వ్యాధులు - బాధలు

Published : 15/12/2020 01:08 IST
అటు మధుమేహం.. ఇటు కాలుష్యం

ధుమేహంతో బాధపడుతున్నారా? లేదూ ముందస్తు మధుమేహం.. అదే మధుమేహంలోకి అడుగుపెట్టే దశలో ఉన్నారా? అయితే వాయు కాలుష్యం బారినపడకుండా చూసుకోండి. లేకపోతే ఊపిరితిత్తులు తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతినే ప్రమాదముంది. మధుమేహం, ఇన్సులిన్‌ నిరోధకతలతో ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడే (ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌) ముప్పు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఇందుకు ఓజోన్‌తో కలుషితమైన వాతావరణం ఆజ్యం పోస్తుండటం గమనార్హం. ఇంటర్‌స్టిషియల్‌ లంగ్‌ డిసీజ్‌ తీవ్ర సమస్య. దీని బారినడ్డవారిలో ఊపిరితిత్తుల్లోని గాలి గదులు, రక్తనాళాలు, శ్వాస మార్గాల చుట్టూరా ఉండే మృదువైన కణజాలం గట్టిపడుతుంది. దీంతో ఊపిరితిత్తులు వ్యాకోచించటం తగ్గుతుంది. శ్వాస ఆడటం కష్టమవుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరిగిపోతుంది. ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. ఒకసారి ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడితే తిరిగి మామూలు స్థాయికి రావటం అసాధ్యం. సాధారణంగా ఆజ్‌బెస్టాస్‌ వంటి హానికర పదార్థాలకు దీర్ఘకాలంగా గురికావటం వల్ల ఇది తలెత్తుతుంటుంది. కీళ్లవాతం వంటి స్వీయ రోగనిరోధక సమస్యలూ కారణం కావొచ్చు. ఇప్పుడు ఓజోన్‌, మధుమేహం సైతం దీనికి దోహదం చేస్తున్నట్టు తేలటం గమనార్హం. ఆజ్‌బెస్టాస్‌ మాదిరిగానే ఓజోన్‌ కూడా వాయు కాలుష్య కారకమే. ఇన్సులిన్‌ నిరోధకత, మధుమేహం సైతం స్వీయ రోగనిరోధక సమస్యలే. ఇవి రెండూ తోడై ఊపిరితిత్తుల్లో వాపు ప్రక్రియను ప్రేరేపించి, చెరగని మచ్చపడేలా చేసి.. చివరికి మృదువైన కణజాలాన్ని గట్టిపరుస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. పట్టణాల్లో కాలుష్యం ఎక్కువవుతుండటం.. ముందస్తు మధుమేహం, మధుమేహం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇది మరింత కలవరం కలిగిస్తోంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని