వ్యాధులు - బాధలు

Published : 01/12/2020 01:17 IST
మామూలు కాన్పవుతుందా?

సమస్య-సలహా

సమస్య: నా వయసు 29 ఏళ్లు. నాకు 15 నెలల క్రితం సిజేరియన్‌ కాన్పు అయ్యింది. సెప్టేట్‌ యూటెరస్‌ మూలంగా బిడ్డ ఎదురు కాళ్లతో ఉందని, సిజేరియన్‌ తప్పనిసరని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు రెండోసారి గర్భం ధరించాను. ప్రస్తుతం తొమ్మిదో నెల. నేను ఇప్పుడు మామూలు కాన్పు కోసం ప్రయత్నించొచ్చా? సిజేరియన్‌ కాన్పయితే కుటుంబ నియంత్రణ ఆపరేషనూ చేయించుకోవచ్చా? కొంతకాలం ఆగాలా? ట్యూబెక్టమీ మంచిదా? వాసెక్టమీ మంచిదా?

- శ్రావ్య వాణి (ఇ-మెయిల్‌ ద్వారా)

సలహా: తొలి కాన్పు సిజేరియన్‌ అయినా రెండోసారి మామూలు కాన్పుకు ప్రయత్నించొచ్చు. అయితే మీరు సెప్టేట్‌ యూటెరస్‌ ఉందంటున్నారు. ఇందులో గర్భాశయం మధ్యలో ఒక పొర (సెప్టమ్‌) అడ్డుగా ఉంటుంది. కొందరికిది గర్భాశయంలో సగం వరకే ఉండొచ్చు. కొందరికి గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్‌) వరకూ ఉండొచ్చు. ఇలాంటి స్థితిలో గర్భధారణ జరిగితే ఒక వైపు పిండం, మరోవైపు మాయ ఉంటుంది. దీంతో కాన్పు సమయంలో బిడ్డ గానీ మాయ గానీ కిందికి దిగటం కష్టం కావొచ్చు. నొప్పులు సరిగా రాకపోవచ్చు. మీకు సెప్టమ్‌ తీసేశారా? లేదా? అన్నది తెలియజేయలేదు. దీన్ని తీసేసినట్టయితే ఇబ్బందేమీ ఉండదు. మాయ ఎటువైపు ఉంది, బిడ్డ తల ఎటువైపు ఉందన్నదీ ముఖ్యమే. ఇవన్నీ సరిగ్గా ఉంటే మామూలు కాన్పు కోసం ప్రయత్నించొచ్చు. బిడ్డ ఎదురు కాళ్లతో ఉంటే సిజేరియన్‌ తప్పదు. కాన్పు అయ్యాక గర్భాశయ వ్యవస్థ తిరిగి మామూలు స్థితికి రావటానికి 18 నెలలు పడుతుంది. మీరు 15 నెలల లోపే రెండో గర్భం ధరించారు. గర్భాశయ వ్యవస్థ ఇంకా పూర్తిగా కుదురుకొని ఉండకపోవచ్చు. సిజేరియన్‌ చేసినప్పుడు గర్భసంచికి వేసిన కుట్లు మామూలు కాన్పు కోసం ప్రయత్నించేటప్పుడు చిట్లిపోయే ప్రమాదముంది. సెప్టేట్‌ యూటెరస్‌ పొరను తొలగించక పోయినట్టయితే కుట్లు చిట్లిపోయే ముప్పు ఎక్కువ. ఇలాంటిది గుర్తిస్తే వెంటనే సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది. కుటుంబ నియంత్రణ విషయానికి వస్తే- మీరు సిజేరియన్‌తో పాటు ట్యూబెక్టమీ చేయించుకోకపోవటమే మంచిది. రెండో బిడ్డకూ టీకాలు ఇవ్వటం పూర్తయిన తర్వాతే భరోసాతో ఉండొచ్చు. మీరు కనీసం 5 సంవత్సరాలు ఆగాకే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోవటం మంచిది. ట్యూబెక్టమీ కన్నా మగవారికి చేసే వాసెక్టమీ చాలా తేలికైనది.  ఐదు నిమిషాల్లోనే పూర్తవుతుంది. కోత, కుట్టులేని వాసెక్టమీ పద్ధతీ అందుబాటులో ఉంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని