వ్యాధులు - బాధలు

Updated : 25/11/2020 15:48 IST
ఈసీజీతో ఎలెక్ట్రోలైట్ల మోతాదులు!

రక్త నమూనా తీయాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రోకార్డియోగ్రామ్‌ (ఈసీజీ) ద్వారా ఎలక్ట్రోలైట్ల మోతాదులను గుర్తించొచ్చని కౌనస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు నిరూపించారు. ఇది చివరిదశ కిడ్నీ జబ్బులతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడగలదని, ప్రాణాంతక పరిస్థితిని నివారించుకోవటానికి తోడ్పడగలదని భావిస్తున్నారు. గుండె కణాలు పనిచేయటానికి ఎలక్ట్రోలైట్లు.. ముఖ్యంగా పొటాషియం అత్యవసరం. ఎలక్ట్రోలైట్ల మోతాదులు మరీ పెరిగినా, మరీ తగ్గినా గుండె సరిగా సంకోచించదు. దీంతో గుండె లయ అస్తవ్యస్తమవుతుంది. కొన్నిసార్లు హఠాత్తుగా ప్రాణాపాయం సంభవించొచ్చు. ఎలక్ట్రోలైట్ల మోతాదులను కిడ్నీలు నియంత్రిస్తుంటాయి. చివరిదశ కిడ్నీ జబ్బు గలవారిలో, డయాలసిస్‌ చేయించుకుంటున్నవారిలో ఇవి గతి తప్పే ప్రమాదముంది. ఈసీజీ ఆధారంగా గుండె కొట్టుకునే తీరును, దీన్ని బట్టి ఎలక్ట్రోలైట్ల మోతాదులను అంచనా వేయొచ్చు. అయితే ఇదంత తేలికైన పనికాదు. ఎలక్ట్రోలైట్లు నార్మల్‌ స్థాయులను దాటి హెచ్చుతగ్గులకు గురవుతుంటే గుర్తించటం చాలా కష్టం. గణిత నమూనాల సాయంతో కేటీయూ పరిశోధకులు దీనికి పరిష్కార మార్గం కనుగొన్నారు. కంటికి కనిపించని మార్పులను తొలిదశలోనే గుర్తించగలిగారు. ఈసీజీలో ఒక ప్రత్యేక భాగంలో తలెత్తే మార్పులను బట్టి పొటాషియం స్థాయులను కచ్చితంగా అంచనా వేయటంలో విజయం సాధించారు. ఇది మున్ముందు ఎలక్ట్రోలైట్లను గుర్తించటానికి డిజిటల్‌ జీవ సూచికగా ఉపయోగపడగలదని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని