వ్యాధులు - బాధలు

Published : 06/08/2019 01:48 IST
శరీరమెంతో మనసూ అంతే!

త్తిడిని మనసులోనే దాచుకోవటం తగదు. సమస్యను గుర్తించటం, బయటకు చెప్పుకోవటం, అవసరమైతే చికిత్స తీసుకోవటం ముఖ్యం. ఒత్తిడితో బాధపడేవారికే కాదు, చుట్టుపక్కల వాళ్లకూ అవగాహన అవసరం. చాలామంది చేసే పొరపాటు సమస్యను అర్థం చేసుకోకపోవటం. ఎవరైనా ఒత్తిడికి లోనవుతున్నామని చెబితే చుట్టుపక్కలవాళ్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సానుభూతితో విని.. దాన్నొక సమస్యగా అంగీకరించటం చాలా కీలకం. మనలో చాలామంది ‘నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో, సానుకూలంగా ఆలోచించు, ప్రయత్నం చేస్తే అంతా తగ్గిపోతుంది, దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు’ అని సలహాలు ఇస్తుంటారు. నిజానికి ఒత్తిడితో బాధపడేవారు తనకే అలా జరుగుతుందేమో, తానొక్కడినే విఫలమవుతున్నానేమో అని అనుకుంటూ ఉంటారు. తనలోనే ఏదో లోపముందని, తనొక్కడినే సమస్యలు చుట్టుముడుతూ వస్తున్నాయని చింతిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము చెప్పేది పక్కవాళ్లు వినిపించుకోకపోతే మొత్తంగా మాట్లాడటమే మానేస్తుంటారు. ఇది సరికాదు.

ఒత్తిడి ఎక్కడ్నుంచి మొదలవుతోందనేది గుర్తించటానికీ  ప్రయత్నించాలి. ఇది ఏదో ఒక పరిస్థితి నుంచో.. ఉన్నట్టుండో మొదలయ్యేది కాదు. చిన్న చిన్నగా గూడు కట్టుకుంటూ తీవ్రరూపం దాలుస్తూ వస్తుంది. ట్రాఫిక్‌లో చిక్కుకోవటం, బాస్‌తో చివాట్లు, స్నేహితులతో గొడవలు, ఎక్కువ ఖర్చుపెట్టటం.. ఇలాంటివన్నీ చిన్నవే కావొచ్చు. వీటిని తట్టుకోలేని, ఎదుర్కోలేనివారికి ఇవే పెద్దగా తోస్తాయి. ఇలాంటి అనుభవాలన్నీ గూడు కట్టుకుంటూ వచ్చి.. పెద్ద సమస్యగా తయారవుతాయి. ఒత్తిడి అందరిలో ఒకేలా బయటపడదు. కొందరికి చిరాకు, కొందరికి దుఃఖం, కొందరికి ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి రూపాల్లో బయటపడొచ్చు. సమస్యను ఈ స్థాయిలోనే పట్టుకోకపోతే కుంగుబాటు, ఆందోళన వంటి తీవ్ర సమస్యల్లోకీ జారిపోవచ్చు.

ఎప్పుడు సమస్యాత్మకం?
ఒత్తిడితో దైనందిన వ్యవహారాలు దెబ్బతింటున్నాయంటే సమస్యాత్మకంగా పరిణమించినట్టే. పనిలో సామర్థ్యం తగ్గటం, ఇంట్లోవాళ్లతో సరిగా మాట్లాడకపోవటం, స్నేహితులతో కలవకపోవటం, ఎక్కడికీ వెళ్లటానికి ఇష్టపడకపోవటం వంటివి గుర్తిస్తే సమస్య ముదురుతోందనే అర్థం. నిద్ర పట్టకపోవటం, ఆకలి వేయకపోవటం, అతిగా తినటం, నిరాశ, నిస్పృహ.. భవిష్యత్తు అంధకారంగా కనిపించటం, బతకటం నిరర్థకమని అనిపించటం వంటివన్నీ హెచ్చరిక సంకేతాలే. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా తమకు తాము ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. చుట్టుపక్కల వాళ్లతో, సన్నిహితులతో మనసు విప్పి చెప్పుకోవటం బాగా ఉపయోగపడుతుంది. దీంతో చాలావరకు ఉపశమనం కలుగుతుంది. సమస్యను మరో కోణంలోంచి చూడటం, పరిష్కారం కనుగొనటం అలవడతాయి. ఒకవేళ ఎక్కడో దూరంగా.. ఊరుకాని ఊళ్లో ఉన్నప్పుడు, మాట పంచుకోవటానికి ఎవరూ దొరకనప్పుడు మనసులోని భావాలను నోట్‌ పుస్తకంలో రాసుకోవటం మంచిది. దీంతో ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ‘ఓహో.. ఈ విషయాన్ని నేనిలా ఆలోచిస్తున్నానా? ఇదంత సీరియస్‌ విషయం కాదేమో’ అనేవి అవగతమవుతాయి. అలాగే మనసుకు నచ్చిన వ్యాపకాన్నీ (హాబీ) అలవాటు చేసుకోవాలి. మనం పొద్దుట్నుంచీ రాత్రివరకూ దైనందిన వ్యవహారాల్లో బిజీగా ఉంటాం. అందువల్ల మనకంటూ ఓ ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకోవటం మంచిది. ఆ సమయంలో పెంపుడు జంతువులతో గడపటం, సంగీతం, డ్రాయింగ్‌ వంటివి కొనసాగిస్తే మంచి ఫలితం కనబడుతుంది. ఇలాంటి ప్రయత్నాలతో కుదరకపోయినా.. సమస్య తీవ్రమవుతున్నా మానసిక నిపుణులను సంప్రదించటం తప్పనిసరి. తమ గురించి తెలిస్తే పక్కవాళ్లు ఏమనుకుంటారో ఏమోననే అనవసర భయాలు, అపోహలతో చాలామంది డాక్టర్‌ దగ్గరికి వెళ్లటానికి వెనకాడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. శరీరానికి ఏ చిన్న సమస్య వచ్చినా డాక్టర్‌ దగ్గరికి వెళ్లినట్టే మనసుకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా నిపుణుల సహాయం తీసుకోవాలి. ఒత్తిడిని అర్థం చేసుకోవటానికి, దాన్నుంచి బయటపడటానికి కౌన్సెలింగ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. అవసరమైతే కుంగుబాటు, ఆందోళన లక్షణాలను తగ్గించే మందులూ తీసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని