్రెషన్‌ దరిచేరదని మాసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌కు చెందిన సిబ్బంది పేర్కొంటున్నారు. ఇందుకోసం వీళ్లు దాదాపు లక్షమందిని ఎంపిక చేసి వాళ్ల జీవనశైలిని పరిశీలించారట. సామాజిక బంధాలు, నిద్రావేళలు, ఆహారం, శారీరక వ్యాయామం, సామాజిక మీడియాను వాడటం ఇలా అన్నింటినీ తీసుకుని రకరకాలుగా పరిశీలించగా- సామాజికంగా ఎవరితోనూ ఎక్కువగా కలవకుండా ఉండేవాళ్లలోనే ఇది కనిపిస్తుందని తేల్చారు. అదీ కదలకుండా ఒకచోటే కూర్చుని టీవీ చూడటం, పగటివేళలో అతిగా నిద్రపోవడం, మల్టీవిటమిన్లు ఎక్కువగా వాడటం వంటివి డిప్రెషన్‌కు దారితీస్తున్నట్లు గుర్తించారు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

మన దేశంలో తొలి కృత్రిమదీవిని 1936లో కేరళలోని కొచ్చిలో నిర్మించారు. కొచ్చి ఓడ రేవు, నావల్‌ బేస్‌ కోసం నిర్మించిన ఈ దీవికి, ఆ సమయంలో ఇండియా వైస్రాయ్‌గా ఉన్న విల్లింగ్‌టన్‌ పేరునే పెట్టారు.


అలాగా!

పెళ్లికూతురు పెళ్లిలో తలెందుకు వంచుకుంటుందంటే... పెళ్లయ్యాక ఎలా ఉండాలో భర్తకు చూపించడానికిక‌వర్ స్టోరీ

సినిమా

ప్ర‌ముఖులు

సెంట‌ర్ స్ప్రెడ్

ఆధ్యాత్మికం

స్ఫూర్తి

క‌థ‌

జనరల్

సేవ

కొత్తగా

పరిశోధన

కదంబం

ఫ్యాషన్

రుచి

వెరైటీ

ఇంకా..

జిల్లాలు