వ్యాధులు - బాధలు

Published : 07/01/2020 00:32 IST
గుండెకు మద్యం చేటు!

గుండెలయ తప్పటంతో (ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌) బాధపడుతున్నారా? మద్యం తాగే అలవాటూ ఉందా? అయితే వెంటనే మానెయ్యండి. గుండెలయ తప్పటంతో బాధపడేవారు మద్యాన్ని మానేస్తే లక్షణాలు తగ్గుముఖం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు మరి.   మద్యం మానేసినవారికి గుండెలయ తప్పటమనేది ఆలస్యమవటమే కాదు, ఒకవేళ వచ్చినా తక్కువసేపే ఉంటున్నట్టు తేలింది. మన గుండె రక్తాన్ని పంప్‌ చేసేటప్పుడు గట్టిగా బిగుసుకుంటుంది. కానీ గుండెలయ తప్పేవారిలో గుండె పై గదులు వణికిపోతుంటాయి. దీంతో రక్తం సరిగా పంప్‌ కాదు. కొంత రక్తం గుండెలోనే ఉండిపోతుంటుంది. ఇది రక్తం గడ్డలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఇవి రక్తంలో కలిసిపోయి అక్కడ్నుంచి ఇతర భాగాలకు వ్యాపించొచ్చు. మెదడులోకి రక్తం గడ్డలు చేరుకుంటే పక్షవాతం తలెత్తొచ్చు. అందువల్ల గుండెలయ తప్పటాన్ని తేలికగా తీసుకోవటానికి లేదు. మద్యానికి దూరంగా ఉంటే దీని దుష్ప్రభావాలను కొంతవరకైనా తప్పించుకోవచ్చు. నిజానికి మద్యం అలవాటు ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌ ముప్పునూ పెంచుతుంది. మద్యం మూలంగా గుండె కండరంలో మచ్చ పడటం (స్కారింగ్‌) వంటి మార్పులు మొదలవుతాయి. దీంతో గుండెలోని విద్యుత్‌ వ్యవస్థ అస్తవ్యస్తమై లయ తప్పిపోయే అవకాశముంది. గుండెలయ తప్పటానికి దోహదం చేసే ఊబకాయం, నిద్రలో శ్వాస ఆగటం, అధిక రక్తపోటు వంటి సమస్యలకూ మద్యానికీ సంబంధం ఉండటం గమనార్హం.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని