వ్యాధులు - బాధలు

Updated : 22/01/2019 14:46 IST
‘చిన్న కలత’ పెద్దదే! 

రేపు ప్రపంచ మానసిక ఆరోగ్యదినం

బాల్యపు అమాయకత్వాన్ని దాటుకొని, యుక్తవయసు చిలిపితనాన్ని లంఘిస్తూ.. బాధ్యతలతో ఆహ్వానించే యవ్వనంలోకి అడుగుపెడుతున్న తరుణంలో కొత్త సందేహాలెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎన్నెన్నో ఒత్తిళ్లు ముప్పిరిగొంటుంటాయి. అందుకే ఈ సమయంలో నిరాశా నిస్పృహలు దరిజేరకుండా.. మనో నిబ్బరం కోల్పోకుండా ఉండటం ఎంతో కీలకం. ‘ప్రపంచ మానసిక ఆరోగ్యదినం’ కూడా ఇదే నినదిస్తోంది. శరవేగంగా మారిపోతున్న ఆధునిక ప్రపంచంలో యుక్తవయసు పిల్లల, యువత మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెబుతోంది. చిన్నల కలతలను పెద్దలు చిన్నచూపు చూడటం తగదని సూచిస్తోంది.

‘చిన్న కలత’ పెద్దదే! 

మనిషి జీవితంలో తొలి యవ్వనదశ చాలా కీలకం. భవిష్యత్తుకు పునాది పడేది ఇక్కడే. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో మార్పులు సంభవించే తరుణం. అప్పటివరకూ అమ్మకూచిగా పెరిగిన వాళ్లు ఒంటరిగా ఇంటి గడప దాటి.. ఎక్కడెక్కడో స్కూళ్లోలోనో, కాలేజీల్లోనో చేరటం.. కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు, కొత్త చదువులు.. ఇలా ఎన్నో కొంగొత్త అనుభవాలు ఎదురయ్యే సమయం. ఇది చాలామందికి ఉత్సాహంగానే ఉంటుందిగానీ కొందరు ఈ కొత్త వాతావరణంలో ఇమడలేక తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు, భయాలకు లోనవుతుంటారు. చదువుల్లో రాణిస్తామో లేదో.. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తామో లేమోనని బెంగ పడుతుంటారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు ఆన్‌లైన్‌ సామాజిక వేదికల హవా ఒకటి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికలు అనుభవాలను పంచుకోవటానికి, భావాలను వ్యక్తం చేసుకోవటానికి తోడ్పడే మాట నిజమే కావొచ్చు గానీ ఇవి తోటివాళ్లతో పోల్చుకోవటానికీ దారితీయొచ్చు. వారిలా ఉండలేకపోతున్నామనో, వారిలా ఎక్కువ మంది స్నేహితులను పొందలేకపోతున్నామనో మథన పడిపోయేలా చేయొచ్చు. ఇలాంటి భయాలు, ఆందోళనల విషయంలో ముందుగానే జాగ్రత్త పడటం మంచిది. లేకపోతే కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి సమస్యల వంటివి దాడిచేసే ప్రమాదముంది.

పిల్లలకేం ఇబ్బందని అనుకోవద్దు 
పిల్లలకు మానసిక సమస్యలేంటని చాలామంది భావిస్తుంటారు. నిజానికి మానసిక సమస్యల్లో దాదాపు సగం సమస్యలకు 14 ఏళ్ల వయసులోనే బీజం పడుతుంటుంది. విషాదమేంటంటే- చాలామందిలో వీటిని గుర్తించక పోవటం. ఒకవేళ గుర్తించినా సరైన చికిత్స తీసుకోకపోవటం. ప్రస్తుతం చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ తీవ్రమైన పోటీతత్వం నెలకొంది. ఇవన్నీ లేలేత మనసుల్లో తీవ్ర కల్లోలం రేపుతున్నాయి. పెను భారాన్ని మోపుతున్నాయి. దీంతో ఎంతోమంది కుంగుబాటుకు లోనవుతున్నారు. మరెంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 15-29 ఏళ్ల వయసులో సంభవిస్తున్న మరణాలకు ఆత్మహత్యలు రెండో అతిపెద్ద కారణంగా నిలుస్తోంది కూడా. ఒత్తిళ్లను తట్టుకోలేకో.. ఉత్సుకత కొద్దో మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాలకూ బానిసలైపోతున్నవారు ఎందరో. బాల్యం నుంచే పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా చూస్తే ఇలాంటి పరిస్థితిని చాలావరకు తప్పించుకోవచ్చు.

‘చిన్న కలత’ పెద్దదే! 
యవ్వనదశలో తరచుగా కనబడే మానసిక సమస్యల గురించి తెలుసుకొని ఉండటం ఎంతో మంచిది. వీటిని తొలిదశలోనే గుర్తిస్తే వెంటనే జాగ్రత్త పడొచ్చు.

* కుంగుబాటు: ఇది యుక్తవయసులో తరచుగా కనబడే సమస్య. దీని బారినపడ్డవారిలో విచారం, నిరాశా నిస్పృహలు, చిరాకు, తమను తాము నిందించుకోవటం, దేని మీదా ఆసక్తి లేకపోవటం, మందకొడితనం, ఏకాగ్రత లోపించటం, నిద్ర సరిగా పట్టకపోవటం, ఆకలి మందగించటం, బరువు తగ్గటం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనబడతాయి.

* ఆత్మహత్యలు: అనూహ్యంగా ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొనే మనో నిబ్బరం, మానసిక పరిపక్వత లేకపోవటమే వీటికి మూలం. ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు తరచుగా తాము దేనికీ పనికిరామని, చనిపోతే బావుంటుందని చెబుతుంటారు. కొందరు మద్యం, మాదకద్రవ్యాలకూ అలవడుతుంటారు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.

* స్కిజోఫ్రీనియా: ఇది తీవ్రమైన సమస్య. జన్యుపరంగా స్కిజోఫ్రినియా వచ్చే అవకాశం గలవారు తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడిది సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. దీని బారినపడ్డవారిలో ఆలోచనా ధోరణి మారిపోతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవటం, నిర్ణయాలు తీసుకోలేకపోవటం, భయభ్రాంతులకు లోనుకావటం, దేనిమీదా ఆసక్తి చూపకపోవటం వంటి లక్షణాలూ కనబడుతుంటాయి. యుక్తవయసులో దీన్ని నిర్ధరించటం కాస్త కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే తొలిదశలో స్నేహితులను మార్చేయటం, మార్కులు తగ్గిపోవటం, చిరాకు, సరిగా నిద్రపోకపోవటం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. ఇవన్నీ యుక్తవయసులో సర్వ సాధారణంగా కనబడేవే కావటం గమనార్హం. 
* ఆందోళన సమస్యలు: హాస్టళ్ల వంటి చోట్ల ఇంట్లో మాదిరి సౌకర్యాలుండవు. కొందరిలో ఇది ఆందోళన సమస్యలకు దారితీస్తుంది. త్వరగా అలసిపోవటం, సరిగా చదవలేకపోవటం, తలనొప్పి, కడుపునొప్పి వంటి వాటితో సతమతమవుతుంటారు. కొందరు వీటిని తట్టుకోలేక చదువులను మధ్యలోనే మానేస్తుంటారు కూడా.

* సంబంధ సమస్యలు: ఈ వయసులో లైంగిక ఆకర్షణలకు లోనుకావటమూ ఎక్కువే. మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల వీటిని ప్రేమ వ్యవహారంగానూ భావిస్తుంటారు. అయితే పెద్దవాళ్లు అంగీకరించకపోయినా.. అవతలివాళ్లు తిరస్కరించినా నిరాశా నిస్పృహల్లోకి జారిపోవచ్చు. వ్యక్తిత్వ లోపం గలవారైతే కోపావేశంలో ఇష్టపడ్డవారిపైనే దాడులకు తెగబడొచ్చు.

* వ్యసనాలు: పై చదువులకు చేరుకోగానే చాలామంది ఎక్కడలేని స్వేచ్ఛ దొరికిందని సంతోషిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమను తాము చాటుకోవాలనే ఉత్సుకతతో మద్యం తాగటం, సిగరెట్లు కాల్చటం వంటివీ అలవాటు చేసుకుంటుంటారు. మాదకద్రవ్యాలకూ త్వరగా అలవడే అవకాశముంది. ఇవి వ్యవసనాలుగానూ స్థిరపడిపోతుంటాయి.

* వ్యక్తిత్వ సమస్యలు: మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల మొండితనం, మూర్ఖత్వం, కోపం, తల్లిదండ్రులను కొట్టటం, తిట్టటం, ఉపాధ్యాయులకు ఎదురు మళ్లటం వంటివీ తలెత్తొచ్చు. ఇలాంటివాళ్లు త్వరగా వ్యసనాలకూ బానిసలైపోతుంటారు.

ఏడీహెచ్‌డీ: ఇది బడికి వెళ్లే వయసులోనే ఆరంభమయ్యే సమస్య. ఇందులో ఏకాగ్రత కుదరకపోవటం లేదా అతి చురుకుగా వ్యవహరించటం వంటి లక్షణాలు కనబడతాయి. వీళ్లు ఒకచోట కుదురుగా ఉండరు. ఏ పనైనా ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే చేసేస్తుంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే వ్యక్తిత్వ సమస్యలకు, మాదకద్రవ్యాల వ్యసనం వంటి వాటికి దారితీస్తుంది.

తొలి అడుగు ఇంటి నుంచే.. 
మేధోపరంగా, భావోద్వేగాల పరంగా, నైతికంగా, సామాజికంగా పరిపక్వత సాధిస్తేనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది. మానసిక ఆరోగ్యానికి ఇదే పునాది. తెలివితేటలు, గుణగణాలు, భావోద్వేగాల నియంత్రణ, మానవత్వం, సామాజిక భావనల వంటివన్నీ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని పెంపొందించటం మీద తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దగ్గర్నుంచి అంతా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంది. కాండం గట్టిపడుతున్న సమయంలో మంచి దన్ను లభిస్తే మొక్క ఏపుగా ఎదుగుతుంది. యవ్వనదశలోనూ ఇలాంటి దన్నే అవసరం. అల్లకల్లోల ఆలోచనలను, అభిప్రాయాలను గాడిలో పెట్టి సరైన దిశలో నడిపించేందుకు ఒక మార్గం కావాలి. దీనికి ఇంటి నుంచే తొలి అడుగు పడాలి.

* యవ్వనదశలో చాలామంది ఆర్థికంగా తల్లిదండ్రుల మీదే ఆధారపడుతుంటారు. సొంత నిర్ణయాలను తీసుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి తరుణంలో ఇంట్లో అనువైన వాతావరణం ఉండటం కీలకం. పెద్దవాళ్లు పిల్లలను స్నేహితులుగా భావిస్తూ, వారి ఆలోచనలను, అభిప్రాయాలను గౌరవించటం, అభిప్రాయాలను కలబోసుకోవటం, భవిష్యత్తు గురించి చర్చించుకోవటం, మంచీ చెడ్డలు తెలుసుకోవటం మంచిది. ఇంట్లో సానుకూల వాతావరణం ఉన్నప్పుడు పిల్లలు మనసు విప్పి మాట్లాడగలుగుతారు. సందేహాలను నివృత్తి చేసుకుంటారు. తమను, తమ అభిప్రాయాలను పెద్దవాళ్లు పట్టించుకోవటం లేదని గుర్తిస్తే నిరాశా నిస్పృహలకు, ఒత్తిడికి లోనవుతారు. మొండితనమూ తలెత్తొచ్చు. ఇవన్నీ మనసుపై విపరీత ప్రభావం చూపుతాయి.

ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యాసంస్థల్లో అంతా ఒక్కటేననే భావాన్ని పెంపొందించాలి. విద్యాసంస్థలకు సమీపంలో మత్తుమందులు, మాదకద్రవ్యాల వంటివేవీ అందుబాటులో లేకుండా జాగ్రత్త తీసుకోవాలి.

* చదువుల విషయంలో ఒత్తిడికి గురిచేయటం మరో సమస్య. పిల్లల ఇష్టాయిష్టాలు, తెలివితేటలను పట్టించుకోకుండా డాక్టర్‌ కావాలనో, ఇంజినీర్‌ కావాలనో చిన్నప్పట్నుంచే ఒత్తిడి తేవటం ఏమాత్రం మంచిది కాదు. ప్రతిదీ తాము చెప్పినట్టే చేయాలని భావించటమూ తగదు. దీంతో పిల్లల్లో ఆలోచనా శక్తి సన్నగిల్లుతుంది. సోమరితనం, నిర్లిప్తత అలవడతాయి. పెద్దవాళ్ల మీద ఆధారపడటం పెరిగిపోతుంది. అందువల్ల పిల్లలు స్వతంత్రంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించాలి. దీంతో బాధ్యతా పెరుగుతుంది. ఇంట్లో ఇబ్బందులను అర్థం చేసుకునే గుణం కూడా అలవడుతుంది.

* పిల్లలకు.. ముఖ్యంగా 5-12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు మార్గదర్శకంగా నిలవాలి. చెప్పేదొకటి చేసేదొకటిగా ఉండకూడదు. ‘నిజాయతీగా ఉండాలి, సోమరితనం వద్దు’ అని పిల్లలకు చెబుతూ తామే దాన్ని పాటించకపోతే లేత మనసుల్లో విరుద్ధ భావనలు పొడసూపుతాయి.

* మనదగ్గర చాలామంది ‘ఫలానా వాళ్ల కొడుకు అప్పుడే మంచి ఉద్యోగం సాధించాడు.. ఎదురింటి అమ్మాయిని చూడు ఎలా మొదటి ర్యాంకు తెచ్చుకుందో.. వాళ్లను చూసైనా బుద్ధి తెచ్చుకో’... ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇలా పోల్చిచూడటం వల్ల ఒత్తిడి, ఆందోళన మొదలవుతాయి.

* సమాజంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ఆయా పరిస్థితులను, మార్పులను అర్థమయ్యేలా పిల్లలకు విడమరచి చెప్పాలి. ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. దీంతో ఇంటికి దూరంగా ఉన్నా కూడా ధైర్యంతో, నిబ్బరంతో మెలగటానికి వీలవుతుంది.

* హాబీలు ఏర్పరచుకునేలా, చర్చల్లో పాల్గొనేలా, పుస్తకాలు చదివేలా, ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. గ్రంథాలయాలకు వెళ్లటం అలవాటు చేయాలి. సంగీతం, బొమ్మలు వేయటం వంటి సృజనాత్మకతతో కూడిన కళలు మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. ఆత్మ గౌరవం పెంపొందేలా తోడ్పడతాయి.

స్కూళ్లు.. కాలేజీలు.. సమాజం..

ఒకప్పటితో పోలిస్తే స్కూళ్లలో, కాలేజీల్లో పరిస్థితి బాగా మారిపోయింది. పిల్లలు విజ్ఞానాన్ని సంపాదిస్తున్నారా? గుణగణాలు ఎంతవరకు మెరుగవుతున్నాయి? అనే విషయాలపై ఉపాధ్యాయులు అంతగా దృష్టి పెట్టటం లేదనే చెప్పుకోవాలి. మార్కులు ఎక్కువగా తెచ్చుకున్నవాళ్లను ప్రోత్సహించటం వంటి ధోరణులూ పెరిగిపోతున్నాయి. ఇది మార్కులు ఎక్కువ తెచ్చుకున్నవారిలో ‘అందరికన్నా తామే గొప్ప’ అనే దురభిప్రాయాలు ఏర్పడటానికి.. తక్కువ మార్కులు వచ్చినవాళ్లు ‘తాము దేనికీ పనికిరామేమో’ అనుకుంటూ మానసికంగా కుంగిపోవటానికి దారితీస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. విద్యాబోధనతో పాటు జీవన నైపుణ్యాలు పెంపొందించుకునేలా కూడా పిల్లలను ప్రోత్సహించాలి.

* పిల్లలు స్నేహితులతోనే సన్నిహితంగా ఉంటారు. అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటారు. అయితే ఒకరితో ఒకరు పోల్చుకోవటం, అనుకరించటం వంటివి కొన్నిసార్లు పెడ ధోరణులకూ దారితీయొచ్చు. విపరీత ఆకర్షణలకూ లొంగిపోవచ్చు. అనుచిత సంబంధాల్లో పడిపోవచ్చు. పెద్దవాళ్ల తోడ్పాటు ఉంటే ఇలాంటి ఇబ్బందులను తేలికగా అధిగమించే అవకాశముంటుంది.

* సమాజం వేగంగా మారిపోతోంది. ముఖ్యంగా నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. డబ్బుకు ప్రాధాన్యం పెరిగిపోతోంది. ఆడంబరాలూ పెరిగాయి. దీంతో పెద్ద ఉద్యోగం సాధించాలని.. డబ్బు, పేరు ప్రతిష్ఠలు సంపాదించాలనే భావన యువతలో పెరుగుతోంది. సంతోషంగా, తృప్తిగా బతకాలనే ధోరణి తగ్గిపోతోంది. కుటుంబంతో, స్నేహితులతో, సమాజంతో అనుబంధాలూ దూరమవుతున్నాయి. ఫలితంగా ఏదైనా సమస్య వచ్చినపుడు పండుటాకుల్లా వణికిపోతున్నారు. ఆ నిరాశా నిస్పృహలతో ఎదుటివాళ్లపైన దాడి చేయటమో.. లేదూ తమకు తాము హాని చేసుకోవటమో చేస్తున్నారు.

నివారణే కీలకం

మానసిక సమస్యలు వచ్చాక బాధపడటం కన్నా వీటిని నివారించుకోవటమే ఉత్తమం. ఇందుకు ఇంట్లో అనువైన వాతారణం ఉండటం ఎంతగానో ఉపయోగపడుతుంది.  కుటుంబంలో ఎవరైనా మానసిక సమస్యలతో బాధపడుతుంటే వాటి ఒత్తిడి పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఒత్తిడి లక్షణాలను గమనిస్తే ముందుగానే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. హాస్టళ్లలో చేర్పించేముందే అక్కడ ఎలా ఉండాలి? సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? అనేవి విడమరుస్తూ ముందే సన్నద్ధం చేయాలి. మద్యం, మాదక ద్రవ్యాల వంటి చెడు అలవాట్ల వైపు మళ్లకుండా ముందే జాగ్రత్తలు చెప్పాలి. మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌ల వంటి పరికరాల వాడకం ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతోంది. విజ్ఞాన సముపార్జనకు, సమాచార మార్పిడికి ఇవి ముఖ్యమే. అయితే అస్తమానమూ వీటితోనే గడిపితే వ్యసనంగా మారొచ్చు. కాబట్టి కాల్పనిక ప్రపంచం కన్నా నిజ జీవన సంబంధాలు, ఆత్మీయ అనుబంధాలు ముఖ్యమనే విషయాన్ని అర్థమయ్యేలా వివరించాలి.

చికిత్స

మానసిక సమస్యలు గలవారిలో కొన్ని ముందస్తు సంకేతాలు కనబడుతుంటాయి. ఆందోళన, మొండితనం, నిద్ర పట్టకపోవటం, స్కూలుకు, కాలేజీకి వెళ్లాలంటే భయపడటం, తలనొప్పి, కడుపునొప్పి, వికారం, తల తిరిగిపోవటం వంటివి కనబడుతుంటే వెంటనే సైక్రియాటిస్ట్‌కు చూపించటం మంచిది. వీరికి అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్‌ లేదా మందులతో చికిత్స చేయాల్సి ఉంటుంది.

* కౌన్సెలింగ్‌: వ్యక్తిత్వాన్ని బలపరచుకోవటానికి, భావోద్వేగాలను నియంత్రించుకోవటానికి, సమస్యలను పరిష్కరించుకోవటానికి, కోపం తట్టుకోవటానికి పాటించాల్సి విధివిధానాలను ఇందులో నేర్పిస్తారు. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలో అర్థమయ్యేలా చెబుతారు. అమాయకత్వంతోనో, ఉత్సుకతతోనో కొందరు శృంగార పరంగానూ ప్రయోగాలు చేస్తుంటారు. వీరికి సురక్షిత లైంగిక సంపర్కంపై అవగాహన అవసరం. లేకపోతే సుఖవ్యాధులు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వంటి జబ్బుల బారినపడొచ్చు. అందువల్ల లైంగిక సంపర్కం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ వివరించాల్సి ఉంటుంది. పిల్లలకే కాదు, తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్‌ అవసరం. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పెద్దవాళ్లు మారాల్సిన అవసరాన్ని వివరించాల్సి ఉంటుంది.

* విషయగ్రహణ చికిత్స: ఇందులో ఆలోచనా విధానాన్ని మార్చుకోవటానికి వీలుగా శిక్షణ ఇస్తారు. ఇది ప్రవర్తన మెరుగుపడటానికి తోడ్పడుతుంది.

* మందులు: మానసిక సమస్యలకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మొహమాట పడకుండా వీటిని తీసుకోవటం మంచిది. ఇవి ఏకాగ్రత, ఆలోచనా శక్తి మెరుగుపడటానికి దోహదం చేస్తాయి. చికాకులు తగ్గుతాయి.

పునరావాసం: మత్తుమందులు, మాదకద్రవ్యాలు, మద్యం వ్యసనాల నుంచి బయటపడ్డవారిని తిరిగి వాటివైపు మళ్లకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రిహాబిలిటేషన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీంతో మళ్లీ సమాజంతో మమేకం కావటానికి వీలవుతుంది.

Tags: childrens

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని