వ్యాధులు - బాధలు

Updated : 22/01/2019 14:52 IST
జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!

జ్ఞాపకశక్తిని నిలబెట్టండి!

మన జీవితంలో జ్ఞాపకశక్తి కీలకపాత్ర పోషిస్తుంది. మనం చేసే అన్ని పనులకూ ఇదే మూలం. కాబట్టి జ్ఞాపకశక్తి తగ్గకుండా చూసుకోవటం చాలా అవసరం. రోజూ కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని కాపాడుకోవచ్చు.* రోజువారీ పనుల ఒత్తిళ్లో.. లేనిపోని వాగ్వాదాలో.. ఇలాంటివన్నీ ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తాయి. నిజానికివి కొద్దిరోజుల్లో సర్దుకుపోతాయి గానీ దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తిపై  విపరీత ప్రభావం చూపొచ్చు. కాబట్టి ఒత్తిడిని నియంత్రించుకోవటం, తగ్గించుకోవటం అత్యవసరం. గాఢంగా శ్వాస తీసుకోవటం, యోగా, ఒక అంశం మీద దృష్టి నిలపటం వంటి పద్ధతులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు.
* కంటి నిండా నిద్రపట్టకపోతే ఆ రోజంతా చికాకుగా ఉండటం తెలిసిందే. ఏ విషయాలూ చప్పున గుర్తుకురావు కూడా. జ్ఞాపకశక్తికి నిద్ర ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నిద్రలోనే మనం నేర్చుకున్న విషయాలు జ్ఞాపకాలుగా స్థిరపడతాయి. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోయేలా చూసుకోవాలి. కొందరు నిద్రలేమికి మాత్రలు వేసుకుంటుంటారు గానీ ఇవి మెదడు పనితీరుకు ఆటంకం కలిగించి జ్ఞాపకశక్తి తగ్గేలా చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ముందుగా రోజూ సమయానికి నిద్రపోవటం, లేవటం.. పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవటం.. సాయంత్రం తర్వాత కాఫీ, టీలు తాగకపోవటం వంటి పద్ధతులను పాటించటం మంచిది.
* పొగ అలవాటు గుండె, ఊపిరితిత్తులకే కాదు.. మెదడుకూ చేటే. వయసుతో పాటు వచ్చే మతిమరుపు, ఇతర జ్ఞాపకశక్తి సమస్యలు పొగ తాగేవారిలోనే ఎక్కువ. పొగతాగనివారితో పోలిస్తే.. మధ్యవయసులో రోజుకు 2 పెట్టెల కన్నా ఎక్కువ సిగరెట్లు కాల్చేవారికి వృద్ధాప్యంలో డిమెన్షియా ముప్పు రెట్టింపు అవుతుంది.
* మద్యం మితిమీరినా మతిమరుపు, డిమెన్షియా ముప్పు పెరుగుతుంది. మద్యం అలవాటు గలవారు సరకులను గుర్తుంచుకోలేకపోవటం వంటి పనులను సరిగా చేయలేరు. ఇక దీర్ఘకాలంగా విటమిన్‌ బి1 లోపం గలవారికి మద్యం దుష్ప్రభావాలు కూడా తోడైతే హఠాత్తుగా మతిమరుపు తలెత్తే ప్రమాదమూ ఉంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని