వ్యాధులు - బాధలు

Updated : 22/01/2019 14:50 IST
‘ఆలస్యం’ ఆయుక్షీణం!

‘ఆలస్యం’ ఆయుక్షీణం!

/>

ఆలస్యం అమృతం విషం అంటారు. దైనందిన వ్యహారాల గురించి చెప్పినప్పటికీ ఈ మాట ఆరోగ్యానికీ వర్తిస్తుంది. ఆలస్యంగా నిద్రపోయేవారి జీవనకాలం తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందరాళే లేచేవారితో పోలిస్తే.. ఆలస్యంగా పడుకొనే వారికి ఆయుష్షు క్షీణించే ముప్పు 10% వరకు  ఎక్కువవుతున్నట్టు బయటపడింది. ఆలస్యంగా పడుకునే అలవాటు గల 4.33 లక్షల మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఆలస్యంగా పడుకునేవారిలో మధుమేహం, మానసిక సమస్యలే కాదు.. నాడీసంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. నిద్ర వేళలు మారిపోవటం వల్ల జీవగడియారం దెబ్బతింటుంది. ఫలితంగా గ్లూకోజు జీవక్రియ, మూడ్‌ కూడా అస్తవ్యస్తమవుతాయి. మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఒంట్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. పలు దీర్ఘకాల సమస్యలకు ఇదే మూలమని అధ్యయనాలు హెచ్చరిస్తుండటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోయేవారిలో ప్రవర్తన, అలవాట్లు కూడా మారిపోవచ్చు. ఉదాహరణకు- సమతులాహారం తీసుకోకపోవటం, జంక్‌ఫుడ్‌ తినటం వంటివి చేయొచ్చు. మద్యం, పొగ వంటి దురలవాట్లకూ బానిసలవ్వొచ్చు. ఇలాంటివన్నీ జీవనకాలం తగ్గిపోవటానికి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు అనుమానిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందరాళే లేవటం అలవాటు చేసుకోవటం మంచిది. పనులను క్రమబద్ధీకరించుకోవటం ద్వారా ఇంటికి ఆఫీసు పనులను మోసుకురావటం తప్పుతుంది. సమయానికి నిద్రపోయేలా చూసుకోవచ్చు. మానసిక ఒత్తిడినీ  తగ్గించుకోవచ్చు.  రాత్రిపూట టీవీలు, మొబైల్‌ ఫోన్ల వంటి వాటికి అతిగా అతుక్కుపోకుండా చూసుకోవటం మేలు. అలాగే ఉదయం పూట పడకగదిలోకి వెలుతురు, ఎండ పడేలా చూసుకుంటే త్వరగా నిద్రలేవటానికి వీలుంటుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని