వ్యాధులు - బాధలు

Published : 10/04/2021 01:56 IST
మంచి మనసుకు మంచి రోజులు!

జీవితంలో ఆటుపోట్లు సహజమే. అన్నిసార్లూ మనం అనుకున్నట్టే జరగాలనేమీ లేదు. అనూహ్యమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు. అంతమాత్రాన నిరాశా నిస్పృహల్లో కూరుకుపోతే ఎలా? రోజులన్నీ ఒకలా ఉంటాయా ఏం? ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ సాగటమే అలవరచుకోవాలి. ఇలాంటి సానుకూల దృక్పథం, ఆశావహ ధోరణి ఎప్పుడైనా మంచిదే. అలాగని వాస్తవాలను పక్కన పెట్టాలని కాదు. సమస్యలను తేలికగా తీసుకోవాలని కాదు. పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, మంచి చెడ్డలను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగటం నేర్చుకోవాలి. ఇది శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. 
ఎన్నెన్నో లాభాలు
ఆశావహ, సానుకూల ధోరణితో ఒనగూరే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఆశావహ దృక్పథంతో ఆరోగ్యం ఇనుమడిస్తుందా? చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యంతో సానుకూల దృక్పథం వికసిస్తుందా? ముందుగా ఏది దేన్ని ప్రభావితం చేస్తుందన్నది తెలియదు గానీ ప్రయోజనాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 

కొన్ని శారీరక ప్రయోజనాలు ఇవీ..

* ఆయుష్షు పెరగటం

* గుండెపోటు ముప్పు తగ్గటం

* రక్తపోటు అదుపులో ఉండటం

* మంచి శారీరక ఆరోగ్యం

* ఫ్లూ, జలుబు వంటి ఇన్‌ఫెక్షన్లను బాగా తట్టుకోవటం

* ఒత్తిడిని బాగా ఎదుర్కోవటం

* నొప్పిని తట్టుకోవటం

కొన్ని మానసిక ప్రయోజనాలు ఇవీ..

* సృజనాత్మకత ఇనుమడించటం

* సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మెరుగవటం

* స్పష్టంగా ఆలోచించటం

* ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం పెరగటం

* కుంగుబాటు, ఆందోళన తగ్గటం

సాధనతో సాధ్యమే

సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నది వేమన వాక్కు. ఇది సానుకూల దృక్పథానికీ వర్తిస్తుంది. ముందుగా చేయాల్సింది ప్రతికూల ఆలోచనలను కట్టడి చేసుకోవటం. తటస్థ దోరణితో ఆలోచించటం.. మంచేదో, చెడేదో విడదీసి చూడటం ద్వారా దీన్ని సాధించొచ్చు. ముందుగానే ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే అప్పటి భావోద్వేగాలకు అనుగుణంగానే ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటుంటారు. జరకూడనిదేదో జరుగుతుందని ముందే భయపడటం ఏమాత్రం తగదు. ఉదాహరణకు చెడే జరుగుతుందని భావించేవారికి అన్నీ చెడ్డగానే కనిపిస్తాయి. అందువల్ల ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు మెదడును తొలుస్తుంటే సానుకూల అంశాలపై దృష్టి సారించి మనసును దారి మళ్లించుకోవచ్చు. అలాగే ఏదైనా చెడు జరిగితే తమను తాము నిందించుకోవటం మానెయ్యాలి. హేతుబద్ధంగా ఆలోచించటం అలవరచుకోవాలి. ఇలా ప్రతికూల ఆలోచనలను కట్టడి చేసుకుంటే సానుకూల దృక్పథాన్ని అలవరచుకోవటానికి మార్గం సుగమమవుతుంది. ఇందుకు కొన్ని మార్గాలు లేకపోలేదు.

* మరింతగా నవ్వుతుండాలి: ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో నవ్వుతూ వ్యవహరించేవారు అనంతరం మరింత ఆశావహ ధోరణిని కనబరుస్తున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. నిజమైన నవ్వు మరింత ఎక్కువ ప్రభావం చూపుతుండటం నిజమే గానీ ఉత్తుత్తి నవ్వుతోనూ మంచి ఫలితం ఇస్తుండటం గమనార్హం. కాబట్టి అస్తమానం జేవురించిన మొహంతో కాకుండా నవ్వుతుండటం, నవ్వించేవారితో గడపటం మంచిది. కావాలంటే నవ్వు పుట్టించే కథలు చదవొచ్చు, సినిమాలు చూడొచ్చు. 

* పరిస్థితిని భిన్నంగా చూడాలి: అనుకోనిదేదో జరిగింది. మన చేతిలో ఏమీ లేదు. చేయగలిగిందీ లేదు. ఇలాంటి సమయంలో జావగారిపోకుండా భిన్నంగా ఆలోచించటం అలవరచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ మంచిని చూడటం నేర్చుకోవాలి. ఉదాహరణకు- కారులో వెళ్తున్నారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్నారనుకుందాం. కారుంది కాబట్టి సరిపోయింది. బైక్‌ మీద అయితే ఎండకు ఎంత మాడిపోయేవాడినో కదా అని అనుకోవచ్చు. మంచి పాటలు వినటానికి సమయం దొరికిందనీ సంతోషించొచ్చు. ఇలా భిన్నంగా ఆలోచించటం నేర్చుకోవాలి.

* మంచి విషయాలు రాసుకోవాలి: చిత్రంగా అనిపించినా ఇది మంచి ప్రభావమే చూపిస్తుంది. రోజూనో వారానికోసారో మనకు ఎదురైన మంచి సంఘటనలు, కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన పరిస్థితులను డైరీ రూపంలో రాసుకోవటం వల్ల జీవితంలో జరిగిన మంచి పనుల మీద దృష్టి సారించటం అలవడుతుంది. ఇది ఆలోచనా ధోరణి మారటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి ‘కృతజ్ఞత’ డైరీ రాసుకునేవారు భవిష్యత్తు మీద ఆశావహ, సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టు ఒక అధ్యయనం చెబుతోంది. దీంతో నిద్ర కూడా బాగా పడుతుండటం గమనార్హం.

* అందమైన భవిష్యత్తును ఊహించుకోవాలి: ఉద్యోగ పరంగా కావొచ్చు. సంబంధాల పరంగా కావొచ్చు. ఆరోగ్యం, హాబీల వంటివేవైనా కావొచ్చు. మున్ముందు ఎంత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటున్నారనేది తలచుకొని, వాటిని రాసిపెట్టుకోవటమూ మేలే. ఎంత బాగా జీవించాలని అనుకుంటున్నారనేది ఊహించుకున్నప్పుడు మనసులో కొత్త ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. నిరాశా నిస్పహలు తొలగుతాయి.

* బలాలపై దృష్టి పెట్టాలి: ప్రతి మనిషికి కొన్ని బలాలు, బలహీనతలుంటాయి. వారానికోసారి అయినా మన బలాలేంటన్నది పరిశీలించుకోవటం మంచిది. ఉదాహరణకు- మన క్రమశిక్షణ, సృజనాత్మకత, దయా గుణం వంటివి బేరీజు వేసుకోవచ్చు. వీటిని ఒక కాగితం మీద రాసుకొని, సరికొత్తగా ఇంకెలా ఉపయోగించుకోవచ్చో ప్రణాళిక వేసుకోవాలి. దీన్ని ఆచరణలో పెట్టినవారిలో ఒక వారంలోనే ఆనందం, సంతోషం ఇనుమడిస్తున్నట్టు.. కుంగుబాటు లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు ఒక అధ్యయనం పేర్కొంటోంది. దీని ప్రయోజనాలు ఆరు నెలల తర్వాతా కొనసాగుతుండటం విశేషం. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని