వ్యాధులు - బాధలు

Published : 18/02/2020 01:30 IST
గుండెజబ్బూ సంక్రమిస్తుంది!

గుండెజబ్బు, ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్‌ వంటి వాటిని ఇప్పటివరకూ సాంక్రమికేతర జబ్బులనే అనుకుంటున్నాం. వీటికి జన్యువులు, పరిసర ప్రభావాలు, జీవనశైలి వంటివే కారణమవుతున్నాయని.. ఒకరి నుంచి మరొకరికి అంటుకునే అవకాశం లేదని భావిస్తూ వస్తున్నాం. కానీ ఇవీ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చని బ్రిటిష్‌ కొలంబియా విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. ఇందుకు మన శరీరం మీద, లోపల నివసించే బ్యాక్టీరియా, ఫంగస్‌, వైరస్‌ల వంటి సూక్ష్మక్రిములే కారణమవుతుండటం గమనార్హం. ఊబకాయం, పేగుల్లో పూత, మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలతో బాధపడేవారి పేగుల్లో బ్యాక్టీరియా తీరుతెన్నులు మారిపోతుంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారి నుంచి సూక్ష్మక్రిములను తీసి జంతువుల్లో ప్రవేశపెట్టగా వాటిల్లోనూ అలాంటి జబ్బులు తలెత్తుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. సన్నిహితంగా ఉండేవారిలో సహజంగానే ఒంటి మీద, లోపల ఉండే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. దూరంగా నివసించే కవలలతో పోలిస్తే జీవిత భాగస్వాముల ఒంట్లో ఒకేరకం బ్యాక్టీరియా ఉండటమే దీనికి నిదర్శనం. అందుకే సూక్ష్మక్రిముల ద్వారా ఊబకాయం, గుండెజబ్బుల వంటివీ వ్యాపించే అవకాశం లేకపోలేదని పరిశోధకులు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి ఈ అధ్యయనం ఒక ఆలోచన రూపంలోనే మొదలైంది. అనూహ్య ఫలితాలు వెలువడటం అందరికీ విస్మయం కలిగించింది. దీనిపై వైద్యపరిశోధన రంగంలో విస్తృతమైన చర్చా నడుస్తోంది. మున్ముందు పరిశోధనల్లో ఇది కచ్చితంగా నిజమేనని తేలితే ప్రజారోగ్య పుస్తకాలన్నింటిని తిరగ రాసుకోవాల్సిన అవసరం ఏర్పడినా ఆశ్చర్యపోనవసరం లేదు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని