వ్యాధులు - బాధలు

Published : 05/02/2019 00:21 IST
నాలుక పూత ఎందుకు?

సమస్య - సలహా

సమస్య: నా వయసు 24 సంవత్సరాలు, నాలుగు నెలలుగా నాలుక పూతతో బాధపడుతున్నాను. మందులు వేసుకుంటున్నా మార్పు కనబడటం లేదు. దీనికి పరిష్కారం ఏదైనా ఉందా? లేకపోతే ఎల్లకాలం ఇలాగే వేధిస్తుందా?

- వెంకట్‌ చిలక (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మీరు సమస్యను వివరించారు గానీ లక్షణాలు తెలియజేయలేదు. నాలుక మంట పుడుతోందా? భోజనం చేస్తున్నప్పుడు మంట పెరుగుతోందా? కారం తగిలినప్పుడు మరింత మండుతోందా? అనేవి చెప్పలేదు. ఇలాంటి లక్షణాలేవీ లేకపోతే పెద్దగా బాధపడాల్సిన పనేమీ లేదు. నాలుక మధ్యలో కొంతభాగం ఎర్రగా అవటం (మీడియన్‌ రాంబాయిడ్‌ గ్లాసైటిస్‌).. అక్కడక్కడా తెల్లగా, ఎర్రగా అయ్యి నాలుక పటం మాదిరిగా కనబడటం (జాగ్రఫికల్‌ టంగ్‌) వంటి వాటిని చాలామంది నాలుక పూతగా భావిస్తుంటారు. ఇవి మామూలు సమస్యలే. మంట వంటి ఇబ్బందులేవీ ఉండవు. అయితే అన్నం తింటున్నప్పుడు, కారం తగిలినప్పుడు మంట పుట్టటం వంటి లక్షణాలు కనబడితే చాలావరకు బి విటమిన్ల లోపం కారణం కావొచ్చు. రైబోఫ్లావిన్‌, నియాసినమైడ్‌ తగ్గితే నాలుక బాగా ఎర్రగా పూసినట్టుగా.. అదే ఫోలిక్‌ యాసిడ్‌, బి12 తగ్గితే నాలుక నున్నగా కనబడుతుంది. మన నాలుక మీద రుచిమొగ్గలు ఉంటాయి. ఇవి తగ్గిపోతే నాలుక నున్నగా అవుతుంది (గ్లాసైటిస్‌). నాలుక ఎర్రగా పూసినట్టు కనబడుతుంది. బి విటమిన్ల లోపం మాత్రమే కాదు.. ఐరన్‌ లోపంతో తలెత్తే రక్తహీనత కూడా దీనికి దారితీయొచ్చు. దీర్ఘకాలం యాంటీబయోటిక్‌ మందులు వాడినపుడు పేగుల్లో మంచి బ్యాక్టీరియా చనిపోవటం మూలంగానూ నాలుక పూత రావొచ్చు. అలాగే విడవకుండా వేధించే విరేచనాలు, దీర్ఘకాల పోషణలోపం కూడా దీనికి కారణం కావొచ్చు. బాగా మంట పుట్టే కారం, మిరియాలు, అల్లం, మసాలాల వంటివి ఎక్కువగా తినేవారిలోనూ నాలుక నున్నగా అయ్యి ఎర్రగా కనబడొచ్చు. ఎన్‌ఎస్‌ఏఐడీ రకం నొప్పి మందులు వాడినప్పుడూ రావొచ్చు. సల్ఫామెథాక్జజోల్‌, టైట్రాసైక్లిన్‌ వంటి మందులు వికటించటం వల్ల కూడా కొందరికి నాలుక ఎర్రగా అవుతుంటుంది (స్టీవెన్స్‌ జాన్సన్స్‌ సిండ్రోమ్‌). అరుదుగా కొన్నిరకాల చర్మ సమస్యల్లోనూ నాలుక మీద గుల్లలు పడి నున్నగా అవ్వచ్చు. కొందరికి నాలుక చివర్లోనూ నంజుపొక్కులు తలెత్తి ఎర్రగా కనబడొచ్చు. కాబట్టి మీరు ఒకసారి మంచి అనుభవమున్న డాక్టర్‌ను సంప్రతించటం మంచిది. సమస్య చిన్నదే అయినా కచ్చితమైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవటం ముఖ్యం. మీ సమస్య బి విటమిన్లతోనే చాలావరకు నయమయ్యే అవకాశముంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గినట్టు తేలితే ఐరన్‌ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. తరచుగా పూత వస్తోందనీ అంటున్నారంటే ఒత్తిడితో బాధపడుతున్నారేమో చూసుకోవాలి. అలాంటిదేదైనా ఉంటే కౌన్సెలింగ్‌ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. అలాగే కారం, మసాలాలు తగ్గించటం.. తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవటం మంచిది.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన చిరునామా
సమస్య- సలహా సుఖీభవ
ఈనాడు ప్రధాన కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని