వ్యాధులు - బాధలు

Updated : 28/01/2020 14:02 IST
పరగడుపు గ్లూకోజు!

ఏదైనా తిన్న తర్వాత గ్లూకోజు పెరుగుతుందని తెలుసు. మరి ఏమీ తినక ముందు.. అదీ పరగడుపున గ్లూకోజు ఎక్కువగా (మార్నింగ్‌ హై) పెరిగితే? మధుమేహంతో బాధపడేవారిలో చాలామంది ఎదుర్కొనే సమస్యే ఇది. ఇలా ఏదో ఒకరోజు గ్లూకోజు ఎక్కువగా ఉండటం పెద్ద ఇబ్బందికరమేమీ కాదు గానీ వారంలో మూడు నాలుగు రోజులూ ఎక్కువగానే ఉంటుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. 

నిజానికి రాత్రి భోజనం చేసిన తర్వాత ఏడెనిమిది గంటల సేపు పడుకునే ఉంటాం. ఏమీ తిననైనా తినం.  అయినా గ్లూకోజు ఎందుకు పెరుగుతుంది? ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి.

హార్మోన్ల ఉద్ధృతి

మనం నిద్రపోతున్నప్పుడు శరీర కణాలు మరమ్మతు చేసుకోవటం ఆరంభిస్తాయి. ఇందుకు చాలా శక్తి అవసరమవుతుంది. అందుకే పడుకున్న తర్వాత అర్ధరాత్రి సమయంలో కార్టిజోల్, గ్రోత్‌ హార్మోన్, థైరాక్సిన్‌ వంటి హార్మోన్లు గ్లూకోజు ఉత్పత్తిని పెంచాలంటూ కాలేయానికి సూచనలు ఇస్తాయి. ఇలా పెరిగిన గ్లూకోజు స్థాయులకు అనుగుణంగా క్లోమంలోని బీటా కణాలు ఇన్సులిన్‌ ఉత్పత్తినీ పెంచుతాయి. అయితే మధుమేహుల్లో ఇన్సులిన్‌ అంతగా ఉత్పత్తి కాకపోవటం.. ఉత్పత్తి అయినా దానికి శరీర కణాలు స్పందించకపోవటం (ఇన్సులిన్‌ నిరోధకత) వల్ల నిద్రలేచే సమయానికి గ్లూకోజు స్థాయులు పెరిగే ఉంటాయి. మధుమేహుల్లో దాదాపు సగం మంది ఇలాంటి స్థితిని ఎదుర్కొనేవారే.

ఇన్సులిన్‌ ప్రభావం తగ్గటం

ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకునేవారిలో దీన్ని చూస్తుంటాం. రాత్రిపూట నిర్ధారించిన ఇన్సులిన్‌ మోతాదు సరిపోకపోవచ్చు. లేదూ 12 గంటల పాటు పనిచేసే దీర్ఘకాల ఇన్సులిన్‌ మోతాదు తక్కువగా ఉండొచ్చు. కారణమేదైనా రాత్రిపూట ఇన్సులిన్‌ స్థాయులు చాలకపోతే గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. ఒంట్లో ఇన్సులిన్‌ ఎంతకాలం పనిచేస్తుందన్నదీ ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. దీర్ఘకాలం పనిచేసే ఇన్సులిన్‌ను నిద్రపోవటానికి చాలా ముందుగానే తీసుకుంటే ఉదయం లేచేసరికి దాని ప్రభావం తగ్గిపోవచ్చు. కొందరు తక్కువకాలం పనిచేసే ఇన్సులిన్‌ సైతం తీసుకుంటుంటారు. దీని ప్రభావం ఉదయం లేచేసరికి తగ్గిపోతుంది. ఫలితంగా గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి. 

కాలేయం గ్లూకోజును తయారుచేయటం

రాత్రిపూట తిన్న ఆహారం, మందులకు శరీరం స్పందించే తీరు మూలంగానూ ఉదయం గ్లూకోజు పెరగొచ్చు. రాత్రి భోజనం మానేసినా, ఇన్సులిన్‌ మరీ ఎక్కువగా తీసుకున్నా గ్లూకోజు స్థాయులు బాగా పడిపోతాయి (హైపోగ్లైసీమియా). దీన్ని భర్తీ చేసుకోవటానికి కాలేయమే గ్లూకోజును ఎక్కువగా ఉత్పత్తి చేయటం ఆరంభిస్తుంది. దీంతో నిద్రలేచే సమయంలో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయి. దీన్నే సోమోగ్యీ ప్రభావం అంటారు. నిజానికి కొందరు వైద్యులు దీన్ని అంగీకరించరు. సోమోగ్యీ ప్రభావం ఉంటుందనైనా నమ్మరు. ఇది ఉన్నా లేకపోయినా గ్లూకోజు మోతాదులు మరీ పడిపోకుండా చూసుకోవటం మాత్రం ముఖ్యం.

ఏం చేయాలి?

• ముందుగా గ్లూకోజు తీరుతెన్నులను అర్థం చేసుకోవటం చాలా కీలకం. పడుకునే ముందు, మధ్యరాత్రి, నిద్ర లేచాక గ్లూకోజు మోతాదులను పరీక్షించుకోవటం ద్వారా ఎప్పుడెప్పుడు గ్లూకోజు పెరుగుతోందనేది తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిరంతరం గ్లూకోజు మోతాదులను తెలిపే పరికరాలు సైతం అందుబాటులో ఉన్నాయి. 

• పడుకునే ముందు నుంచీ ఉదయం వరకూ గ్లూకోజు ఎక్కువగానే ఉంటున్నట్టయితే- ఆహార పరిమాణం, దానికి తగినట్టుగా మందుల మోతాదులు లేకపోవటం కారణం కావొచ్చు. పడుకునే సమయంలో ఎక్కువగా తినటం, దానికి తగినట్టుగా ఇన్సులిన్‌ తీసుకోకపోవటం వల్ల రాత్రంతా గ్లూకోజు ఎక్కువగా ఉండే అవకాశముంది. మందుల మోతాదులను సవరించుకోవటం, ఎప్పుడు ఏం తినాలో చూసుకోవటం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు.

 దీర్ఘకాల ఇన్సులిన్‌ ప్రభావం తెల్లవారేసరికి తగ్గుతున్నట్టయితే- రాత్రి భోజనం చేసే సమయానికి బదులు పడుకునే ముందు ఇంజెక్షన్‌ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇన్సులిన్‌ తీసుకోనివారైతే సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయటం, రాత్రిపూట తక్కువగా తినటం వంటి మార్పులు చేసుకోవచ్చు. అవసరమైతే మందులనూ మార్చుకోవాల్సి రావొచ్చు.

 హార్మోన్ల ఉద్ధృతితో గ్లూకోజు పెరుగుతుంటే- తక్కువసేపు పనిచేసే ఇన్సులిన్‌ను రోజుకు 3, 4 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో గ్లూకోజు హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవచ్చు. ఇన్సులిన్‌ తీసుకోనివారిలోనైతే దీనికి చికిత్స కాస్త కష్టమే అనుకోవచ్చు. మందులను, మోతాదులను మార్చుకుంటూ తగినవాటిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇలాంటివారికి ఉదయం పూట వ్యాయామం కొంతవరకు మేలు చేయొచ్చు. 

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని