వ్యాధులు - బాధలు

Published : 14/11/2020 11:27 IST
మధుమేహం మీద  నిద్రలేమి పిడుగు

కంటి నిండా నిద్రపోతే ఆ హుషారే వేరు. ఆ ఆరోగ్యమే వేరు. ఇది మధుమేహులకు మరింత అవసరం. ఎందుకంటే నిద్రకూ మధుమేహానికీ విడదీయరాని సంబంధముంది. ఒకరోజు నిద్ర అస్తవ్యస్తమైనా రక్తంలో గ్లూకోజు స్థాయులపై విపరీత ప్రభావం పడుతుంది మరి. నిద్ర సరిగా పట్టకపోతే గ్లూకోజును నియంత్రించే హార్మోన్ల తీరుతెన్నులన్నీ మారిపోతాయి. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఇన్సులిన్‌ గురించి. గాఢనిద్రలోనే ఇన్సులిన్‌ ఉత్పత్తి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే ఇన్సులిన్‌ అంతగా ఉత్పత్తి కాదు. దీంతో ఉదయం లేచేసరికే గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిపోయి ఉంటాయి. మరోవైపు నిద్రలేమితో ఇన్సులిన్‌ నిరోధకత కూడా తలెత్తుంది. దీనికి కొంతవరకు థైరాయిడ్‌ను ప్రేరేపించే హార్మోన్, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ దోహదం చేస్తాయని చెప్పుకోవచ్చు. కణాలు గ్లూకోజును స్వీకరించేలా చేసేది ఇన్సులినే. ఇన్సులిన్‌ నిరోధకత తలెత్తితే కణాలు గ్లూకోజును స్వీకరించవు. ఫలితంగా గ్లూకోజు స్థాయులు పెరిగిపోతాయి. నిద్రలేమితో ఒత్తిడిని పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ సైతం ఉత్పత్తి అవుతుంది. ఇది గ్లూకోజు స్థాయులు పెరిగేలా చేయటమే కాదు, క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల పనితీరునూ తగ్గిస్తుంది. వీటితోనే అయిపోలేదు. నిద్రలేమితో కడుపు నిండిందనే సంకేతాలిచ్చే లెప్టిన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గిపోతాయి. అదే సమయంలో ఆకలిని పెంచే ఘ్రెలిన్‌ హార్మోన్‌ మోతాదులు పెరుగుతాయి. దీంతో ఒకవైపు ఆకలి పెరుగుతుంది. మరోవైపు కడుపు నిండిన భావన కలగదు. ఇది రెండిందాలా హాని చేస్తుంది. ఆకలి తీరక ఎక్కువెక్కువ తినటం, బరువు పెరగటం వంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బరువు పెరిగితే నిద్రలో శ్వాసకు అడ్డంకి తలెత్తే సమస్య (స్లీప్‌ అప్నియా) ముప్పూ పెరుగుతుంది. ఇదీ గ్లూకోజు స్థాయులు పెరిగేలా చేసేదే. నిద్రలేమితో తలెత్తే నిస్సత్తువతోనూ ఇబ్బందే. ఇది కుంగుబాటుకు దారితీస్తుంది. దీంతో ఆహార అలవాట్లూ మారిపోతాయి. ఇవన్నీ గ్లూకోజు నియంత్రణను దెబ్బతీసేవే.  

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని