వ్యాధులు - బాధలు

Published : 29/12/2020 00:37 IST
మద్యంతో మరింత చలి!

లి నుంచి కాపాడుకోవటానికి కొందరు మద్యం తాగటం చూస్తుంటాం. దీంతో లాభం కన్నా నష్టమే ఎక్కువ. మద్యం తాగిన తర్వాత ఒళ్లు కాస్త వెచ్చబడినట్టు అనిపించటం నిజమే. అయితే ఇదేమీ ఎక్కువసేపు ఉండేది కాదు. తాత్కాలిక ప్రభావమే. మద్యం రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ముఖ్యంగా చర్మం కింది సూక్ష్మ రక్తనాళాలు విప్పారతాయి. దీంతో చర్మానికి రక్త సరఫరా పెరిగి, వేడి భావన కలుగుతుంది. ఇది చలి నుంచి కాపాడుకోవటానికి శరీరం చేసే ప్రయత్నానికి విరుద్ధం. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒంట్లోంచి వేడి బయటకు వెళ్లకుండా మన శరీరం రక్తనాళాలు సంకోచించేలా చేసుకుంటుంది. మద్యం తాగితే ఈ రక్షణ ప్రక్రియ దెబ్బతింటుంది. చర్మానికి రక్త సరఫరా పెరుగుతుంది. బయటి చలి ప్రభావానికి ఇది త్వరగా చల్లారుతుంది కూడా. మరోవైపు రక్త ప్రసరణ మూలంగా పుట్టిన వేడిని చల్లార్చుకోవటానికి చెమట్లు పడుతుంటాయి.  ఫలితంగా ఒంట్లోని అవయవాల ఉష్ణోగ్రత (కోర్‌ టెంపరేచర్‌) తగ్గుతుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే చాలా వేగంగా శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. శరీర ఉష్ణోగ్రత అతిగా పడిపోతే తలతిప్పు, సరిగా మాట్లాడలేకపోవటం, ఏకాగ్రత కొరవడటం వంటి దుష్ప్రభావాలెన్నో ముంచుకొస్తాయి. ఇక అతిగా మద్యం తాగటం వల్ల అధిక బరువు, గుండెజబ్బులు, కాలేయ జబ్బులు, క్యాన్సర్ల వంటి సమస్యల ముప్పులూ పెరుగుతాయి. కాబట్టి చలి నుంచి కాపాడుకోవటానికి మద్యం తాగటం కన్నా వీలైనంతవరకు ఇంట్లోనే ఉండటం, ఉన్ని దుస్తులు ధరించటం, తలకు చెవులకు మఫ్లర్‌ కట్టుకోవటం, విటమిన్‌ సితో కూడిన పుల్లటి పండ్లు తినటం, చర్మానికి తరచూ మాయిశ్చరైజర్లు రాసుకోవటం మంచిది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని