వ్యాధులు - బాధలు

Updated : 13/08/2019 02:38 IST
అప్పుడే జుట్టు నెరిసిందేం?

సమస్య - సలహా

సమస్య: నా వయసు 26 సంవత్సరాలు. అప్పుడే జుట్టంతా నెరిసిపోయింది. దీనికి ఏదైనా పరిష్కారముందా?

- మహిపాల్‌ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: మరీ చిన్న వయసులో జుట్టంతా నెరిసిపోవటమనేది అరుదు. సాధారణంగా కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే.. జన్యుపరంగా ఒకరి నుంచి మరొకరికి వస్తుంటుంది. మీ వయసును బట్టి చూస్తుంటే ఇదే ప్రధాన కారణంగా అనిపిస్తోంది. కొందరికి పోషణలోపంతోనూ త్వరగా జుట్టు నెరిసిపోవచ్చు. మెలి తిప్పటానికి, త్వరగా పొడిబారటానికి వెంట్రుకలకు ఎక్కువ వేడి తగిలేలా చేసినా వర్ణ ద్రవ్యం (మెలనిన్‌) దెబ్బతిని జుట్టు తెల్లబడొచ్చు. రంగులు, షాంపూల వంటి సౌందర్య సాధనాల్లోని రసాయనాలతోనూ కొందరికి వెంట్రుకలు త్వరగా నెరవొచ్చు. విటమిన్‌ బి12 లోపం, థైరాయిడ్‌ సమస్యల వంటివీ జట్టు నెరవటానికి దారితీయొచ్చు. ఇలాంటి సమస్యలకు చికిత్స తీసుకుంటే జుట్టు తిరిగి నల్లబడుతుంది. జన్యుపరంగా జుట్టు తెల్లబడితే మాత్రం చేయగలిగిందేమీ లేదు. అయితే మరీ త్వరగా నెరవకుండా చూసుకునే అవకాశముంది. ఇందుకు విటమిన్‌ మాత్రలతో పాటు క్యాల్షియం పాంటోథినేట్‌తో కూడిన మాత్రలు, మెలనిన్‌తో తయారుచేసిన లోషన్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకు 6 నెలల వరకు వాడుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. జుట్టు పూర్తిగా నల్లబడటం సాధ్యం కాకపోయినా కొంతవరకు రంగు మెరుగవుతుంది. అసలు మందులు, చికిత్సల కన్నా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. వెంట్రుకలు చాలావరకు ప్రొటీన్‌తో తయారవుతాయి. అందువల్ల ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే పప్పులు, సోయాబీన్స్‌, పుట్టగొడుగులు, మొలకలు, ఉడకబెట్టిన వేరుశనగలు, చిక్కుళ్ల వంటివి తీసుకోవటం మంచిది. మాంసాహారులైతే గుడ్డు తెల్లసొన, చేపలు, చికెన్‌ తినొచ్చు. అలాగే బాదం పప్పు, ఖర్జూరం కూడా తీసుకుంటే మేలు. ఖర్జూరంలో ఐరన్‌ దండిగా ఉంటుంది. ఇది జుట్టుకు రంగునిచ్చే మెలనిన్‌ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడుతుంది. ఏదేమైనా మీరు ఒకసారి వెంట్రుకల నిపుణులను సంప్రదించటం ఉత్తమం. కారణాన్ని గుర్తించి అవసరమైన చికిత్స చేస్తారు.

మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను పంపాల్సిన 
చిరునామా  
సమస్య - సలహా సుఖీభవ  ఈనాడు ప్రధాన కార్యాలయం,  
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 
email:  sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని