వ్యాధులు - బాధలు

Updated : 10/11/2020 01:30 IST
నెలసరి అవటం లేదేం?

సమస్య-సలహా

సమస్య: మా అమ్మాయికి 21 ఏళ్లు. బరువు 56 కిలోలు. తనకి ఆరు నెలలుగా నెలసరి రావటం లేదు. ఇంతకుముందు సరిగానే వచ్చేది. ఇలా జరగటం ఇదే మొదటిసారి. ఒక డాక్టర్‌కు చూపిస్తే పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉందని చెప్పారు. కొవ్వుకు నెలసరికి ఏం సంబంధం? మా అమ్మాయికి నెలసరి సరిగా రావాలంటే ఏం చెయ్యాలి?

-జి.శాంతికిరణ్‌ (ఇ-మెయిల్‌ ద్వారా)

సలహా:

మీ అమ్మాయి మాదిరిగా చిన్న వయసులో నెలసరి సరైన సమయానికి రాకపోవటం ఇటీవలి కాలంలో ఎక్కువగానే చూస్తున్నాం. ఎప్పుడైనా నెలసరి కాస్త ఆలస్యమైతే పెద్దగా భయపడాల్సిన పనిలేదు గానీ మూడు నెలలు దాటినా రుతుక్రమం జరగకపోతే నిర్లక్ష్యం పనికిరాదు. కారణమేంటో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అండాశయాల్లో నీటి తిత్తులు (పీసీఓస్‌), థైరాయిడ్‌ సమస్యలు, ఒత్తిడి వంటివి నెలసరి ఆలస్యమయ్యేలా చేయొచ్చు. చాలామంది లావుగా ఉంటేనే పీసీఓస్‌ వస్తుందని అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. సన్నగా ఉన్నా రావొచ్చు. పైగా మీ అమ్మాయికి పొట్టలో కొవ్వు ఎక్కువగా ఉందని డాక్టర్‌ చెప్పారని అంటున్నారు. ఇలా అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు (విసెరల్‌ ఫ్యాట్‌) రకరకాల అనర్థాలకు దారితీస్తుంది. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది. రక్తంలో కొవ్వుల స్థాయులు పెరిగిపోవచ్చు. పొట్టలో కొవ్వు జీవక్రియల రుగ్మతకు (మెటబాలిక్‌ డిజార్డర్‌) దారితీస్తుంది. ఇలాంటి వారిలో ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తుతుంది. అంటే కణాలు ఇన్సులిన్‌కు స్పందించవన్నమాట. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి. దీంతో క్లోమగ్రంథి మరింత ఎక్కువగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్‌ స్థాయులు పెరిగితే సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తీ ఎక్కువవుతుంది. ఫలితంగా అండం విడుదల కాదు. నెలసరి రావటం ఆలస్యమవుతుంది. ముందుగా మీ అమ్మాయిని మంచి గైనకాలజిస్టుకు చూపించండి. పీసీఓస్‌, మానసిక ఒత్తిడి, థైరాయిడ్‌ సమస్యలు, ప్రొలాక్టిన్‌ ఎక్కువగా ఉత్పత్తి కావటం వంటి సమస్యలేవైనా ఉన్నాయేమో పరీక్షిస్తారు. తగు చికిత్స చేస్తారు. ముందుగా ప్రొజెస్టిరాన్‌ ఇచ్చి.. ఈస్ట్రోజెన్‌లాంటి హార్మోన్‌ స్థాయులు పెరుగుతున్నాయా? లేదా? అనేది గమనిస్తారు. తర్వాత అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ వంటి పరీక్షలు చేసి కారణాలను అన్వేషిస్తారు. అనంతరం అవసరమైన మందులు సూచిస్తారు. వీటిని వేసుకోవటంతో పాటు జీవనశైలి పరంగానూ మార్పులు చేసుకోవాలి. సన్నగా ఉన్నాం కదా ఏం తిన్నా ఏమీ కాదులే, వ్యాయామం చేయకపోయినా ఫర్వాలేదులే అనుకోవద్దు. వ్యాయామంతో ఇన్సులిన్‌ పనితీరు మెరుగవుతుంది. ఫలితంగా పీసీఓస్‌, థైరాయిడ్‌ వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. వ్యాయామంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఇవన్నీ నెలసరి సక్రమంగా కావటానికి తోడ్పడేవే.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని