వ్యాధులు - బాధలు

Updated : 16/04/2020 20:19 IST
హెయిర్‌ డ్రయ్యర్‌తో కరోనా పోతుందా?

సమస్య: బయటి నుంచి కొనుక్కొచ్చిన కూరగాయలు, పండ్లు, సరుకుల సంచుల మీద హెయిర్‌ డ్రయ్యర్‌తో వేడి గాలి పడేలా చేస్తే కరోనా వైరస్‌ చనిపోతుందా? ప్రస్తుత తరుణంలో కూరగాయల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- టి.డి. ప్రసాదరావు, హైదరాబాద్‌

సలహా: కరోనా భయపెడుతున్న నేటి రోజుల్లో చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. ఇన్‌ఫెక్షన్‌ గలవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడిన తుంపర్ల ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న సంగతి తెలిసిందే. తుంపర్లు కుర్చీలు, టేబుళ్ల వంటి వస్తువుల మీద పడితే, వాటిని తాకిన చేత్తో నోరు, ముక్కు, కళ్లను ముట్టుకున్నా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. కూరగాయలు, సరుకుల విషయంలో అనుమానాలు రావటానికి ఇదే కారణమవుతోంది. కూరగాయలు, పండ్లు, సరుకులు  అమ్మేవారిలో ఇన్‌ఫెక్షన్‌ గలవారు లేదా ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా లక్షణాలేవీ లేనివారు తగు జాగ్రత్తలు పాటించకుండా దగ్గినా, తుమ్మినా కూరగాయలకు, సంచులకు వైరస్‌ అంటుకునే అవకాశం లేకపోలేదు. ఈ అనుమానంతోనే కొందరు కూరగాయలను ఎండలో పెట్టటం, హెయిర్‌ డ్రయ్యర్‌తో వేడిగాలిని కొట్టటం వంటివి చేస్తున్నారు. వీటితో ఉపయోగమేమీ లేదు. వేడి వాతావరణంలోనూ వైరస్‌ బతికి ఉంటుండటమే దీనికి నిదర్శనం. కరోనా వైరస్‌ నివారణకు శుభ్రంగా కడగటం ఒక్కటే మార్గమని తెలుసుకోవాలి. నీటి ధార కింద కూరగాయలను కడిగితే ఇంకా మంచిది. నిజానికి వైరస్‌ ఉన్నా లేకపోయినా కూరగాయలు, పండ్ల మీద మట్టి, దుమ్ముధూళితో పాటు ఎరువులు, పురుగుమందుల అవశేషాలు ఉండొచ్చు. అందువల్ల నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కొందరు కూరగాయలు కోసిన తర్వాత కడుగుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కోయకముందే కూరగాయలను కడగాలి. నీటిలో కాస్త పొటాషియం పర్మాంగనేట్‌ ద్రావణం కలిపి కడిగితే పురుగు మందుల వంటివేవైనా ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఆ తర్వాత మంచి నీటితో కడగాకే వాడుకోవాలి. కూరగాయలను కడగటానికి ముందూ తర్వాతా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పచ్చి కూరగాయలు తినకపోవటం మంచిది. బాగా ఉడికించే తినాలి. ఉడికించినప్పుడు ఆ వేడికి వైరస్‌, బ్యాక్టీరియా వంటివేవైనా ఉంటే చనిపోతాయి. ఇక సంచుల విషయానికి వస్తే.. ప్లాస్టిక్‌ మీద సుమారు 3 రోజుల వరకు వైరస్‌ ఉంటుంది. సబ్బుతో కడిగితే ఇది పోతుంది. అందువల్ల అనుమానముంటే వెంటనే సంచులను సబ్బుతో రుద్ది కడిగేయాలి. లేదా సోడియం హైపోక్లోరైట్‌ 1% ద్రావణంలో ముంచి ఆరేయొచ్చు. ఒక లీటరు నీటికి 7 గ్రాముల బ్లీచింగ్‌ పొడిని కలిపితే సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణం తయారవుతుంది. ఇది వైరస్‌ నివారణకు బాగా పనిచేస్తుంది. తిరిగి వాడొద్దని అనుకుంటే ప్లాస్టిక్‌ సంచులను మూత ఉన్న చెత్తబుట్టలో వేయాలి. బట్ట సంచులైతే ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా ఉతుక్కుంటే సరిపోతుంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని