వ్యాధులు - బాధలు

Published : 04/02/2020 01:59 IST
మార్పు మంచిగా..

‘ఆ.. ఏమంటున్నారు?’.. ఇలా తరచూ చెవొగ్గి వినాల్సి వస్తోందా? ‘అక్కడేం ఉంది. సరిగా కనిపించటం లేదే’ అని కళ్లు నులుముకుంటూ చూస్తున్నారా? అయితే వయసు మీద పడుతోందని, జ్ఞానేంద్రియాల శక్తి సన్నగిల్లుతోందనే అర్థం. కొందరికి ఎదుటివాళ్లకు లేదా వస్తువులకు ఎంత దూరంలో ఉన్నామనేది పోల్చుకోవటమూ కష్టమైపోతుంటుంది. ఇలాంటివారికి నడుస్తున్నప్పుడు తూలుతున్నట్టూ అనిపిస్తుంటుంది. శరీరం కుదురుగా ఉండక ఇబ్బందికరంగానూ పరిణమిస్తుంటుంది. వినికిడి, చూపు లోపించటం.. దూరాలను పోల్చుకోలేకపోవటం వయసుతో పాటు సంభవించే మార్పులే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీలైనంతవరకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవచ్చు.
* మద్యం అతిగా తాగటం, పెద్ద పెద్ద శబ్దాల ప్రభావానికి గురికావటం, పొగ తాగటం వంటివి వినికిడి తగ్గటానికి దోహదం చేస్తాయి. అందువల్ల మద్యం అలవాటు గలవారు తగ్గించుకోవాలి. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే చోటుకు వెళ్తే చెవులకు మఫ్స్‌ వంటివి ధరించాలి. పొగ తాగే అలవాటుంటే మానెయ్యాలి. కొన్నిరకాల మందులూ వినికిడి తగ్గేలా చేయొచ్చు. ఆస్ప్రిన్‌ లేదా ఐబూప్రొఫెన్‌ అతిగా వేసుకుంటే వినికిడి దెబ్బతినొచ్చు. కొన్నిరకాల యాంటీబయోటిక్స్‌తోనూ ఈ ప్రమాదం లేకపోలేదు. అందువల్ల ఏవైనా మందులు వేసుకుంటుంటే డాక్టర్‌తో చెప్పటం, అవసరమైతే మార్పించుకోవటం మంచిది.
* చూపు తగ్గకుండా చూసుకోవటానికి మనం చేయగలిగింది పెద్దగా ఏమీ లేదు. కాకపోతే తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ వయసుతో పాటు వచ్చే మార్పులేనా? ఇతరత్రా సమస్యలేవైనా తలెత్తుతున్నాయా? అనేది చూసుకోవాలి. నలబై ఏళ్లు దాటాక ఏటా ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి. దీంతో నీటికాసులు, శుక్లాలు, మధుమేహంతో ముడిపడిన కంటి సమస్యలేవైనా ఉంటే ముందే తెలుసుకోవచ్చు. హఠాత్తుగా చూపు తగ్గటమనేది వృద్ధాప్యానికి సంబంధించింది కాదని, దీనికి సత్వరం చికిత్స తీసుకోవాలని తెలుసుకోవాలి.
* శరీరం తూలుతున్నట్టు, పాదాలు నేలకు ఆనటం లేదని అనిపిస్తుంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. ఇది వయసుతో పాటు వచ్చే సమస్యేనని నిర్లక్ష్యం చేయటానికి లేదు. విటమిన్‌ బి12 లోపం, పాదాల్లో నాడులు దెబ్బతినటం వంటి సమస్యలు కొన్నిసార్లు శరీరం తూలటానికి దారితీయొచ్చు. ఇవి వయసుతో పాటు వచ్చే మార్పులను మరింత తీవ్రం చేయొచ్చు. ఇలాంటి సమస్యలకు తగు చికిత్స తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
నలుగురితో కలివిడిగా
వినికిడి, చూపు తగ్గటం వంటి సమస్యల బారిన పడ్డప్పుడు చాలామంది ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. నలుగురితో కలవటానికి జంకుతుంటారు. ఇది సరికాదు. మలివయసు జీవిత ఆనందాలను చేజార్చుకోకుండా డాక్టర్‌ను కలిసి తగు చికిత్స తీసుకోవాలి. వినికిడి సాధనాలను, అద్దాలను వాడుకోవటం.. అవసరమైతే కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవటం ద్వారా రోజువారీ జీవనం గాడి తప్పకుండా చూసుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని