వ్యాధులు - బాధలు

Published : 26/02/2019 01:24 IST
వినికిడి లోపం పెద్దదే!

వినికిడి లోపాన్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. ‘ఏదో వయసుతో పాటు వస్తుందిలే’ అని తేలికగా తీసేస్తుంటారు. కానీ ఇది కేవలం శబ్దాలు వినపడకపోవటంతోనే ఆగిపోవటం లేదు. మతిమరుపు, కుంగుబాటు, కిందపడిపోవటం వంటి ఇతరత్రా సమస్యలకూ దారితీస్తోంది. చివరికి గుండెజబ్బు ముప్పు పెరగటానికీ కారణమవుతోందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వినికిడిలోపం ఆరంభమైన కేవలం ఐదేళ్లలోనే డిమెన్షియా ముప్పు 50%, కుంగుబాటు ముప్పు 40% మేరకు పెరుగుతున్నట్టు జాన్స్‌ హాప్కిన్స్‌ పరిశోధకులు గుర్తించారు. చెవులు సరిగా వినబడనివారు సహజంగానే నలుగురిలోకి రావటానికి ఇబ్బంది పడుతుంటారు. ఇది క్రమంగా కుంగుబాటుకు దారితీస్తుంది. ఇక శబ్దాలు సరిగా వినబడనప్పుడు విషయగ్రహణతో ముడిపడిన మెదడులోని భాగాలు ప్రేరేపితం కావటమూ తగ్గుతుంది. ఫలితంగా మెదడు పనితీరూ మందగిస్తుంది. మరోవైపు వినీ వినపడని శబ్దాలను విడమరచుకోవటానికి మెదడు ఇంకాస్త ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. ఇవన్నీ డిమెన్షియాకు దారితీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పెద్దగా పట్టించుకోం గానీ మనం ఎక్కడ ఉన్నామనే విషయాన్ని గ్రహించటానికి చెవులు ఎంతగానో తోడ్పడతాయి. చెవులు సరిగా వినబడకపోతే చుట్టుపక్కల శబ్దాలు తెలియవు. అంతేకాదు.. కొందరికి ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో, ఏదో దూసుకొస్తున్నట్టూ అనిపిస్తుంటుంది. దీంతో కింద పడి గాయాల పాలయ్యే ప్రమాదమూ పొంచి ఉంటోంది. మరి వినికిడిలోపానికీ గుండెజబ్బులకూ సంబంధమేంటని అనుకుంటున్నారా? ఈ రెండూ రక్తనాళాల సమస్యతో ముడిపడినవే. నలుగురితో కలవలేకపోవటం, ఒత్తిడి కూడా దీనికి ఆజ్యం పోస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు.. వినికిడిలోపానికి చికిత్స తీసుకోనివారు తరచుగా ఆసుపత్రుల్లో చేరుతుండటంతో పాటు మరింత ఎక్కువకాలం ఆసుపత్రుల్లో ఉండాల్సి వస్తోందనీ తేలటం గమనార్హం. అంటే వినికిడిలోపం కన్నా దీంతో ముంచుకొస్తున్న సమస్యలే పెద్ద ప్రమాదాలుగా పరిణమిస్తున్నాయన్నమాట. కాబట్టి వినికిడిలోపాన్ని తేలికగా తీసుకోవటానికి వీల్లేదని గుర్తించటం అత్యవసరం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని