వ్యాధులు - బాధలు

Published : 19/05/2020 00:20 IST
దుస్తులతో వస్తుందా?

సమస్య - సలహా

సమస్య: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో బయటకు వెళ్లి వస్తే దుస్తులను విప్పేయాలని, స్నానం చేయాలని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా? దుస్తులకు కరోనా వైరస్‌ అంటుకుంటుందా? ఇది జబ్బును కలగజేస్తుందా?

- పి. వాణి, హైదరాబాద్‌?

సలహా: రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో మీకు ఇలాంటి అనుమానం రావటం సహజమే. దుస్తులతో వైరస్‌ అంటుకోవటమనేది మీరు ఎక్కడికి వెళ్లారు? ఎంతసేపు ఉన్నారు? అక్కడి వ్యక్తుల ఆరోగ్యం ఎలా ఉంది? అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. మనదగ్గర ముఖానికి మాస్కు వేసుకోవటం తప్పనిసరి చేసినా అందరూ పాటించటం లేదు. ఇది చాలా ప్రమాదకరం. రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాలు, మార్కెట్లలో ఇలాంటి వారితో మరింత ముప్పు పొంచి ఉంటుంది. కరోనా ఉన్నా ప్రస్తుతం చాలామందిలో ఎలాంటి లక్షణాలు కనిపించటం లేదు. పైకి అంతా బాగా ఉన్నట్టే అనిపిస్తుంటుంది. పరీక్ష చేస్తే గానీ అసలు విషయం బయటపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు వైరస్‌ అంటుకోకూడదనేమీ లేదు. అదృష్టమేంటంటే కరోనా వైరస్‌ బరువుగా ఉండటం వల్ల చాలావరకు వెంటనే నేల మీద పడిపోతుంది. చిన్న తుంపర్లలోని వైరస్‌ అరగంట వరకు గాలిలో తేలియాడే అవకాశముందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి గానీ ఇది అంతగా దుస్తులకు అంటుకోకపోవచ్ఛు ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు మన చుట్టూరా గాలిని నెట్టివేస్తుంటాం. దీంతో వైరస్‌ మనకు దూరంగా జరిగిపోతుంది. కానీ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, బిగ్గరగా మాట్లాడుతున్నప్పుడు వెలువడే పెద్ద తుంపర్లు దుస్తులకు అంటుకుంటే మాత్రం ప్రమాదమే. కరోనా ఇన్‌ఫెక్షన్‌ గలవారు మన సమీపంలో గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా వెలువడే వైరస్‌ దుస్తులకు అంటుకోవచ్ఛు కరోనా గలవారు బెంచీల మీదో, కుర్చీల మీదో తుమ్మినా, దగ్గినా అక్కడ వైరస్‌ అంటుకోవచ్ఛు మనకు తెలియకుండా వాటిని తాకొచ్చు, అదే చేతులతో దుస్తులను ముట్టుకోవచ్ఛు లేదూ కూర్చోవచ్ఛు ఇలా కూడా వైరస్‌ బట్టలకు అంటుకోవచ్ఛు దుస్తులకు ఉండే ప్లాస్టిక్‌, లోహపు బొత్తాలకు ఇంకా పెద్ద మొత్తంలో వైరస్‌ అంటుకునే అవకాశముంది. వాటి మీద వైరస్‌ చాలాసేపు సజీవంగా ఉంటుంది. తెలిసో తెలియకో అలాగే ఇంట్లోకి వస్తే కుటుంబ సభ్యులకూ వైరస్‌ అంటుకోవచ్ఛు అందువల్ల కరోనా కలకలం తగ్గేంతవరకు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవటమే మంచిది. ఒకవేళ వెళ్తే మనకూ ఇతరులకు మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. రెండు మీటర్ల దూరంలో ఉంటే ఇంకా మంచిది. ఎక్కడైనా దూరం పాటించటం సాధ్యం కాకపోయినా, కరోనా అనుమానిత లక్షణాలు గలవారికి సన్నిహితంగా ఉన్నట్టు అనిపించినా, ఆసుపత్రులకు వెళ్లి వచ్చినా, జబ్బులతో బాధపడేవారిని పరామర్శించటానికి వెళ్లి వచ్చినా వెంటనే దుస్తులు విప్పేయాలి. ఇంటి బయటే దుస్తులు విప్పితే ఇంకా మంచిది. చెప్పులను సైతం ఇంట్లోకి తీసుకురావొద్ధు దుస్తులను సబ్బుతో ఉతికితే వైరస్‌ చనిపోతుంది. ఇంట్లోకి వచ్చాక తప్పకుండా స్నానం చేయాలి. దీంతో కుటుంబ సభ్యులనూ వైరస్‌ బారిన పడకుండా కాపాడుకున్నట్టు అవుతుంది.


జీవితాంతం ఉంటుందా?

సమస్య: కరోనా వైరస్‌ మన శరీరంలో జీవితాంతం ఉంటుందా?

- ఉప్పలపు శేషు, నైనవరం, కృష్ణా జిల్లా?

సలహా: కరోనాతో మనం కలిసి జీవించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతుండటం వల్ల మీకు ఇలాంటి అనుమానం వచ్చి ఉంటుంది. కరోనాతో కలిసి జీవించటమంటే అది మనలో జీవితాంతం ఉండి పోతుందని కాదు. ప్రామాణిక చికిత్సలు, టీకా అందుబాటులోకి వచ్చేంతవరకు మనకు కరోనా ముప్పు అలాగే ఉంటుందని.. వైరస్‌ ఎప్పుడైనా, ఎవరికైనా సోకే ప్రమాదముందని అర్థం. ఎవరికి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మెలగాల్సి ఉంటుందని చెప్పటమే దీని ఉద్దేశం. కరోనా వైరస్‌ ఎంత భయం కలిగిస్తున్నా ఇది హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి వైరస్‌ల మాదిరిగా ఎల్లప్పుడూ ఒంట్లోనే ఉండిపోయే రకం కాదు. చాలావరకు సుమారు 2 వారాల్లోనే ఒంట్లోంచి పోతుంది. పైగా ఇది అందరికీ ప్రమాదకరంగా పరిణమించటం లేదు. ఒక వారంలో ఉద్ధృత స్థితికి చేరుకొని, తర్వాత క్షీణిస్తూ వస్తోంది. రెండు వారాల్లో పూర్తిగా కనుమరుగైపోతోంది. అరుదుగా కొందరిలో 30, 40 రోజుల వరకు ఉండే అవకాశం లేకపోలేదు. కాకపోతే అది అప్పటికే బలహీన పడి ఉంటుంది. ఇలాంటి వైరస్‌ ఇతరులకు సోకే అవకాశమూ తక్కువే. చాలామందిలో సగటున 20 రోజుల పాటు వైరస్‌ ఒంట్లో ఉండే అవకాశముంది. అక్కడితో దాని కథ ముగిసిపోతుంది. ఇది జీవితాంతం అలాగే ఉండిపోతుందని భయపడాల్సిన పని లేదు. అయితే వైరస్‌ తిరిగి దాడి చేసే అవకాశముంటుందనే సంగతిని మరవొద్ధు అజాగ్రత్తగా ఉంటే మళ్లీ సోకొచ్ఛు కాబట్టి ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవటం వంటి జాగ్రత్తలు తప్పనిసరి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని