వ్యాధులు - బాధలు

Published : 01/01/2020 01:24 IST
మద్యం కొద్దిగా.. ఇబ్బంది లేదా?

సమస్య - సలహా

సమస్య: మా స్నేహితుడికి మద్యం అలవాటుంది. మానెయ్యమంటే వినటం లేదు. కొద్దిగా తాగితే ఏమీ కాదని కొట్టిపారేస్తుంటాడు. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఏమీ కాదని.. తినకపోతేనే జబ్బులు వస్తాయని వాదిస్తున్నాడు. ఇది నిజమేనా?

- వీర్రాజు, కడప

సలహా: మద్యంపై ఎన్నో అపోహలున్నాయి. మీ స్నేహితుడి వాదనలూ అలాంటివే. మద్యం కొద్దిగా తాగితే ఏమీ కాదనుకోవటం.. మద్యం తాగిన తర్వాత భోజనం చేస్తే ఎలాంటి హానీ ఉండదనుకోవటం పూర్తిగా అపోహ. భోజనం చేయటం వల్ల తాత్కాలికంగా జీర్ణాశయంలో మంట, చికాకు వంటి ఇబ్బందులు కనబడకపోవచ్చేమో గానీ తిని తాగినా, తాగి తిన్నా మద్యం మూలంగా తలెత్తే అనర్థాలను తప్పించుకోలేం. మద్యం ఎంత తీసుకుంటారనేదాన్ని బట్టి దాని దుష్ప్రభావాలు, అనర్థాల తీవ్రత పెరుగుతుంది. అందువల్ల వీలైనంతవరకు మద్యానికి దూరంగా ఉండటమే ఉత్తమం. ఒకవేళ మరీ తప్పదనుకుంటే మితం పాటించటం మంచిది. మన కాలేయం కొంతవరకే ఆల్కహాల్‌ను విడగొట్టగలదు. నిర్ణీత మద్యం మోతాదు (ఒక పెగ్గు) కొలమానం ఒకో దేశంలో ఒకోలా ఉంటుంది. మనదేశంలో సుమారు 60 మిల్లీలీటర్లను ఒక పెగ్గుగా భావిస్తుంటారు. కానీ వైద్యపరంగా ఒక పెగ్గు అంటే 25 మిల్లీలీటర్లే. మంచి ఆరోగ్యంతో ఉన్నా కూడా మన కాలేయం వారంలో గరిష్ఠంగా ఇలాంటి 21 పెగ్గుల కన్నా ఎక్కువ.. అంటే 525 మిల్లీలీటర్ల కన్నా ఎక్కువ (మహిళల్లోనైతే 350 ఎం.ఎల్‌.) మద్యాన్ని విడగొట్టలేదు. దీన్ని విడగొట్టే క్రమంలో రకరకాల విషతుల్యాలు పుట్టుకొస్తాయి కూడా. ఇవి కాలేయాన్ని బాగా దెబ్బతీస్తాయి. కాలేయానికి కొవ్వు పట్టటం, కాలేయవాపు (హెపటైటిస్‌) వంటి సమస్యలు మొదలవుతాయి. క్రమంగా కాలేయం గట్టిపడిపోయి తాళ్లుతాళ్లుగా (సిరోసిస్‌) అయిపోతుంది. కాలేయ క్యాన్సర్‌ కూడా రావొచ్చు. మద్యం మూలంగా జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులు పెరిగిపోతాయి. దీంతో ఆకలి తగ్గిపోతుంది. జీర్ణాశయంలో, పేగుల్లో అల్సర్లు, క్యాన్సర్లు తలెత్తొచ్చు. అతిగా మద్యం తాగితేనే ఇలాంటి అనర్థాలు తలెత్తుతాయని అనుకోవటానికీ లేదు. ఎందుకంటే మద్యం కొద్దిగా తాగినా క్లోమగ్రంథి (పాంక్రియాస్‌) విపరీతంగా ప్రభావితమవుతుంది. ఇది పాంక్రియాస్‌ వాపునకు దారితీయొచ్చు. కాలేయం గట్టిపడటం, పాంక్రియాస్‌ వాపులతో కిడ్నీ జబ్బులూ తలెత్తొచ్చు. అతిగా మద్యం తాగేవారిలో మెదడు కుంచించుకుపోతున్నట్టూ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మద్యంతో పాటు చాలామంది కొవ్వులు, నూనెలతో కూడిన రకరకాల పదార్థాలు కూడా తింటుంటారు. అసలే మద్యంలో కేలరీలు దండిగా ఉంటాయి. ఇలాంటి పదార్థాలతో కేలరీలు మరింత పెరుగుతాయి. ఇవి అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తాయి. వీటితో మధుమేహం, అధిక రక్తపోటు ముప్పులూ పెరుగుతాయి. ఇక మధుమేహం, అధిక రక్తపోటుతో గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలూ దాడిచేస్తాయి. నాడులు కూడా దెబ్బతింటాయి. కాబట్టి మద్యం జోలికి వెళ్లకపోవటం మంచిదని గుర్తించాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒకో వ్యక్తి ఏటా సగటున 30 లీటర్లకు పైగా మద్యాన్ని తాగుతున్నారని అంచనా. ఇది జాతీయ సగటు (6 లీటర్లు) కన్నా 5 రెట్లు ఎక్కువ కావటం గమనార్హం. ఈ నేపథ్యంలో అపోహలను తొలగించుకొని.. మద్యానికి దూరంగా ఉండటం ఎంతైనా అవసరమని అంతా తెలుసుకోవాలి.


మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య - సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని