వ్యాధులు - బాధలు

Updated : 05/05/2020 04:02 IST
కీళ్లవాతం మందులు వేసుకోవచ్చా?

సమస్య సలహా

సమస్య: నా వయసు 54 సంవత్సరాలు. గత ఏడేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. మందులు వాడుతున్నాను. ఈ మందులతో కరోనా ఇన్‌ఫెక్షన్‌ ముప్పు పెరుగుతుందని కొందరు భయపెడుతున్నారు. ఇది నిజమేనా? మందుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

-డి.ఎస్‌. వాస్‌, హైదరాబాద్‌

సలహా: కీళ్లవాతం (రుమటాయిడ్‌) సమస్యలకు వాడే మందుల్లో కొన్ని రోగనిరోధక శక్తిని కాస్త అణచి ఉంచుతాయి. దీంతో కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకే ముప్పు పెరిగే అవకాశముందని కొందరు భయపడుతున్నారు. మీరూ అలాగే ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. కొన్ని కీళ్లవాతం మందులతో రోగనిరోధకశక్తి తగ్గే మాట నిజమే అయినా వీటితో ముప్పు పెరుగుతున్నట్టు ఎక్కడా బయటపడలేదు. కీళ్లవాతానికి వేసుకునే మందులతో దుష్ప్రభావాలు తలెత్తుతున్న దాఖలాలూ లేవు. అందువల్ల మీరు నిరభ్యంతరంగా మందులు వేసుకోవచ్ఛు పైగా కీళ్లవాతానికి వేసుకునే మందుల్లో కొన్ని కరోనా జబ్బు తగ్గటానికీ తోడ్పడతాయి. ముఖ్యంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇప్పటికే కరోనా జబ్బు చికిత్సలో వాడుతున్నారు. ఇది చాలా సురక్షితమైన మందు. దీంతో గుండె విద్యుత్‌ స్పందనలు తగ్గటం (క్యూటీ ప్రొలాంగేషన్‌), గుండె వేగంగా కొట్టుకోవటం వంటి దుష్ప్రభావాలు చాలా చాలా అరుదు. కీళ్ల వ్యాధుల్లో వాడుతున్న యాక్టీమెరా, సరిలుమాబ్‌ వంటి కొత్త మందులనూ కరోనా చికిత్సలో వాడుతున్నారు. అందువల్ల కరోనా భయంతో మందులు మానెయ్యటం గానీ మోతాదు తగ్గించడం గానీ చేయొద్ధు అలా చేస్తే ఉన్నట్టుండి కీళ్ల సమస్యలు ఉద్ధృతమయ్యే ప్రమాదముంది. ఒకవేళ కొవిడ్‌-19 బారినపడితే అప్పుడు మందులు ఆపెయ్యటం గానీ మందుల మోతాదు తగ్గించటం గానీ చేయాల్సి ఉంటుంది. మందులు క్రమం తప్పకుండా వేసుకోవటంతో పాటు పండ్లు, ముఖ్యంగా బత్తాయి వంటి పుల్లటి పండ్లు.. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన అవిసె గింజలు, అక్రోట్లు, సముద్రపు చేపలు తీసుకోవాలి. విటమిన్‌ డి మాత్రలూ వేసుకోవాలి. ఇవి రోగనిరోధకశక్తి పెరగటానికి తోడ్పడతాయి. ఇంట్లో ఉంటున్నా వ్యాయామం మానరాదు. కీళ్ల సమస్యలు గలవారికిది అత్యవసరం. లేకపోతే కీళ్లు బిగుసుకుపోతాయి. అంతేకాదు, కాలి సిరల్లో రక్తం గడ్డలు ఏర్పడటం, రక్తం గడ్డలు ఊపిరితిత్తుల్లోకి చేరుకోవటం, గుండెజబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలూ తలెత్తొచ్ఛు అప్పటికే ఇలాంటి సమస్యలుంటే మరింత తీవ్రమవుతాయి. కాబట్టి రోజూ 30-45 నిమిషాల సేపు వ్యాయామం చేయాలి. వ్యాయామంతో రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. యోగా, ధ్యానం సైతం మేలు చేస్తాయి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని